ఇవాళ్టి నుంచి ఓటీటీలో బిగ్‌బాస్ రియాల్టీ షో ప్రారంభం కానుంది. ఈ రియాల్టీ షో ప్రత్యేకత ఏమంటే 24 గంటలూ ప్రసారం కావడం. ఇంత వరకూ గంట, గంటన్నర సేపు మాత్రమే రియాల్టీ షోను చూస్తూ వచ్చాం. ఆ షోకు ఉన్న ఆదరణ దృష్ట్యా ఓటీటీ వేదికగా నెటిజన్లకు మరింత చేరువ చేసేందుకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంను ప్రసారం చేసేందుకు నిర్వాహకులు నిర్ణయించారు.
ఈ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మరోసారి ఘాటు విమర్శలు చేశారు. గతంలో ఆయన బిగ్‌బాస్ హౌస్‌ను బ్రోతల్ హౌస్‌గా అభివర్ణించడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. తాజాగా మరోసారి ఆయన ఓటీటీ వేదికగా ప్రారంభం కానున్ని రియాల్టీ షోపై అవే అభ్యంతరకర వ్యాఖ్యలను పునరావృతం చేశారు. బిగ్‌బాస్ హౌస్ బ్రోతల్ హౌస్‌గా మారిందని ఆయన మండిపడ్డారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. బిగ్‌బాస్ రియాల్టీ షోను నిలిపివేయాలంటూ డిజిటల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. బిగ్‌బాస్ షో అనేది ఒక గేమ్ షో అంటున్నారన్నారు. అయితే తన ఉద్దేశంతో లైసెన్స్ పొందిన ఒక వ్యభిచార హౌస్‌గా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. దీన్ని నిలిపివేయాలని కేసులు పెట్టినా ప్రయోజనం లేదన్నారు. న్యాయ పోరాటం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇది ఒక నేరపూరిత చర్యగా షో ప్రదర్శన గురించి నారాయణ అన్నారు. జనం ఈ షోను అసహ్యించుకోవాలన్నారు. ఈ షో ఒక అనైతిక చర్య అన్నారు. రియాల్టీ షోను లైవ్‌లో పెట్టినంత మాత్రాన ప్రయోజనం లేదన్నారు. ఎందుకంటే వెదవ పనులన్ని ఎవరైనా కెమెరా ముందు చేసుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు.
అన్నమయ్య, రామదాసు లాంటి సినిమాల్లో హీరోగా నటించిన నాగార్జున ఇలాంటి బ్రోతల్ షోలను నిర్వహించడం ఏంటని నారాయణ ప్రశ్నించడారు.