ఊరోళ్లందరిపై నోరు పారేసుకునే సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణపై వరుస అటాక్‌లు జరుగుతున్నాయి. బిగ్‌బాస్ హౌస్‌ను బ్రోతల్ హౌస్ అని విమర్శించిన నారాయణను చెప్పుతో కొడతానని ఆ రియాల్టీ షో కంటెస్టెంట్ తమన్నా ఘాటు వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తమన్నా తిట్లను మరిచిపోకనే, నారాయణపై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మాజీ మంత్రి వివేకా హత్యలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబం ఇన్వాల్వ్ అయిందని విమర్శించిన నారాయణపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఓ వింత జంతువు అని నాని నిప్పులు చెరిగారు. తమ నాయకుడిని వింత జంతువు అంటారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివేకా హత్య, విచారణ అంశాలు కేంద్రంగా కొడాలి నాని, సీపీఐ మధ్య పేలిన విమర్శల తూటాలు పేలాయి. ముందుగా కొడాలి నాని ప్రెస్‌మీట్‌లో నారాయణపై చేసిన విమర్శల గురించి తెలుసుకుందాం.
“ఇంకొకడు ఉన్నాడు. వెరైటీ. అతనో వింత జంతువే. నోటికి ఏది వస్తే అది మాట్లాడ్తాడు. జాతీయ పార్టీ అని చెబుతాడు. చంద్రబాబునాయుడిదో జాతీయ పార్టీ, అదో జాతీయ పార్టీ. ఈయనో జాతీయ నాయకుడు, ఆయనో జాతీయ నాయకుడు. ఆ జాతీయ పార్టీకి రెండు ఎంపీ సీట్లున్నాయి. 420 నడిపే జాతీయ పార్టీకి మూడు ఎంపీ సీట్లున్నాయి. మాకు 22 ఎంపీ సీట్లున్నాయి. ఆరు రాజ్యసభ సీట్లున్నాయి. మాదేమో ప్రాంతీయ పార్టీ అంటారు.
వివేకా హత్యలో జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబం ఇన్వాల్వ్ అయిందంటాడు. బిగ్‌బాస్ షోను వ్యభిచార కొంప అంటాడు. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం చేయడం సరైందా? కాదా? అనేది ఇద్దరూ చెప్పరు. భీమ్లానాయక్ సినిమా గురించి ఒకడు, బిగ్‌బాస్ షో, కడపలో జరిగిన హత్య గురించి ఒకడు మాట్లాడ్తారు. రాష్ట్రంలో ఇంకా హత్యలు జరుగుతాయని నారాయణ జోస్యం చెప్పాడు. నాకు తెలిసి ఈ ఇద్దరే హత్యలకు ప్లాన్ చేస్తుంటారు” అని కొడాలి మండిపడ్డారు. కొడాలి విమర్శలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఏమన్నారంటే…
“సీపీఐ నారాయణపై కొడాలి నాని వ్యాఖ్యలను ఖండిస్తున్నా. వివేకా హత్య కేసులో అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పడం చేత కాక.. నారాయణను వింత జంతువు అని తిట్టడం సరికాదు. వివేకా కేసులో సీబీఐ, చంద్రబాబు సహా..అందరూ నాటకాలు ఆడుతున్నారు. నారాయణ, కొడాలి నాని ఫొటోలున్నప్లెక్సీలను పెట్టి, వింత జంతువు ఎవరని ప్రశ్నిస్తే… ప్రజలే నిర్ణయిస్తారు. ఈ విషయమై మరింత దిగజారి మాట్లాడదలచుకోలేదు.
కమ్యూనిస్టు పార్టీగా వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయదు. వివేకా హత్య కేసులో ఇంత వరకూ తానెక్కడ చెప్పని విషయాన్ని ఇప్పుడు చెబుతాను. ఆ హత్య కేసులో సీబీఐ, చంద్రబాబుతో సహా అందరూ డ్రామాలు ఆడుతున్నారు. పులివెందులకు వెళ్లి పదేళ్ల చిన్న పిల్లాడిని అడిగినా వివేకాను ఎవరు చంపారో చెబుతారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాల 9 నెలలవుతోంది.
ఎవరు చంపారో జగన్‌కు తెలియదా? అందరూ డ్రామాలాడి, దానిపై ఎవరూ మాట్లాడొద్దని మా నోరు నొక్కాలని చూస్తున్నారు. డ్రామాలు కట్టిబెట్టి నిజమైన దోషులను శిక్షించాలని అనుకుంటే శిక్షించండి. అలా కాదు, మా వాళ్లను చంపితే, పులివెందులలో వేరే ఐపీసీ ఉందనుకుంటే నిందితులను విడిచి పెట్టండి. మంత్రి కొడాలి నాని హద్దుల్లో ఉండి మాట్లాడితే మంచిది” అని రామకృష్ణ హితవు చెప్పారు.