సినిమా ఇండస్ట్రీపై మరో పిడుగు?

కొత్త రకం కరోనా దెబ్బకి స్టాక్ మార్కెట్ విలవిల్లాడుతోంది. ఇన్నాళ్లూ క్రమక్రమంగా పెరిగిన మార్కెట్.. రెండు రోజుల్లోనే కుప్పకూలింది. ఈ కూలడం అక్కడితో ఆగుతుందా.. మరింత పతనావస్థకు చేరుకుంటుందా అనేది తేలాల్సి ఉంది.  Advertisement…

కొత్త రకం కరోనా దెబ్బకి స్టాక్ మార్కెట్ విలవిల్లాడుతోంది. ఇన్నాళ్లూ క్రమక్రమంగా పెరిగిన మార్కెట్.. రెండు రోజుల్లోనే కుప్పకూలింది. ఈ కూలడం అక్కడితో ఆగుతుందా.. మరింత పతనావస్థకు చేరుకుంటుందా అనేది తేలాల్సి ఉంది. 

ఇక సినిమా ఇండస్ట్రీ విషయానికొద్దాం. ప్రభుత్వం తరపున థియేటర్లు తెరుచుకోవచ్చనే ఆదేశాలు ఎప్పుడో జారీ అయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో ధైర్యం చేసి షో లు వేశారు కూడా. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా ఆ సాహసం చేయలేదు.

మల్టీప్లెక్సులు మినహాయిస్తే.. సింగిల్ స్క్రీన్స్ ఒకటీ రెండు తెరుచుకున్నా వాటిని లెక్కలో వేసుకోలేం. కొత్త సినిమాలు లేకపోవడం, జనాలు థియేటర్లకు వస్తారా, రారా అనే అనుమానం, సామాజిక దూరం పాటిస్తూ సీటింగ్ కెపాసిటీ తగ్గించడం వంటి విషయాలపై థియేటర్ యాజమాన్యాలు, మల్టీప్లెక్స్ ఓనర్లు ముందూ వెనకా ఆడుతూ కాలం గడుపుతున్నారు. 

ఎట్టకేలకు క్రిస్మస్ తర్వాత.. కొత్త ఏడాదికి ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లు ఓపెనింగ్ కోసం రెడీ అయ్యాయి. అంతా సిద్ధమనుకుంటున్న వేళ.. రెండో రకం కరోనా అనే వార్త సినీ ఇండస్ట్రీపై పిడుగులా పడబోతోంది.

సినిమా షూటింగ్ లన్నీ సజావుగానే సాగుతున్నాయనే భరోసా ఉన్నా కూడా, రెడీ  అయిన సినిమాలు థియేటర్లలోకి వస్తేనే అందరికీ ఆదాయం. ఓ మోస్తరు నుంచి భారీ బడ్జెట్ సినిమాలకు ఓటీటీ వర్కవుట్ కాదనే విషయం ఆల్రడీ తేలిపోయింది. దీంతో థియేటర్ల కోసమే అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. 

సంక్రాంతి సీజన్ టార్గెట్ గా.. ఈ పాటికే రిలీజ్ డేట్ లు అనౌన్స్ చేసి రెడీగా ఉన్నారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో ఏమాత్రం పరిస్థితులు తేడా కొట్టి, మరోసారి లాక్ డౌన్ దిశగా అడుగులు పడితే అది పరిశ్రమకు పెద్ద కష్టమే.

ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మహారాష్ట్ర వంటి చోట్ల రాత్రి పూట లాక్ డౌన్ కఠినంగా అమలవుతోంది. రెండో రకం కరోనా వైరస్ కి పుట్టినిల్లుగా పేర్కొంటున్న బ్రిటన్ నుంచి మన దేశానికి వచ్చినవారిలో 25మందికి కరోనా నిర్థారణ అయిందనే వార్తలు మరో అలజడికి కేంద్రంగా మారాయి. ఈ నేపథ్యంలో థియేటర్లు తెరిచి మళ్లీ మూసేయాలా, లేక వేచి చూడాలా అనే పరిస్థితిలో యాజమాన్యాలు ఉన్నట్టు తెలుస్తోంది.

అట్టహాసంగా థియేటర్లు తెరిచి.. ఆ వెంటనే లాక్ డౌన్ అంటే అన్నీ మూసుకోవాల్సిందే. ఆర్థికంగా అది మరింత భారంగా మారుతుంది. ఒకవేళ కొన్నిరోజులు వేచిచూద్దామా అంటే.. సంక్రాంతి లాంటి కలెక్షన్ సీజన్ మిస్ అవుతుందేమోనన్న భయం వెంటాడుతోంది. దీంతో థియేటర్ల ఓనర్లు మరోసారి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ప‌చ్చ మీడియా ప‌గ‌టి క‌ల‌లు