విశాఖ వన్ అండ్ ఓన్లీ మెగా సిటీ …

జగన్ మనసులో ఉన్న దాన్ని ఎక్కడా దాచుకోరు. ఆయన దాన్ని చెబుతూనే ఉంటారు. సరైన వేదిక దొరికితే ఇంకా  ఎక్కువగానే చెబుతారు కూడా. విశాఖ వన్ అండ్ ఓన్లీ మెగా సిటీ. ఇదే జగన్…

జగన్ మనసులో ఉన్న దాన్ని ఎక్కడా దాచుకోరు. ఆయన దాన్ని చెబుతూనే ఉంటారు. సరైన వేదిక దొరికితే ఇంకా  ఎక్కువగానే చెబుతారు కూడా. విశాఖ వన్ అండ్ ఓన్లీ మెగా సిటీ. ఇదే జగన్ పదే పదే చెప్పే మాట. విశాఖనే ఏపీకి గ్రోత్ ఇంజన్ గా చేసుకోవాలని ఆయన మూడేళ్ళుగా చెబుతూ వస్తున్నారు.

తాజాగా జరిగిన సినీ ప్రముఖుల భేటీలో కూడా జగన్ విశాఖకు అందరం వెళ్దాం, ఈ రోజు నుంచే అక్కడ సెటిల్ అయితే మరో పదేళ్లకు అయినా హైదరాబాద్ కు ధీటుగా నిలిచే నగరం అవుతుంది అని చెప్పుకొచ్చారు. ఇక లేటెస్ట్ గా ప్రధాని మోడీకి రాసిన లేఖలో సైతం విశాఖ గురించి జగన్ గొప్పగా చెప్పారు. విశాఖ ఏపీకి సంబంధించి ఆర్ధికంగా నిలిచే నగరం అన్నారు. టూరిజం పరంగా కూడా విశాఖ విఖ్యాతి గడించింది అని గుర్తు చేశారు.

విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో ఏర్పాటు చేయడానికి అనుమతులు పునరుద్ధరించాలని జగన్ కోరారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుతో విశాఖ ప్రగతి చాలా వేగంగా సాధ్యపడుతుంది అని పేర్కొన్నారు. ఇక విశాఖలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయానికి మూడు వైపులా కొండలున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా పౌర విమానాలను కేవలం ఒక దిశలో మాత్రమే టేకాఫ్ చేసేందుకు అనుమతిస్తున్నారని ప్రధానికి వివరించారు.

దీనివల్ల గంటకు 10 విమాన సర్వీసులకు మించి నడిపే అవకాశం లేదని చెప్పుకొచ్చారు. రక్షణ రంగం, పౌర విమానయాన అవసరాలను ప్రస్తుతం ఇది తీరుస్తున్నా భవిష్యత్తులో రాకపోకలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వివరించారు. అందువల్ల భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం ద్వారానే అవన్నీ సాధ్యపడతాయని ఆయన అన్నారు.

మొత్తానికి భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అనుమతులు కోరుతున్న సందర్భంలో జగన్ విశాఖ విఖ్యాతిని మరో మారు ప్రధానికి గుర్తు చేయడం విశేషం. ఇక ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదన ఎటూ ఉంది. విశాఖను పాలనా రాజధానిగా చేసుకుంటామని కూడా అంటున్నారు. ఈ నేపధ్యంలో తన ఆలోచనలను మరింత ఊతమిచ్చేలా జగన్ ప్రధాని రాసిన లేఖ ఉందని అంటున్నారు. మొత్తానికి ఏపీకి విశాఖ గ్రోత్ ఇంజన్ అని గట్టిగా జగన్ చెప్పినట్లు అయింది.