గంగిరెడ్డి బెయిల్ ఉత్త‌ర్వుల‌పై సుప్రీం చీఫ్ జ‌స్టిస్ ఆశ్చ‌ర్యం!

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడు ఎర్ర‌గంగిరెడ్డి బెయిల్ ఆదేశాలు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి చంద్ర‌చూడ్‌నే ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. ఇటీవ‌ల గంగిరెడ్డి బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. హైకోర్గు…

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడు ఎర్ర‌గంగిరెడ్డి బెయిల్ ఆదేశాలు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి చంద్ర‌చూడ్‌నే ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. ఇటీవ‌ల గంగిరెడ్డి బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. హైకోర్గు ఆదేశాల మేర‌కు ఆయ‌న లొంగిపోయారు. ఇదిలా ఉండ‌గా బెయిల్ ర‌ద్దుతో పాటు విడుద‌ల‌కు సంబంధించి ఉత్త‌ర్వుల‌ను కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చింది.

గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్ ర‌ద్దు చేస్తూ గ‌త నెల 27న తెలంగాణ హైకోర్టు ర‌ద్దు చేస్తూ, మ‌ళ్లీ జూలై 1న విడుద‌ల చేయాల‌ని ఆదేశాలు ఇవ్వ‌డంపై వివేకా కుమార్తె డాక్ట‌ర్ సునీత సుప్రీంకోర్టులో స‌వాల్ చేశారు. వివేకా హ‌త్య కేసు విచార‌ణ‌ను జూన్ 30వ తేదీలోపు పూర్తి చేయాల‌ని సుప్రీంకోర్డు గ‌డువు విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎర్ర‌గంగిరెడ్డి బెయిల్‌పై విడుద‌ల‌కు సంబంధించి కూడా తెలంగాణ హైకోర్టు ఉత్త‌ర్వులు ఇవ్వ‌డంపై సీజేఐ చంద్ర‌చూడ్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

ఫ‌లానా రోజు విడుద‌ల చేయాల‌ని ఉత్త‌ర్వులు ఇవ్వ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌తివాదుల‌కు సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం నోటీసులు జారీ చేసింది. అలాగే సునీత పిటిష‌న్‌ను వెకేషన్ బెంచ్‌కి బదిలీ చేసింది.  వచ్చేవారం సునీత పిటిష‌న్‌పై వెకేష‌న్ బెంచ్‌ విచారణ జరపనుంది.

వివేకా హ‌త్య కేసుకు సంబంధించి వివిధ స్థాయిల్లోని న్యాయ‌స్థానాల్లో పెద్ద యుద్ధమే జ‌రుగుతోంది. ఇటు వివేకా కూతురు డాక్ట‌ర్ సునీత ప‌ట్టుద‌ల‌తో ప్ర‌తి ద‌శ‌లోనూ నిందితుల‌కు వ్య‌తిరేకంగా న్యాయ‌పోరాటం చేస్తూ, వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సునీత అలుపెర‌గ‌ని పోరాట‌మే త‌మ పాలిట శాపంగా మారింద‌ని నిందితుల భావ‌న‌. చివ‌రికి ఏం తేలుతుందో చూడాలి.