ఉత్తరాంధ్రలో మూడు రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు బుధవారం పెందుర్తిలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు ఎంతగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారంటే, ఆయన అంతగా భయపడుతున్నారని అర్థం. నాలుగు దశాబ్దాలుగా ఆయన రాజకీయ జీవితాన్ని దగ్గరగా చూస్తున్న తెలుగు సమాజం, చంద్రబాబు బాడీ లాంగ్వేజీని, మాటతీరును చదివేసింది. చంద్రబాబు మాటలకు అర్థాలే వేరులే అనే టాక్ వినిపిస్తోంది.
తాజాగా తన శ్రేణుల్ని ఉత్సాహపరిచేందుకు చంద్రబాబు పెద్దపెద్ద మాటలే మాట్లాడారు. “జగన్ పని, వైసీపీ పని అయిపోయింది. ఆ పార్టీలు ఎమ్మెల్యేలు ఒక్కరూ గెలవలేరు. ఈ సీఎంకు సవాల్ విసురుతున్నా. పులివెందులలో గెలిచి చూసుకో” అని బాబు తన మార్క్ ప్రసంగం చేశారు. నిజంగా వైసీపీకి, జగన్‌కు అంత సీన్ లేదని చంద్రబాబు నమ్ముతుంటే, మరెందుకని జనసేన, బీజేపీ పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారనే ప్రశ్నకు సమాధానం చెప్పాలి.
మాటలేమో అధికారంలోకి వచ్చినంత బిల్డప్, చేతలేమో ఒక్కడిగా పోటీ చేస్తే జగన్‌ను తట్టుకోవడం అసాధ్యమని భయాన్ని కనబరుస్తున్నాయి. జగన్‌ను చూసి దత్త తండ్రి, దత్త పుత్రుడు వణికిపోతున్నారు. దత్త పుత్రుడేమో ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందలేనని బహిరంగంగా అంటున్నారు.
రాజకీయ పరిపక్వత లేకపోవడంతో దత్త పుత్రుడు తన భయాన్ని మీడియా ఎదుట ప్రదర్శించారు. అయితే దత్త తండ్రి సుదీర్ఘ రాజకీయ అనుభవశాలి కావడంతో పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ, మనసులో భయాన్ని అణుచుకుని సర్కస్ పీట్లు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జనసేన, బీజేపీలతో పొత్తు లేకపోతే జగన్ చేతిలో చిత్తు కావాల్సిందే అని చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే ఈ దఫా ఆ పార్టీల నేతలను బతిమలాడైనా పొత్తులకు ఒప్పించి, తద్వారా అధికారాన్ని దక్కించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని లోకమంతా తెలుసు. ముఖ్యంగా బీజేపీ ఛీ కొడుతున్నా చంద్రబాబు సిగ్గు విడిచి, ప్రధాని మోదీని ఆకాశానికెత్తుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు ప్రధానిని తిట్టని తిట్టు లేదు.
ఇప్పుడేమో రాజకీయ స్వార్థం కోసం తిట్టిన నోటితోనే పొగడడం చంద్రబాబుకే చెల్లింది. అందుకే బీజేపీ నేతలు నిన్ను నమ్మం బాబూ అని దండం పెడుతున్నారు. జనసేనను స్థాపించి పదేళ్లు అవుతున్నా, ఇప్పటికీ అసెంబ్లీలో అడుగు పెట్టని పవన్‌కల్యాణ్, ఈ దఫా కూడా ఎన్నికల్లో గెలవకపోతే పరువు పోతుందని భయపడుతున్నారు. దీంతో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడమే పవన్‌కు మొదటి ప్రాధాన్యం అయింది. సీఎం ఆశయాన్ని పక్కన పెట్టి, చట్టసభకు ఎన్నికైతే చాలు, అదే పదివేలనే దయనీయ స్థితిలో పవన్‌కల్యాణ్ ఉన్నారు.
దీంతో టీడీపీ ఇచ్చినన్ని సీట్లతో సరిపెట్టుకోడానికి పవన్ సిద్ధమయ్యారు. అందుకే సీఎం తానే అని చంద్రబాబు అంటున్నారు. సభల్లో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ , తానే సీఎం కాబోతున్నట్టు ప్రచారం చేసుకోవడం ఆయనకే చెల్లింది. అయితే తన ప్రసంగాన్ని అర్థం చేసుకోలేనంత అమాయక స్థితిలో ప్రజలు లేరని చంద్రబాబు గ్రహిస్తే మంచిది.