ఇంటర్ చదువుతున్న విద్యార్థినితో ప్రేమాయణం చివరికి ఓ యువకుడి ప్రాణాల మీదికి వచ్చింది. చివరికి గాయాలపాలై ప్రాణాలు కాపాడుకున్నాడు. కూతురిని ప్రేమ ముగ్గులోకి దింపిన యువకుడికి బుద్ధి చెప్పేందుకు బాలిక తండ్రి అంతా సినీ ఫక్కీలో ప్లాన్ చేసి చితకబాదాడు.
ప్రకాశం జిల్లా అద్దంకిలో బుధవారం ఈ ఘటన జరిగింది. మండల కేంద్రమైన పంగలూరు గ్రామానికి చెందిన సాయిమణికంఠ హైదరాబాద్‌లో టైల్స్ వర్క్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
మూడేళ్లుగా అద్దంకి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థినితో మణికంఠ ప్రేమ కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఈ విషయం విద్యార్థిని తండ్రి శ్రీనుకు తెలిసింది. మణికంఠపై రగిలిపోయాడు.
టీనేజ్‌లో మంచీచెడుల గురించి తెలియని అమాయక బిడ్డను మోసపూరితంగా ప్రేమ పేరుతో వల్లో వేసుకున్నాడని ఆ తండ్రి ఆగ్రహంతో కక్ష తీర్చుకోవాలనుకున్నాడు. ప్రేమకు శాశ్వతంగా ఫుల్స్టాప్ పెట్టాలంటే మణికంఠను హత్య చేయడం ఒక్కటే మార్గమని నమ్మాడు.
దీంతో అతను ప్లాన్ వేశాడు. సంధ్యారెడ్డి అనే మధ్యవర్తి ద్వారా అద్దంకి బస్టాండ్‌కు మణికంఠను రప్పించాడు. అయితే ఈ కుట్రలేవీ తెలియని ఆ యువకుడు బస్టాండ్‌కు రాగానే , అందరూ చూస్తండగానే యువతి తండ్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు.
ఈ దాడిలో తల, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై గాయాలపాలైన యువకుడిని 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తలరించారు. ప్రాణాపాయం లేదని వైద్యసిబ్బంది తెలిపారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.