సినిమా కెరీర్ అంటే ఇక్కడ ఎప్పుడు ఎవరి దశ తిరుగుతుందో చెప్పలేరు. అదే సమయంలో రాత్రికి రాత్రి స్టార్లు అయిన వారు మరునాటికి అదే జోష్ తో ఉంటారని చెప్పడానికి కూడా లేదు! ఇందుకే సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే వారి జీవితంలో ఆటుపోట్లు ఎక్కువ. ఈ కెరీర్ ను చూసుకుంటామనే వారిని అంతా అదోలా చూస్తూ ఉంటారు. వీరికి గుర్తింపు లభించిన తర్వాత వీరిని స్టార్లుగా చూసే వాళ్లు .. గుర్తింపు రానంత వరకూ వారిని చిన్న చూపు చూస్తారు.
సినిమాల్లో ట్రై చేయడం అంటే అవమానకరమైన పని కూడా! ఇక ఒకటీ రెండు అవకాశాలతోనో, హిట్లతోనో గుర్తింపు సంపాదించుకుని.. ఆ తర్వాత అదే రీతిన కెరీర్ కొనసాగక మరి కొందరు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు.
ఒకటీ రెండు హిట్స్ తో వారికి గుర్తింపు వస్తుంది, కొంత డబ్బు వస్తుంది. ఆ తర్వాత మళ్లీ రెండు మూడు ఫ్లాప్ లు ఎదురయితే ఆర్థికంగా, సామాజికంగా కూడా ఇబ్బందులే. సాధారణ జీవన శైలికి మళ్లీ అలవాటు పడలేక, సినిమా స్టార్ అనే గుర్తింపుకు తగ్గట్టుగా బతికేందుకు ఆర్థికంగా వనరులు లేక చాలా మంది సతమతం అవుతూ ఉంటారు.
ఇలాంటి దశలోనే కొందరు సినిమా వాళ్లు ఆత్మహత్యలు చేసుకున్నారనే విశ్లేషణలు కూడా గతంలో వినిపించాయి. సినిమా అవకాశాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఆ విషయంలో ఉంటే ఆటుపోట్లకు తట్టుకోవడం తేలికా కాదు.. అనేది బహిరంగ సత్యం. సినిమా చూసే ప్రేక్షకుడికి కూడా ఈ విషయం అర్థం అవుతూనే ఉంటుంది. ఇలాంటి ఎత్తుపల్లాలను కలిగిన ఈ ఇండస్ట్రీని ఇప్పుడు ఓటీటీ పరిశ్రమ కొంత బ్యాలెన్స్ చేస్తోంది!
చాలామంది ద్వితీయ శ్రేణి హీరోలకు గతంలో ఏడాదికి రెండేళ్లకు ఒక సినిమా ఉంటే గగనం. తాము కేవలం హీరో పాత్రలే చేస్తామంటూ పట్టుబట్టి కూర్చునే వారికి సినిమాల హిట్స్ లేనప్పుడు వేరే అవకాశాలు తలుపుతట్టడం గగనం. కేవలం హీరోలకే కాదు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరి పరిస్థితీ ఇదే. ఉన్న కొద్దోగొప్ప గుర్తింపు తో కొత్త అవకాశాలు దక్కక, వేరే వృత్తిలోకి వెళ్లలేక ఇలాంటి వాళ్లు సతమతం అయ్యే పరిస్తితి.
అక్కడకూ తెలుగు చిత్ర పరిశ్రమ వరకే తీసుకున్నా.. అది ఏడాదికి వందకు పైగా సినిమాలు తీస్తూనే ఉంటుంది. అయితే అందరికీ సమస్థాయిలో అవకాశాలు కానీ, రెమ్యూనిరేషన్లు కానీ దక్కవు! చిన్న చిన్న పాత్రలు చేస్తూ వందల సినిమాలు చేసిన వారు కూడా ఆర్థికంగా తాము చితికిపోయామంటూ ప్రకటించుకున్న సందర్బాలూ చాలానే ఉన్నాయి. ఏతావాతా.. సినీ ఇండస్ట్రీ అంటే లాటరీ టికెట్ తరహానే.
అయితే ఓటీటీలు విస్తృతం అయ్యాయి. ప్రజలు కూడా ఓటీటీలకు సబ్ స్క్రైబర్లుగా మారడంలో ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. దేశంలో ఓటీటీలు గత ఏడాది కాలంలో ఏకంగా పది వేల కోట్ల రూపాయల వ్యాపారం చేశాయనే గణాంకాలు వినిపిస్తున్నాయి. వీటి మార్కెట్ బాగా పెరుగుతోందని, రానున్న రోజుల్లో ఓటీటీల పరిధి మరింత పెరగడం ఖాయమని కూడా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఓటీటీకి కంటెంట్ లోటు కూడా ఉందని, ఇండస్ట్రీ ఓటీటీల కోసం చాలా కంటెంట్ ను అందించాల్సి ఉందని కూడా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఫలితంగా.. చోటా హీరోలు, ఒకటీ రెండు సినిమాలతో తెరమరుగు అయ్యారనుకున్న హీరోయిన్లకు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఓటీటీల్లో వస్తున్న వెబ్ సీరిస్, ఇతర కంటెంట్ కు సినిమా వాళ్ల అవసరం గట్టిగా ఏర్పడుతోంది. దీంతో థియేటర్ల మార్కెట్ లో జీరో అనిపించుకుంటున్న హీరోలు, మాస్ ఇమేజ్ లేదని ఇండస్ట్రీ చేత పక్కన పెట్టబడిన హీరోలకు ఇప్పుడు ఆ ఇబ్బందులు తీరిపోయాయి.
ఓటీటీ షోల్లోనూ, వెబ్ సీరిస్ లలోనూ నటించడానికి క్రౌడ్ పుల్లర్లు అక్కర్లేదు. గుర్తింపు ఉంటే చాలు. నటన వస్తే చాలు! దీంతో ద్వితీయ, తృతీయ శ్రేణి హీరోలకు ఇప్పుడు రేయిపగలూ పని చేస్తున్నా ఇంకా పని మిగిలే ఉంటోందని తెలుస్తోంది. థియేటర్లలో గుర్తింపును పొంది, అక్కడ కొత్త అవకాశాలు లేకపోయినా.. వీరికి ఓటీటీల ద్వారా గిట్టుబాటు అవుతోందని తెలుస్తోంది.
హీరోయిన్ల పరిస్థితి కూడా ఇదే. పెద్ద తెరపై అవకాశాలు లేకపోయినా, ఈ ఓటీటీల్లో వారికి వర్కవుట్ అవుతోంది. సినిమాల స్థాయి రెమ్యూనిరేషన్లు లేకపోయినా.. ఈ వెబ్ సీరిస్ లతో వారు మంచి స్థాయిలోనే పే పొందుతున్నారు. అనిశ్చితికి ప్రతిరూపం అనిపించుకునే సినిమా కెరీర్ లో ఉన్న వారికి ఓటీటీలు ఇలా ఊరటనిస్తున్నాయి.
-హిమ