నడక సాగిస్తున్న నారా లోకేశ్ కాళ్లకు బదులు కుడి భుజం నొప్పితో బాధపడుతున్నారు. సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన లోకేశ్‌ను కాళ్లు ఇబ్బంది పెట్టకపోవడం సంతోషించాల్సిన విషయం. నారా లోకేశ్ యువగళం పేరుతో తలపెట్టిన పాదయాత్ర… మూణ్ణాళ్ల ముచ్చటే అనుకున్నారు. అయితే పట్టుదలతో ఆయన నడక సాగిస్తూ ఆశ్చర్యపరిచారు. ఎలాంటి అనారోగ్య సమస్య లేకుండా ఇంత కాలం ఆయన పాదయాత్రను నెట్టుకొచ్చారు.
తాజాగా ఆయన భుజం నొప్పితో బాధపడడం చర్చనీయాంశమైంది. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరిలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కుడి భుజం నొప్పిస్తున్నట్టు చెప్పారు. ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడంతో సమస్య కొంత తగ్గిందని సమాచారం. కానీ నంద్యాలకు ఆయన పాదయాత్ర చేరుకున్న నేపథ్యంలో కుడి చేతి భుజం తీవ్రంగా నొప్పిస్తుండడంతో ఆయన బాధపడుతున్నారని టీడీపీ నేతలు తెలిపారు.
నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుడి చేతి భుజానికి స్కానింగ్ చేయించుకున్నారు. ఫొటోలు దిగేందుకు అభిమానులు తరచూ ఆయన్ను లాగుతుండడంతో భుజం నొప్పిస్తున్నట్టు లోకేశ్ వైద్యులకు చెప్పినట్టు తెలిసింది.
సెల్ఫీలు, ఫొటోలు తీసుకునే సందర్భంలో అభిమానుల నుంచి రక్షణ కల్పిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు సమాచారం. ఇక మీదట లోకేశ్ భుజం పట్టుకుని లాగకుండా సెక్యూరిటీ సిబ్బంది చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. అయితే సమస్య కాళ్లతో కాకపోవడంతో పాదయాత్రకు ఎలాంటి అడ్డంకి లేదని టీడీపీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి.