భీమ్లానాయక్ సినిమా విడుదల నేపథ్యంలో జనసేన పార్టీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ సీన్ లోకి వైసీపీ మంత్రి కొడాలి నాని కూడా ఎంటరయ్యారు. భీమ్లా కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి నిబంధనలు విధించలేదన్నారాయన.
“భీమ్లానాయక్ ను ఎవరు తొక్కారు. మీకు మీరే ఏదేదో ఊహించుకుంటే ఎలా? చంద్రబాబుతో కుమ్మక్కయి ఏది పడితే అది మాట్లాడితే సరిపోతుందా? ఫిబ్రవరి 25 లోపు జీవో ఇస్తామని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. భీమ్లానాయక్ సినిమాకు కొత్తగా ఎలాంటి నిబంధనలు పెట్టలేదు. పుష్ప, అఖండ, బంగార్రాజు సినిమాలకు ఏ నిబంధనలు ఉన్నాయో, భీమ్లానాయక్ కు కూడా అవే రూల్స్ ఉన్నాయి. సినిమాకో నిబంధన విధించే ప్రభుత్వం మాది కాదు.”
మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో, జీవో జారీ ఆలస్యమైందన్న మంత్రి.. ఈ విషయం తెలిసి కూడా పవన్ కల్యాణ్, తన సినిమాతో రాజకీయాలు మొదలు పెట్టారని ఆరోపించారు. తల్లి లాంటి సినిమాతో రాజకీయాలు చేసేంతలా పవన్ దిగజారిపోయారని విమర్మించారు.
“పవన్ కు నష్టం లేదు. ఆయనకు బాగానే రెమ్యూనరేషన్ గిట్టుబాటు అయింది. చంద్రబాబు మాటలు నమ్మి పవన్ ఇలా వ్యవహరిస్తున్నారు. ఆయన మాటలు నమ్మితే అంతే. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కు ఓ పాతిక సీట్లు ఇస్తారు. కాకపోతే అవన్నీ ఓడిపోయే సీట్లు మాత్రమే. చంద్రబాబుకు లబ్ది చేకూర్చేందుకు పవన్ పావుగా ఉపయోగపడతారు తప్ప, ఆయనకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ కష్టమేదో తన సొంత పార్టీపై పవన్ చూపిస్తే బాగుంటుంది.”
చివరికి తన రాజకీయాల కోసం సొంత అన్నయ్య చిరంజీవిని కూడా పవన్ కల్యాణ్ విమర్శిస్తున్నారని, చిరంజీవిని గుమ్మం ముందు నిల్చొని ఆహ్వానించి, భోజనం పెట్టి గౌరవించి పంపించిన విషయాన్ని పవన్ మరిచిపోయారన్నారు కొడాలి. చిరంజీవిని అనడానికి పవన్ కు నోరెలా వచ్చిందని ప్రశ్నించారు.