అన్ స్టాపబుల్ కు నో!

అన్ స్టాపబుల్ రెండు సీజన్లు గడిచాయి. మూడో సీజన్ స్టార్ట్ చేద్దాం అంటే గెస్ట్ ల సమస్య. కొంతమంది బాలయ్యకు నచ్చరు. మరి కొంత మందికి బాలయ్య నచ్చరు. ఓ లెవెల్ వాళ్లే కావాలి.…

అన్ స్టాపబుల్ రెండు సీజన్లు గడిచాయి. మూడో సీజన్ స్టార్ట్ చేద్దాం అంటే గెస్ట్ ల సమస్య. కొంతమంది బాలయ్యకు నచ్చరు. మరి కొంత మందికి బాలయ్య నచ్చరు. ఓ లెవెల్ వాళ్లే కావాలి. ఎక్కడి నుంచి వస్తారు. మెగాస్టార్‌ను సూత్ర ప్రాయంగా కొంత వరకు చూద్దాం అనిపించగలిగారు. కానీ ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అందువల్ల ఇక ఆ ఎపిసోడ్ సాధ్యం కాదు. 

నాగార్జున, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లాంటి వాళ్లు బాలయ్యకు నప్పరు. పొలిటికల్ గా అన్ని విధాలా హై గా వుంటుందని రాష్ట్ర మంత్రి, భారాస కీలక నేత కేటీఆర్ ను కూడా ఆహా నుంచి ఎవరో అప్రోచ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ కేటీఆర్ అంత సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. ఎన్నికల వేళ ఇప్పుడు ఇవన్నీ అనవసరం అని భావించినట్లో, లేదా ఎన్నికల పనిలో బిజీగా వుండడం వల్లో, సాధ్యం కాదు అని సమాధానం వచ్చినట్లు తెలుస్తోంది. పోనీ సీజన్ 3 అనకుండా కనీసం మూడు ఎపిసోడ్ లు చేద్దామని డిసైడ్ అయ్యారు. ఒక ఎపిసోడ్ భగవంత్ కేసరి టీమ్ తో ఇంటర్వూ కింద నడిచిపోతుంది. రెండో ఎపిసోడ్ గా ఆహా కుటుంబ అవార్డుల టైపులో ఓ కార్యక్రమం లాగించేస్తారు. ఇక మూడో దానికి గెస్ట్ కావాలి. ఇప్పట్లో పెద్ద సినిమాలు ఏవీ లేవు.

అందుకే మూడో ఎపిసోడ్ కు గెస్ట్ ఎవరు అని గాలిస్తున్నారు. ముందు ఆహా టీమ్ కొన్ని పేర్లు అనుకోవాలి. ఆ పేర్లు బాలయ్యకు ఓకె కావాలి. ఆ తర్వాత ఆ గెస్ట్ లు కూడా ఓకె అనాలి.