లింగమనేని నివాసాన్ని క్విడ్ ప్రోకో లో దక్కించుకుని అక్కడ జీవనం సాగిస్తున్న చంద్రబాబు నాయుడు వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారుతోంది. లింగమనేని కి వందల వేల కోట్ల రూపాయల అనుచిత లబ్ధి చేకూర్చడం ద్వారా చంద్రబాబు నాయుడు కృష్ణా నది కరకట్ట మీద ఉన్న ఆ విలాసవంతమైన భవనాన్ని ఎలా చేజిక్కించుకున్నారో ఇప్పుడు సిఐడి దర్యాప్తు చేయబోతోంది.
చంద్రబాబును ఆ ఇంటి నుంచి వెళ్లగొట్టే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఏకబిగిన గగ్గోలు పెడుతున్నారు. జగన్ సర్కారు మీద పడి గొల్లుమంటున్నారు.
తాజాగా చంద్రబాబుని సమర్థిస్తూ జగన్ ను తిట్టిపోయడానికి ఓ విలేకరుల సమావేశం పెట్టిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తన వాదనలతో చంద్రబాబును మరింత ఇరుకున పెట్టారు. చంద్రబాబు- లింగమనేని ఇంట్లో ఎలా ఉంటున్నాడో నిజాయితీగా ఒక్క మాట కూడా చెప్పలేకపోయిన ధూళిపాళ్ల.. జగన్ నివాసాల గురించి అనుచిత విమర్శలు చేయడం విశేషం.
చంద్రబాబు నివాసం ఉంటున్న ఆ ఇంటికి సంబంధించి రెంటల్ అగ్రిమెంట్ కూడా లేదని సజ్జల ఆరోపిస్తే.. తాము అద్దె చెల్లిస్తున్నామని, దానికి సంబంధించిన రసీదులు కూడా తమ వద్ద ఉన్నాయని ధూళిపాళ్ల అంటున్నారు. రసీదులు ఉన్నమాట నిజమే అయితే.. ఇదే విలేకరుల సమావేశంలో వాటిని కూడా ఎందుకు బయటపెట్టి.. విలేకరులకు తలా ఒక కాపీ ఇచ్చి తమ నిజాయితీని నిరూపించుకోకూడదు అనేది ప్రజలకు మెదలుతున్న సందేహం.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ ఇంటికి ప్రభుత్వం తరఫున ఎంత అద్దె చెల్లించారనేది తప్పకుండా రసీదులు ఉంటాయి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు గనుక.. చంద్రబాబు తన జేబు నుంచి ఎంత సొమ్ము అద్దెగా చెల్లిస్తున్నారో చంద్రబాబు రసీదులు చూపించుకోగలిగితే.. ఆయన ఎంత నిజాయితీగా ఆ ఇంట్లో ఉంటున్నారో తేలిపోతుంది. రసీదులు బయటపెట్టకపోవడంలోనే ధూళిపాళ్ల మాటల డొల్లతనం బయటపడిపోతోంది.
వేర్వేరు నగరాల్లోని జగన్ నివాసాలు ఆయన పేరు మీదగానీ, ఆయన భార్య పేరుమీదగానీ లేవని ధూళిపాళ్ల ఆవేదన చెందుతున్నారు. కావొచ్చు గాక.. కానీ జగన్ తన తాడేపల్లి నివాసానికి ప్రభుత్వం నుంచి అద్దె తీసుకుంటున్నారా? అనేది ఇక్కడ ప్రశ్నార్థకం. పోనీ అవి ఎవరి పేరు మీద ఉన్నాయో ఆయన చెప్పడం లేదు. ఆ కారణం చేత.. లింగమనేని నివాసం అక్రమ కట్టడం కాదని అంటున్నారు. అక్రమ కట్టడం అనడానికి ఎవరి పేరు మీద ఉన్నదనే సంగతికి సంబంధం లేదు కదా అనేది ప్రజల సందేహం.
ప్రెస్ మీట్ లో ధూళిపాళ్ల మాటలను జాగ్రత్తగా గమనిస్తే నివాసం విషయంలో చంద్రబాబుకు లింగమనేని కి మధ్య లాలూచీ వ్యవహారం ఉన్నదని చాలా స్పష్టంగా అర్థమైపోతోంది.