న్యాయ వ్యవస్థపై తరచూ వివాదాస్పద, షాకింగ్ కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుకు ప్రధాని మోదీ షాక్ ఇచ్చారు. న్యాయ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వం మధ్య రోజురోజుకూ గ్యాప్ పెరిగేందుకు న్యాయశాఖ మంత్రి కారణమవుతున్నారన్న ఉద్దేశంతో ఏకంగా ఆయన్ను ఆ శాఖ నుంచి తప్పించడం గమనార్హం. ఇప్పటి వరకు భూగోళ శాస్త్రాల మంత్రిత్వ శాఖను జితేంద్ర సింగ్ నిర్వహించారు.
ముఖ్యంగా కొలీజియం వ్యవస్థపై కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అసలు ఆ వ్యవస్థతో గొప్ప న్యాయకోవిదులను న్యాయమూర్తులుగా ఎంపిక చేయడం లేదని ఆయన అనేక సందర్భాల్లో కామెంట్స్ చేశారు.
ఈ నేపథ్యంలో న్యాయశాఖ నుంచి కిరణ్ రిజిజును తొలగించి, భూగోళశాస్త్రాల మంత్రిత్వ బాధ్యతల్ని అప్పగించడం విశేషం. అర్జున్‌రామ్ మేఘవాల్‌కు న్యాయశాఖ బాధ్యతల్ని అప్పగించారు. ప్రధాని మోదీ సలహాతో ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేశారు. అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖల సహాయ మంత్రిగా పని చేస్తున్నారు. వీటికి అదనంగా న్యాయశాఖ బాధ్యతల్ని కూడా ఆయనకు అప్పగించారు.
న్యాయశాఖపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతోనే రిజిజును ఆ శాఖ బాధ్యతల నుంచి తప్పించారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇకపై న్యాయ వ్యవస్థపై అవాకులు చెవాకులు పేలకుండా ఓ హెచ్చరిక అన్నట్టుగా ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు బీజేపీ నాయకులు చెబుతున్నారు. తాజా నిర్ణయంతో రిజిజు స్పందన ఎలా వుంటుందో చూడాలి.