భారీగా దొంగతనం చేశాడు.. తప్పతాగి పడుకున్నాడు

కన్నం వేసిన ఇంట్లోనే కడుపు నింపుకునే దొంగల్ని మనం చూశాం. కానీ అదే ఇంట్లో ఫుల్లుగా తాగి పడుకునే దొంగలు కూడా కొందరుంటారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు కొన్ని అక్కడక్కడ జరిగాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్…

కన్నం వేసిన ఇంట్లోనే కడుపు నింపుకునే దొంగల్ని మనం చూశాం. కానీ అదే ఇంట్లో ఫుల్లుగా తాగి పడుకునే దొంగలు కూడా కొందరుంటారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు కొన్ని అక్కడక్కడ జరిగాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కూడా ఇలాంటి ఘటన జరిగింది.

లక్నోలోని కాంట్ ఏరియాకు చెందిన శర్వానంద్, ఓ మాజీ సైనికుడు. బంధువుల పెళ్లి కోసం ఇంటికి తాళం వేసి వెళ్లాడు. అదే అదనుగా ఓ దొంగ, తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. అతడితో పాటు మరో దొంగ కూడా వచ్చాడు. ఇద్దరూ కలిసి ఇంట్లో ఉన్న 100 తులాల బంగారం, 2 కేజీల వెండి, 40 ఖరీదైన చీరలు, 6 లక్షల రూపాయల డబ్బు కొట్టేశారు.

ఇక అన్నీ మూటగట్టుకొని వెళ్లడమే ఆలస్యం అనుకున్న టైమ్ లో ఇంట్లో మద్యం సీసాలు కనిపించాయి. దీంతో ఓ దొంగకు నోరూరింది. కొంచెం పుచ్చుకొని వెళ్లిపోదాం అన్నాడు. మాజీ సైనికుడు ఇల్లు కాబట్టి ఆటోమేటిగ్గా మంచి సరుకు ఉంటుంది. దీంతో మనసు ఒప్పుకోలేదు, నోరు ఆగలేదు. అలా తాగితాగి అక్కడే పడిపోయాడు ఓ దొంగ.

ఇక వాడ్ని లేపడం సాధ్యంకాదని తెలుసుకున్న మరో దొంగ, సొత్తుతో పరారయ్యాడు. పెళ్లి నుంచి ఇంటికొచ్చిన శర్వానంద్, దొంగతనం జరిగిందని గుర్తించాడు. లోపలికి వెళ్లి చూస్తే మత్తుగా దొంగ పడుకున్నాడు. ఈలోగా పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు. పోలీసులొచ్చి దొంగను నిద్రలేపి స్టేషన్ కు తీసుకెళ్లారు.

తనతో వచ్చిన మరో దొంగకు సంబంధించి పూర్తి వివరాల్ని వెల్లడించాడు ఈ తాగుబోతు దొంగ. తాగుబోతు దొంగను సలీమ్ గా గుర్తించారు. అతడు శర్వానంద్ ఇంటికి దగ్గర్లోనే ఉంటున్నాడు.