మెగా బ్రదర్ నాగబాబు రుణాన్ని విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ తీర్చుకున్నారా? అంటే… ఔననే సమాధానం చెప్పక తప్పదు. గత “మా” ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌కు మెగాబ్రదర్ నాగబాబు గట్టి మద్దతుదారుడిగా నిలిచారు. నాగబాబు వెనకుండి ఇచ్చిన ప్రోత్సాహంతోనే ప్రకాశ్‌రాజ్ ధైర్యంగా టాలీవుడ్ ఎన్నికల్లో నిలిచారనే అభిప్రాయాలు లేకపోలేదు.
ప్రకాశ్‌రాజ్ రాజకీయ అభిప్రా యాలతో తమకు విభేదాలున్నప్పటికీ, ఆయన ప్రశ్నించే తత్వం, సమాజం పట్ల నిబద్ధత ఆకర్షించాయని, ఆ లక్షణాలే ఆయనకు మద్దతు ఇచ్చేలా చేసిందని నాగబాబు బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో భీమ్లానాయక్ సినిమా విడుదల రాజకీయ వివాదానికి కారణమైంది. సినిమాపై ఆంక్షల కత్తిని ప్రభుత్వం పెట్టిందని విపక్షాలు, పవన్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో భీమ్లానాయక్‌పై ప్రభుత్వ కక్షపూరిత వైఖరిని ఏ ఒక్క సినిమా పెద్ద కూడా ప్రశ్నించకపోవడంపై నాగబాబు అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు.
సరిగ్గా ఇదే సమయంలో ప్రకాశ్‌రాజ్ ట్విటర్ వేదికగా స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, సినిమాపై ప్రేక్షకాదరణను ఆయన ప్రశంసించడం విశేషం. ఇంతకూ ఆయన ట్వీట్ ఎలా సాగిందంటే…
‘సృజన, సాంకేతికత మేళవించిన సినిమారంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటి? చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ.. మేమే ప్రోత్సహిస్తున్నామంటే నమ్మలా? ఏవైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి. కక్ష సాధింపులు బాక్సాఫీస్ దగ్గర ఎందుకు? ఎంతగా ఇబ్బంది పెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డకట్టవేయలేరు’ అని ప్రకాశ్‌రాజ్ తనదైన శైలిలో ప్రభుత్వానికి చురకలు అంటించారు.
ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. నాగబాబు ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ ట్వీట్ చేశారనే చర్చకు దారి తీసింది. ఇదంతా చిత్ర పరిశ్రమ ఎన్నికల్లో మెగాబ్రదర్ మద్దతుకు కృతజ్ఞతగా చేసిన ట్వీట్‌గా నెటిజన్ల అభిప్రాయం.