లోకేశ్ పాదయాత్రలో టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి, ఆళ్లగడ్డ ఇన్చార్జ్ అఖిలప్రియ నేతృత్వంలో దాడి జరిగింది. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డికి నోటి నుంచి రక్తం కారడం ఆందోళన కలిగిస్తోంది. లోకేశ్ పాదయాత్ర ఇవాళ 101వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా నంద్యాల-ఆత్మకూరు రోడ్డులో లోకేశ్ పాదయాత్ర సాగుతుండగా ఒక్కసారిగా ఏవీ సుబ్బారెడ్డి, ఆయన అనుచరులపై అఖిలప్రియ, ఆమె భర్త భర్త భార్గవ్‌రామ్, తమ్ముడు విఖ్యాత్, హైదరాబాద్ నుంచి వచ్చిన అనుచరులు భౌతికదాడికి తెగబడ్డారు.
గతంలో ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ నేతృత్వంలో హత్యకు ప్లాన్ చేసిన విషయాన్ని కడప పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ వర్గాల మధ్య తీవ్రస్థాయిలో పోరు సాగుతోంది. భూమా నాగిరెడ్డికి ఏవీ అత్యంత ఆప్తుడు. నాగిరెడ్డి మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులతో ఏవీకి విభేదాలొచ్చాయి.
ఈ నేపథ్యంలో వాళ్లిద్దరి మాటలు తూటాలు అప్పుడప్పుడు పేలుతున్నాయి. ఇవాళ లోకేశ్ పాదయాత్రలో ఏవీ సుబ్బారెడ్డి కనిపించేసరికి అఖిలప్రియ, ఆమె భర్త, తమ్ముడు ఆగ్రహావేశానికి లోనయ్యారు. దీంతో ఆయనపై దాడికి తెగబడినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఏవీ సుబ్బారెడ్డికి తీవ్రగాయాలైనట్టు సమాచారం. ఆయన్ను వెంటనే నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రశాంతంగా సాగుతున్న లోకేశ్ పాదయాత్రలో సొంత పార్టీ నేతపై అఖిలప్రియ వర్గం దాడికి పాల్పడడం కలకలం రేపుతోంది.
అఖిలప్రియకు టికెట్ దక్కదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు తెలుస్తోంది. తనకే టికెట్ ఇస్తున్నట్టు కొన్ని రోజులుగా లోకేశ్‌ను అఖిలప్రియ బతిమలాడుతున్నా ప్రయోజనం లేదు. దీంతో తనకు టికెట్ దక్కకుండా చేయడంలో ఏవీ సుబ్బారెడ్డి కూడా ఒకరని ఆమె కోపానికి కారణంగా చెబుతున్నారు. ఏది ఏమైనా పార్టీ సీనియర్ నాయకుడిపై అది కూడా లోకేశ్ సమక్షంలో దాడి జరగడాన్ని టీడీపీ అధిష్టానం ఎలా తీసుకుంటుందో చూడాలి.