జగన్ విశాఖకు వచ్చేలోగానే అంతా రెడీ

జగన్ విశాఖకు మకాం మరుస్తాను అని అంటున్నారు. ఆయన ఈ సెప్టెంబర్ నుంచి విశాఖలో నివాసం ఉంటూ పాలన చేస్తాను అని వివిధ సభలలో ప్రకటిస్తూ వచ్చారు. సుప్రీం కోర్టులో అమరావతి రాజధాని కేసు…

జగన్ విశాఖకు మకాం మరుస్తాను అని అంటున్నారు. ఆయన ఈ సెప్టెంబర్ నుంచి విశాఖలో నివాసం ఉంటూ పాలన చేస్తాను అని వివిధ సభలలో ప్రకటిస్తూ వచ్చారు. సుప్రీం కోర్టులో అమరావతి రాజధాని కేసు ఉంది. అప్పటికి ఆ కేసులో తీర్పు అనుకూలంగా వస్తే ఏ పేచీ లేదు. రాకపోయినా విశాఖలో సీఎం ఆఫీసుని ఏర్పాటు చేసుకుని జగన్ పాలించేందుకు సిద్ధపడుతున్నారు.

జగన్ విశాఖను పాలనా రాజధానిగా ప్రతిపాదించారు. అయితే చట్టపరంగా చేయాలంటే న్యాయ అడ్డంకులు ఉన్నాయి. ఆయన విశాఖలో నివాసం ఉంటే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండబోదు. జగన్ విశాఖకు వచ్చేలోగానే ఐటీ పరంగా నగరానికి కొత్త లుక్ ని తీసుకుని రావాలని చూస్తున్నారు.

ఇప్పటికే అదానీ డేటా సెంటర్ ని జగన్ విశాఖలో శ్రీకారం చుట్టారు. ఈ డేటా సెంటర్ దేశంలోనే అతి పెద్దగా ఉండబోతోంది. ఈ డేటా సెంటర్ ద్వారా డైరెక్ట్ గా ముప్పయి వేల మంది దాకా యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఇపుడు ఇన్ఫోసిస్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. విశాఖలో రుషికొండ వద్ద ఉన్న ఐటీ సెజ్ లో ఇన్ఫోసిస్ క్యాంపస్ ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆఫీసు పనులు చురుకుగా సాగుతున్నాయి. ఈ నెల 31 నుంచి   ఇన్ఫోసిస్  తన కార్యకలాపాలను విశాఖలో అధికారికంగా మొదలెట్టబోతున్నాయి.   

ఇన్ఫోసిస్ ద్వారా మొదటి విడతలో ఆరు వందల యాభై మంది వరకూ యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏపీకి చెందిన వారికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ నియామకాలను ఇన్ఫోసిస్ చేపట్టింది.

ఇన్ఫోసిస్  తరువాత మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్‌ వంటి ఐటీ సంస్థలు విశాఖ కేంద్రంగా తమ కార్యకలాపాలను ప్రారంభించబోతున్నాయి. ఐటీ సిటీగా విశాఖకు ఇన్ఫోసిస్ రాకతో కొత్త ఆకర్షణ రానుంది. జగన్ విశాఖకు వచ్చే సమాయనికి మరిన్ని సంస్థలతో కూడా ఒప్పందాలు ఉంటాయని అంటున్నారు. 

విశాఖను ఏపీకి గ్రోత్ ఇంజన్ గా మార్చాలన్న వైసీపీ ప్రభుత్వ ఆలోచనలను అనుగుణంగానే వ్యూహాత్మకంగా విశాఖను ఎంపిక చేసుకున్నారని అంటున్నారు.