చిత్రం: అన్నీ మంచి శకునములే
రేటింగ్: 2.25/5
తారాగణం: సంతోష్ శోభన్, మళవికా నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకార్ జానకి, ఊర్వశి, వెన్నెల కిషోర్ తదితరులు
కెమెరా: సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్
ఎడిటింగ్: జునైద్ సిద్దికీ
సంగీతం: మిక్కీ జె మేయర్
నిర్మాత: ప్రియాంకా దత్
దర్శకత్వం: బి.వి. నందిని రెడ్డి
విడుదల తేదీ: 18 మే 2023
తీసినవి తక్కువే అయినా మంచి సినిమాలు తీసిన దర్శకురిలాగా పేరు తెచ్చున్నారు నందిని రెడ్డి. సున్నితమైన హాస్యం, మానవీయ విలువలతో కుటుంబమంతా చూడదగ్గ చిత్రాలు అందించిన ట్రాక్ రికార్డ్ ఈమెది. “అలా మొదలయింది”, “ఓ బేబీ” లాంటి సూపర్ హిట్లు కూడా ఇచ్చరు. ఇప్పుడు ఈ చిత్రంతో ముందుకొచ్చారు. ఈమెకి తోడు మొన్నటి “మహానటి” నుంచి నిన్నటి “జాతిరత్నాలు” వరకు హిట్ సినిమాల నిర్మాతలుగా పేరు పడ్డ దత్తుగారి అమ్మాయిలు నిర్మించిన సినిమా ఇది. యువత గుర్తించిన చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటీని ఏర్పరుచుకున్న నటుడు సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన ఈ సినిమా ట్రైలర్ తో కాస్తంత ఫీల్ గుడ్ ఫీలిచ్చింది. మరి సినిమాలో కూడా ఆ గుడ్ ఎంతవరకు ఉందో చూద్దాం.
కథలోకి వెళ్తే…ఒక కాఫీ ఎస్టేట్…దానిపై హక్కుల కోసం రెండు కుటుంబాల మధ్యన పోరాటం. అయితే ఇక్కడొక ట్విస్ట్. అది కూడా కొత్తదేమీ కాదు. “అల వైకుంఠపురములో” టైపులో ఈ రెండు కుటుంబాల్లోనూ ఒకే సమయంలో పుట్టిన ఇద్దరు పిల్లలు తారుమారవుతారు. ఒకళ్లు పెరగాల్సిన చోట మరొకరు పెరుగుతారు. వాళ్లిద్దరూ పెద్దయ్యి హీరో హీరోయిన్లవుతారు. ఇంతకీ హీరో గారు బేవర్స్ రకం. దేని మీద శ్రద్ధ, భయభక్తులు ఉండవు; హీరోయిన్ మాత్రం చాలా కాలిక్యులేటెడ్, బిజినెస్ మైండెడ్. వీళ్లిద్దరి మధ్య ఆకర్షణ, వికర్షణ, సంఘర్షణ…వెరసి చివరికి అన్ని సినిమాల్లో ఏమౌతుందో అలాంటిదే అవ్వడం. కథగా చెప్పమంటే ఇంతే.
కథ ఏదైనా కథనమే ప్రేక్షకుల్ని కూర్చోబెట్టేది. సినిమా మొదట్లో కాసిన్ని చమక్కులు కనపడ్డా క్రమంగా అసలు కథ హైవే ఎక్కిందనుకుంటే అది కాస్తా కుదుపులతోటి, మధ్యలో డైవెర్షన్స్ తీసుకుని ఇరుకు సందుల మధ్యలో 20 స్పీడులో వెళ్తున్నట్టనిపిస్తుంది. అసలు పిల్లలిద్దరూ తారుమారవడం వెనుక ప్రయోజనమేంటో కన్వే కాలేదు. అన్నేసి పాత్రలతో కథ నడపాల్సిన అవసరమేంటో కూడా బోధపడదు. ఒక స్టేజ్ దాటాక ఏ ఉత్కంఠా లేకపోవడం వల్ల ప్రశాంతంగా ఎవరో జోకొడుతున్న భావన కూడా కలుగుతుంది.
ప్రధమార్థంలో టైటిల్స్ సమయంలో శాంతి స్వరూప్ గొంతులో వార్తలు, తర్వాత పాత్రధారుల పరిచయమప్పుడు ఊర్వశి హోమియోపతీ డైలాగ్ మినహాయిస్తే నవ్వు తెప్పించే డైలాగ్ కానీ సన్నివేశం కానీ ఒక్కటి లేదు.
ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా రొటీన్ గా, ప్రెడిక్టిబుల్ గా ఉంది తప్ప తర్వాత ఏం జరగబోతోందో అన్న ప్రశ్న కూడా తలెత్తదు. ఎందుకంటే ఇంటర్వల్ టైం కి ఎందుకూ పనిరాడన్న వాడు సెకండాఫులో ఎలా మారతాడో, ఏదో ఒక సంఘటనలో గెలుచుకోవాల్సిన వారి మనసుని ఎలా గెలుచుకుంటాడో వేలాది సినిమాలు చూసేసిన ప్రేక్షకులకి ఊహించడం కష్టం కాదు.
ద్వితీయార్థమంతా జీడిపాకంలా సాగుతూ ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణా పెళ్లి…వగైరాలన్నీ అసలు కథకి సంబంధం లేకుండా పిట్టకథల్లాగ వస్తాయి. క్లైమాక్స్ లో రివీలింగ్ పాయింట్ సటిల్ గానే ఉన్నా కథనంలో సమస్యవల్ల నీరసంగా అనిపిస్తుంది.
మిక్కీ జె మేయర్ సంగీతం ఎప్పుడో వినేసిన బాణీల్లాగ ఉన్నాయి. పాటల్లోని సాహిత్యం కొంతవరకు ఓకే అనుకోవాలి. తీసినదంతా ఊటీలాంటి ప్రాంతంలోనూ, ఇటలీలోనూ కనుక కెమెరా వర్క్ రిచ్ గా అనిపిస్తుంది.
సినిమాలో ల్యాగ్ ఉన్నప్పుడు వెంటనే ఎడిటింగ్ ని తప్పుబడతాం కానీ, అసలు తీసిన సినిమాయే భయంకరమైన ల్యాగులతో ఉంటే ఎడిటర్ మాత్రం ఏం చేయగలడు! సంభాషణలు కూడా పెద్దగా పేలనట్టే లెక్క. ఇంతమంది ఆర్టిష్టుల్ని పెట్టుకున్నప్పుడు ఆద్యంతం హిలారియస్ గా సాగే మాటలు రాసుకుని ఉండాలి. రచయిత తనకు చెతనైనంతవరకు చేసాడు. కానీ ఫలితం ఆశాజనకంగా లేదు.
నటీనటవర్గానికి వస్తే సంతోష్ శోభన్ పర్ఫెక్ట్ గానే ఉన్నాడు. సరైన ఎంటెర్టైనర్ పడితే మరింతమందికి ప్రేక్షకులకి చేరువవుతాడు.
మాళవిక నాయర్ ఓకే. అయితే ఆమె స్థానంలో మరే ఇతర నటి ఉన్నా కూడా ఓకే అన్నట్టుగా ఉన్న పాత్ర ఇది.
నరేష్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ అందరూ ఒక టెంపోలో చేసుకుంటూ పోయారు. చాలా కాలం తర్వాత షావుకార్ జానకి బామ్మ పాత్రలో నాలుగైదు సీన్స్ లో కనిపించారు. ఊర్వశి ప్రధమార్థం మొదట్లోనూ, క్లైమాక్స్ లో ఒకసారి కనిపించింది. గౌతమి సగటు అమాయిక ఇల్లాలిగా కనిపించింది. వెన్నెల కిషోర్ కామెడీ నవ్వించీ నవ్వించనట్టుగ ఉండి చివరికి పెద్దగా నవ్వించకుండానే నిష్క్రమించాడు.
ఈ సమ్మర్లో కుటుంబమంతా కలిసి హాయిగా చూడగలిగే మంచి ఫ్యామిలీ ఎంటెర్టైనర్ రాలేదు. ఆ లోటుని ఈ చిత్రమైనా భర్తీ చేస్తుందనుకుంటే పని జరగలేదు. ఇంత ల్యాగ్ ఉన్న సాదా సీదా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలంటే చాలా కష్టం.
ఇందులో ఒక చోట- “కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్” అని అరువుతెచ్చుకున్న డైలాగ్ ని హీరో పలికితే, “నువ్వు కటౌట్ వి అంతే.. ప్రభాస్ వి కాదు” అంటుంది హీరోయిన్. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కూడా “ఇది సినిమా అంతే..మరీ అంత మంచి సినిమా కాదు” అని అనేలా ఉంది.
బాటం లైన్: శకునం బాలేదు