మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఇంత కాలం కన్న కొడుకు నారా లోకేశ్ రాజకీయ భవిష్యత్‌పై బెంగ మాత్రమే వుండేది. ఇప్పుడు దత్త పుత్రుడు కూడా తోడయ్యారు. దీంతో సొంత పుత్రుడు నారా లోకేశ్, వైసీపీ విమర్శిస్తున్నట్టుగా దత్త పుత్రుడు పవన్‌కల్యాణ్‌ను ఎమ్మెల్యేలుగా గెలిపించే బాధ్యత, భారం చంద్రబాబుపై పడ్డాయి. అసలే వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబుకు అండగా నిలవాల్సిన సొంత, దత్త పుత్రులు…ఇప్పుడాయనకు భారంగా మారడం చర్చనీయాంశమైంది.
రాజధానిలో పేదలకు ఒక్కొక్కరికి సెంటు చొప్పున ఇళ్ల స్థలం ఇస్తున్న నేపథ్యంలో మంగళగిరిలో మరోసారి నారా లోకేశ్‌కు ఓటమి తప్పదని ఎల్లో పత్రికే కథనం రాసిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తేవడంతో, మంగళగిరిలో ఎలాగైనా లోకేశ్ గెలుస్తాడని టీడీపీ ధీమాగా వుండిది.
ఈ నేపథ్యంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీతో దాదాపు 1.20 లక్షల కొత్త ఓటర్లు , అది కూడా పూర్తిగా అధికార పార్టీకి దన్నుగా నిలిచే వారు వస్తారనే భయం టీడీపీలో వణుకు పుట్టిస్తోంది. మంగళగిరి మొదటి నుంచి టీడీపీ వ్యతిరేక నియోజకవర్గం. అలాంటి చోట మంత్రి హోదాలో లోకేశ్ పోటీ చేసి ఓడిపోయారు.
అయితే పోయిన చోటే వెతుక్కోవాలనే ఉద్దేశంతో మరోసారి అక్కడే పోటీ చేసేందుకు లోకేశ్ సిద్ధమయ్యారు. మంగళగిరిలో గెలిచి టీడీపీకి గిప్ట్‌గా ఇస్తానని లోకేశ్ ప్రగల్భాలు పలికారు. లోకేశ్ ఒకటి అనుకుంటే, సీఎం జగన్ మరోలా తలిచారు. దీంతో టీడీపీ అంచనాల్నీ తల్లకిందులయ్యే పరిస్థితి.
మరోసారి మంగళగిరిని వైసీపీ కంచుకోటే అని నిరూపించేందుకు దిమ్మతిరిగే వ్యూహాన్ని జగన్ రచించారు. దీంతో మంగళగిరిలో లోకేశ్‌ను గెలిపించుకోవడం చంద్రబాబుకు అతి పెద్ద టాస్క్. రెండోసారి కూడా లోకేశ్ ఓడితే, వారసత్వానికే దెబ్బ అని చంద్రబాబు భయపడుతున్నారు. ఈ పరిస్థితిలో మంగళగిరి కాకుండా మరో నియోజకవర్గానికి మారడం శ్రేయస్కరమని చంద్రబాబుకు టీడీపీ నేతలు సూచిస్తున్నారు.
కన్న కొడుకు భవిష్యత్ గురించి బెంగ తీరకనే, దత్త పుత్రుడి రూపంలో పవన్ మరొక సమస్యగా మారారని టీడీపీ నేతలు అంటున్నారు.
జనసేన స్థాపించి పదేళ్లైందని, గత సార్వత్రిక ఎన్నికల్లో పవన్‌కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారని, ఈ దఫా ఎలాగైనా గెలవాలనే పట్టుదలతోనే తమతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని తన పార్టీ నేతలతో చంద్రబాబు అన్నట్టు తెలిసింది. దీంతో పవన్‌కల్యాణ్‌ను గెలిపించుకోవడం కూడా తన బాధ్యతగా చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో పవన్‌కు సురక్షితమైన నియోజకవర్గాన్ని చూసి పెట్టాల్సిన బాధ్యత కూడా తనపైనే ఉందని చంద్రబాబు అంటున్నారని తెలిసింది.
వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వుందని చంద్రబాబు పైకి ఎన్ని మాట్లాడుతున్నా, లోలోపల భయం ఉంది. ముఖ్యంగా సొంత, దత్త పుత్రుల గెలుపు, అలాగే పార్టీని అధికారంలోకి తీసుకురావడంపై ఆయన తీవ్ర కసరత్తు చేస్తున్నారు. దత్త, సొంత పుత్రుల సహాయసహకారాలు అటుంచితే, ఇద్దరూ ఇద్దరే అని చంద్రబాబు మధనపడుతున్నారని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు.