సొంత డబ్బా ఓకే.. ఎద్దేవా ఎందుకు ?

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటినుంచే ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. నిజానికి ఆయనకు ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. మరో ఆరునెలల్లోగా సమరాన్ని ఎదుర్కోవాల్సిందే. జాతీయ పార్టీ మీద ఫోకస్ ఎక్కువ కావాలనుకుంటే.. ఆయన ఒకటిరెండు…

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటినుంచే ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. నిజానికి ఆయనకు ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. మరో ఆరునెలల్లోగా సమరాన్ని ఎదుర్కోవాల్సిందే. జాతీయ పార్టీ మీద ఫోకస్ ఎక్కువ కావాలనుకుంటే.. ఆయన ఒకటిరెండు నెలలు ఎన్నికలను ముందుకు నెట్టినా ఆశ్చర్యం లేదు.

అలా ఎన్నికలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో.. ఆయన తమ సొంత పార్టీ గురించి, పాలన గురించి ఎంత డప్పు కొట్టుకున్నా పరవాలేదు. కానీ.. అదే సమయంలో ఆయనకు సంబంధం లేని రాజకీయ ప్రత్యర్థులు కాని ఇతరులను ఎద్దేవా చేయడం ఎందుకు? అనే వాదన ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తోంది.

కేసీఆర్ తాజాగా తన పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ఎంత గొప్ప అభివృద్ధిని సాధించిందో చెప్పుకున్నారు. తెలంగాణ ఒక వజ్రపు తునకగా మారిందని కూడా వాక్రుచ్చారు. మన రాష్ట్రం దేశం మొత్తానికి ఒక మోడల్ అయిపోయిందని కూడా అన్నారు. తెలంగాణ ఒక వజ్రపు తునక అని కూడా చెప్పుకున్నారు. ఇదంతా కూడా ఒకే. ఆయన సొంత డప్పు ఆయన ఎలాగైనా కొట్టుకోవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి? అంటూ కేసీఆర్ ఎద్దేవా చేయడమే చాలా మందికి బాధ కలిగిస్తోంది.

తెలంగాణ విడిపోవడం వల్ల మాత్రమే.. ఆంధ్రప్రదేశ్ వనరులు లేని రాష్ట్రంగా ఏర్పడి ఇప్పుడు నానా కష్టాలు పడుతోందనే సంగతి అందరికీ తెలుసు. అలా ఏపీ దుస్థితికి నేరుగా తానే కారణమై కూడా.. మళ్లీ ఆ రాష్ట్రాన్ని ఎద్దేవా చేయడం అంటే.. కేసీఆర్ కే చెల్లింది.

ఆ మాటకొస్తే.. జగన్ సర్కారు ఏర్పడిన తర్వాత.. తెలంగాణకు ఎంతో సహకారం అందించింది. ఇతర ఆస్తుల పంపకాలు తేలకపోయినా సరే.. హైదరాబాదులోని సచివాలయ భవనాల్లో తమ వాటా భవనాల మీద తమకు పదేళ్ల పాటు అనుభవించే అధికారం ఉన్నప్పటికీ కూడా.. ఏపీ సర్కారు దానిని వదలుకుంది. 

నిరుపయోగంగా ఉన్న భవనాలను తెలంగాణకు అప్పగించేయడానికి జగన్ సర్కారు అగీకరించింది. కేవలం జగన్ ఔదార్యం వల్లనే.. కేసీఆర్.. ఇవాళ హైదరాబాదులో నిర్మించిన అత్యద్భుత సచివాలయంలో కొలువు తీరి పాలన చేయగలుగుతున్నారు. పదేళ్లపాటు మాకు అధికారం ఉన్నదని జగన్ మొండికేసి ఉంటే గనుక తెలంగాణ సచివాలయ స్వప్నం మరో అయిదేళ్లు ఆలస్యం అయ్యేది. 

ఇలాంటి మంచితనాన్ని కూడా పట్టించుకోకుండా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఎద్దేవా చేయడం కేసీఆర్ కు తగదని పలువురు అంటున్నారు.