తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏదని అడిగితే ముందుగా వచ్చే సమాధానం యాదాద్రి. ఒకప్పుడు యాదగిరి గుట్ట. ఉమ్మడి రాష్ట్రంలోనూ యాదగిరిగుట్ట పేరున్న పుణ్యక్షేత్రమేగానీ తెలంగాణా ఏర్పడిన తరువాత మారుమోగినంతగా దాని పేరు అప్పట్లో మారుమోగలేదు. తెలంగాణా ఏర్పడగానే ఆంధ్రాలో తిరుమల ఉన్నట్లుగా తెలంగాణలో ఒక ప్రసిద్ధ పుణ్యకేత్రం ఉండాలని, అది కూడా అత్యంత వైభవంగా ఉండాలని కేసీఆర్ ఆలోచన చేశారు.
వెంటనే దాని స్వరూపం మార్చాలని నిర్ణయించుకున్నారు. అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలనుకున్నారు. తన ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయరు స్వామితో చర్చలు జరిపారు. ఆయన సలహాలు, సూచనలు తీసుకున్నారు. చినజీయర్ స్వామి, కేసీఆర్ అనేకసార్లు యాదాద్రికి వెళ్లి దీని పునర్నిర్మాణం ఎలా చేస్తే బాగుంటుందో చర్చించారు. దానికి యాదాద్రి అనే పేరు పెట్టింది కూడా చినజీయర్ స్వామీజీయే. యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దాలనేది కేసీఆర్ బంగారు కల.
తాను అనుకున్న ప్రకారమే యాదాద్రిని కొన్నేళ్లుగా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. దీన్ని సందర్శించిన చాలామంది ప్రముఖులు యాదాద్రి పునర్నిర్మాణం అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు. కేంద్ర మంత్రులు సైతం పొగడ్తల వర్షం కురిపించారు. యాదాద్రిని దర్శించుకున్న తమ జన్మ ధన్యమైందని కొందరు ఆంధ్రా నాయకులు కూడా అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా అయితే కేసీఆర్ కారణజన్ముడు అంటూ ఆకాశానికి ఎత్తేసింది. పునర్నిర్మించిన యాదాద్రిని వచ్చే నెలలోఅంటే మార్చిలో ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు.
అందుకు ముహూర్తం కూడా నిర్ణయించారు. ఈ పునర్నిర్మాణ ప్రారంభోత్సవాన్ని ఉద్ఘాటన అంటున్నారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా, ఎంతో హంగు ఆర్భాటాలతో చేయాలని ఒక్క మాటలో చెప్పాలంటే ధూమ్ ధామ్ గా చేయాలని కేసీఆర్ ఇటీవలి వరకు అనుకున్నారు. యాదాద్రి ఆలయం అద్భుతంగా రూపు దిద్దుకుంటోందని మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి. దీంతో యాదాద్రి ఆలయం గురించి ప్రజలు కలల్లో తేలిపోతున్నారు. కానీ కేసీఆర్ నిర్ణయంతో వారి కలలు చెదిరిపోతున్నాయి.
ఇంతకూ ఆయన ఏం నిర్ణయం తీసుకున్నారు? ముందుగా నిర్ణయించిన ప్రకారం యాదాద్రి పునర్నిర్మాణ ప్రారంభొత్సతవం మార్చి 28 న జరగాలి. ఇందులో భాగంగా మహా సుదర్శన యాగం, మరికొన్ని కార్యక్రమాలను వారం రోజులు ఘనంగా నిర్వహించాలనుకున్నారు. కానీ కేసీఆర్ ప్లాన్ మారిపోయింది. యాదాద్రి ఉద్ఘాటన కార్యక్రమాన్ని చాలా సింపుల్ గా నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 28 న మహా సుదర్శన యాగం జరగాలి. కానీ దాని ఏర్పాట్లకు సమయం సరిపోదని అంటున్నారు.
ఈ మహా సుదర్శన యాగాన్ని ఏప్రిల్ లో ఉగాది తరువాత నిర్వహించాలని అనుకుంటున్నారు. అది కూడా అప్పటి పరిస్థితులనుబట్టి నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం మార్చి 28 న మహా కుంభ సంప్రోక్షణం, కలశ సంప్రోక్షణం కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తారు. ఇక ఈ కార్యక్రమాలకు సామాన్య భక్తులను అనుమతిస్తారా లేదా స్పష్టత లేదు. ఎందుకంటే ఆలయంలో ఇంకా పూర్తి కావాల్సిన పనులు ఉన్నాయి.
యాదాద్రి పునరుద్ఘాటన కార్యక్రమానికి రాష్ట్రపతిని, ప్రధాని మోడీని, కేంద్రమంత్రులను, పలు రాష్ట్రాల సీఎంలను కేసీఆర్ ఇదివరకు అనుకున్నారు. యాదాద్రి ఆలయాన్ని ప్రధాని మోడీ చేత ప్రారంభింప చేయాలని అనుకున్నారు. కానీ కొంత కాలంగా మోడీ మీద రాజకీయ యుద్ధం ప్రారంభించిన కేసీఆర్ తన ప్లాన్ మార్చేశారు. అలాగే త్రిదండి చినజీయర్ స్వామి మీద కూడా కోపంగా ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ఆహ్వానం ఉంటుందో ఉండదో చెప్పలేం.