ఈ విమర్శలు తగునా పెద్దాయనా…?

ఆయన పెద్దాయన. కేంద్రంలో నాలుగేళ్ళ పాటు కీలకమైన శాఖకు మంత్రిగా పనిచేశారు. అనేక సార్లు ఉమ్మడి ఏపీలో మంత్రిగా వివిధ శాఖలను చూశారు. వీటికి మించి ఆయన విజయనగరం సంస్థానాధీశుడు. పూసపాటి అశోక్ గజపతిరాజు…

ఆయన పెద్దాయన. కేంద్రంలో నాలుగేళ్ళ పాటు కీలకమైన శాఖకు మంత్రిగా పనిచేశారు. అనేక సార్లు ఉమ్మడి ఏపీలో మంత్రిగా వివిధ శాఖలను చూశారు. వీటికి మించి ఆయన విజయనగరం సంస్థానాధీశుడు. పూసపాటి అశోక్ గజపతిరాజు గతంలో విమర్శలు చేసినా ఒక విధంగా ఉండేది. మరి ఆయన ఇపుడు ఎందుకు మారారో తెలియదు కానీ వాటిలో హుందాతనం లేదనే అంటున్నారు.

లేకపోతే రాజ్యాంగం మీద పూర్తి అవగాహన ఉన్న అశోక్ నోటి వెంట ఇలాంటి మాటలు రావడమా అని అంటున్నారు. ఏపీ రాష్ట్రం ప్రత్యేకత ఏంటి అంటే పదహారు నెలలు జైలులో ఉన్న దొంగను తెచ్చి ముఖ్యమంత్రిని చేశారని అశోక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో జరిగిన పార్టీ కార్యకర్యల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని వైసీపీ తుంగలోకి తొక్కేస్తోందని, ప్రశ్నించిన వారి మీద కేసులు పెట్టడం పరిపాటిగా మారిందని అన్నారు.

అశోక్ మిగిలిన విమర్శల సంగతి ఎలా ఉన్నా దొంగను సీఎం చేశారు అనడం మీదనే వైసీపీ నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతోంది. కోర్టు తీర్పు వచ్చే వరకు ఎవరైనా నిందితులే తప్ప దోషులు కారు. రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటు మేరకే జగన్ పోటీ చేశారు. ప్రజలు రాజ్యాంగం ప్రకారం ఎన్నుకున్నారు.

ఇందులో ప్రజలను నిందించి జగన్ని దొంగ అని అశోక్ అనడం పట్ల వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కేసులు ఉన్న వారంతా దొంగలే అంటే ఈ దేశంలో రాజకీయ నాయకుల మీద కేసులు లేనిది ఎవరి మీద అని ప్రశ్నిస్తున్నారు. జగన్ని ప్రజలు సీఎం చేశారు అన్నది నాలుగేళ్ళు గడచినా టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు అనడానికి అశోక్ నోటి వెంట వచ్చిన ఈ వ్యాఖ్యలే నిదర్శనం అంటున్నారు.

తమను ఎన్నుకోకపోతే ప్రజల వివేచన మీద కూడా విమర్శలు చేయడమే తెలుగుదేశం నేతలకు అలవాటు అధినాయకత్వం కూడా జనాలదే తప్పు అంటోంది. లోకేష్ నుంచి బాబు వరకూ అదే మాట అంటున్నారు. ఇపుడు అశోక్ కూడా అనడంతో జనాల మీద అక్కసు కూడా ఉందని అర్ధమవుతోంది అంటున్నారు.