రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ పేరు తెలియని వారుండరు. గత సార్వత్రిక ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి ఆయన వ్యూహకర్తగా వ్యవహరించారు. ఏపీలో సోషల్ ఇంజనీరింగ్, వైసీపీ ఘన విజయం, టీడీపీ ఘోర పరాజయం వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహం బాగా పని చేసిందనే అభిప్రాయం లేకపోలేదు. రాజకీయ నేతలతో ప్రశాంత్ కిషోర్ భేటీ అంటే… వ్యూహకర్త నియామకం గురించే చర్చ జరుగుతుంది.
తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ఈ భేటీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం, అలాగే దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక కూటమిలో ఏర్పాటులో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తుండడంతో వాళ్లిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమిలో ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్, రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించే అవకాశాలున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రధాన రాజకీయ పక్షాల నేతలతో సన్నిహిత సంబంధాలున్న ప్రశాంత్ కిషోర్ నుంచి వారి మూడ్‌ను తెలుసుకునేందుకే కేసీఆర్ భేటీ అయ్యారనే చర్చ జరుగు తోంది.
2023లో తెలంగాణలో మరోసారి అధికారంలోకి రావడం కూడా కేసీఆర్‌కు అన్నిటికంటే ముఖ్యమైంది. దీంతో తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ సేవల్ని వినియోగించుకునే ఆలోచనలో భాగంగా కేసీఆర్ చర్చించి ఉంటారనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. మరో వైపు తెలంగాణ ప్రభుత్వ వర్గాల అభిప్రాయం ఇంకో విధంగా ఉంది. తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రశాంత్ కిషోర్ టీమ్‌తో కేసీఆర్ చర్చించినట్టు సమాచారం.
ఇప్పటికే రెండు దఫాలు సీఎంగా కేసీఆర్‌కు తెలంగాణ సమాజం అవకాశం ఇచ్చింది. మూడో దఫా ఎన్నికల నాటికి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రభావం టీఆర్ఎస్‌పై పడకుండా ఏం చేయాలనే అంశంపైనే చర్చ జరిగి వుంటుందనేది మెజార్టీ అభిప్రాయం. కేసీఆర్, పీకే భేటీ సారాంశం ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.