తన మార్కు పాపాల్ని జగన్ కు పులుముతున్న చంద్రబాబు

చంద్రబాబునాయుడు చిత్రమైన రాజకీయం చేస్తున్నారు. తన మార్కు పాపాలను, తన అలవాట్లను, రాజకీయాల్లో తను అనుసరించే కుయుక్తులను జగన్ మోహన్ రెడ్డికి పులిమి ఆనందిస్తున్నారు. తద్వారా.. జగన్ మీద ప్రజల్లో దురభిప్రాయం కలిగించడంతో పాటు,…

చంద్రబాబునాయుడు చిత్రమైన రాజకీయం చేస్తున్నారు. తన మార్కు పాపాలను, తన అలవాట్లను, రాజకీయాల్లో తను అనుసరించే కుయుక్తులను జగన్ మోహన్ రెడ్డికి పులిమి ఆనందిస్తున్నారు. తద్వారా.. జగన్ మీద ప్రజల్లో దురభిప్రాయం కలిగించడంతో పాటు, తాను ఎవరి ప్రాపకం కోసం అయితే వెంపర్లాడుతున్నారో, వారితో జగన్ కు భేదాభిప్రాయాలు పుట్టించగలనని ఆలోచిస్తున్నారు.

చంద్రబాబునాయుడు తాజాగా ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ.. ఇదేంఖర్మ ప్రసంగాలు కొనసాగిస్తున్నారు. జగన్ మీద రెగ్యులర్ గా వినిపిస్తున్న అన్ని రకాల విమర్శలను అదే పనిగా మళ్లీ మళ్లీ వినిపిస్తూ పాచిపోయిన రికార్డులు వేస్తున్నారు. అయితే తాజాగా ఆయన కొత్త ఆరోపణలు చేస్తుండడమే తమాషా. రాష్ట్రంలో అన్ని ధరలు పెరిగిపోతుండగా.. వాటన్నింటికీ కారణం కేంద్రమే అని జగన్ అబద్ధాలు చెబుతున్నారట. ఇలా అనడం ద్వారా కేంద్రప్రభుత్వానికి జగన్ సర్కారుకు మధ్య అంతరం క్రియేట్ చేయడానికి చంద్రబాబు తపన పడుతున్నట్లుగా ఉంది.

ధరలు పెరిగిన మాట వాస్తవం. రాష్ట్రంలో మాత్రమే కాదు. దేశమంతా పెరిగాయి. అచ్చంగా ఇదంతా బిజెపి కేంద్ర సర్కారు పాపమే అని దేశంలో పసిపిల్లలను అడిగినా చెప్తారు. పెట్రోలు, గ్యాస్ ధరలే ఎలా పెరిగాయో ప్రతి ఒక్కరికీ తెలుసు. అయినా.. జగన్ కూడా కేంద్రంతో సత్సంబంధాల పేరుతో వారి మీద నిందలు వేయకుండా ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. అయితే చంద్రబాబు.. ఇప్పుడు హఠాత్తుగా బిజెపితోకూడా తన పల్లకీ మోయించుకోవాలని కోరుకుంటున్నారు గనుక.. ధరల పెరుగుదల పాపం జగన్ ది అన్నట్టుగా మాట్లాడడం విశేషం.

గతంలో తన పాలన సాగిన హయాంలో ప్రత్యేకహోదా, రాజధాని విషయంలో అయిదేళ్ల పాటు కొనసాగిన తన చేతగానితనాన్ని కప్పెట్టుకోవడానికి సరిగ్గా ఎన్నికల ముందు బిజెపి సర్కారు  మీద నిందలు వేస్తూ ప్లేటు ఫిరాయించిన చరిత్ర చంద్రబాబుది.

అప్పటిదాకా బిజెపి చంక ఎక్కి కేంద్ర సర్కారులో అధికార పదవులు అనుభవించినది చాలకుండా.. చివర్లో తన వైఫల్యాలను కప్పెట్టుకోవడానికి మోడీని నానా తిట్లు తిట్టారు. ఇప్పుడు మళ్లీ వాళ్ల ప్రాపకం ఆశిస్తున్నారు. తాను అప్పుడు బిజెపి పట్ల ఎలాంటి ద్రోహ రాజకీయాలు చేశాడో.. ఇప్పుడు జగన్ అదే పని చేస్తున్నట్టుగా రంగు పులమడానికి చంద్రబాబు ప్రయత్నిస్తుండడం దారుణం.. అని ప్రజలు అనుకుంటున్నారు.

తన మార్కు కుట్ర రాజకీయాలు, దుర్మార్గపు ఆలోచనలను జగన్ కు పులమడానికి చంద్రబాబు ఆరాటపడుతున్నాడని అంటున్నారు.