భీమ్లానాయక్.. ఆ రెండు సీన్లు ఉంటే ఇంకా బాగుండేది

“హీరో బస్సు దిగుతాడు. లుంగీ పైకి ఎగ్గడతాడు. అలా రోడ్డుపై నడుచుకుంటూ వస్తాడు. నడుస్తూ చెప్పులు వదిలేస్తాడు. అడ్డొచ్చిన వ్యక్తిని కొడతాడు. బుల్డోజర్ తో కట్టడాన్ని కూల్చేస్తాడు.” ఈ సన్నివేశం అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకే…

“హీరో బస్సు దిగుతాడు. లుంగీ పైకి ఎగ్గడతాడు. అలా రోడ్డుపై నడుచుకుంటూ వస్తాడు. నడుస్తూ చెప్పులు వదిలేస్తాడు. అడ్డొచ్చిన వ్యక్తిని కొడతాడు. బుల్డోజర్ తో కట్టడాన్ని కూల్చేస్తాడు.” ఈ సన్నివేశం అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకే హైలెట్. మరీ ముఖ్యంగా ఈ సీన్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే, భాషలతో సంబంధం లేకుండా హిట్టయింది. ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను భీమ్లానాయక్ లో వాడుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఇదే బీట్ తో ఏకంగా సాంగ్ కూడా పెట్టుకున్నారు. కానీ ఈ కల్ట్ సీన్ ను మాత్రం భీమ్లాలో రిపీట్ చేయలేకపోయారు.

సినిమాలో చేసిన మార్పుచేర్పుల వల్ల ఈ కల్ట్ సీన్ తెలుగులో రిపీట్ అవ్వలేదు. నిజానికి ఈ సీన్ లో పవన్ కల్యాణ్ ను చాలామంది ఊహించుకున్నారు. కచ్చితంగా ఉంటుందని ఆశించారు. కానీ యమ సీరియస్ గా సాగే ఈ సన్నివేశాన్ని భీమ్లానాయక్ లో కామెడీ కోణంలో చూపించారు. పైగా నెరేషన్ కూడా పూర్తిగా మారిపోయింది.

ఇక భీమ్లా నాయక్ లో మిస్సయిన మరో కల్ట్ సీన్ బైక్ పై ఇద్దరూ వెళ్లే సన్నివేశం. కోషి కారు చెడిపోతుంది. అడవిలో మరో వాహనం కనిపించక నడుస్తూ, అలిసిపోతాడు. అప్పుడు అయ్యప్పన్ నాయర్ తన బండిపై అటుగా వస్తాడు. కోషితో తనకు శత్రుత్వం ఉన్నప్పటికీ పరిస్థితి చూసి లిఫ్ట్ ఇస్తాడు. ఇద్దరూ కలిసి ఒకే బైక్ పై వెళ్లడం, అక్కడ కోషి రియాక్షన్ లాంటివి ఒరిజినల్ వెర్షన్ లో భలేగా క్లిక్ అయ్యాయి. ఈ సీన్ భీమ్లానాయక్ లో రిపీట్ అవ్వలేదు.

పవన్-రానా కలిసి ఒకే బైక్ పై ప్రయాణం చేసే సీన్ భీమ్లానాయక్ పోస్టర్లలో కనిపించింది కానీ, సినిమాలో మాత్రం కట్ అయింది. సరిగ్గా ఈ సన్నివేశాన్ని భీమ్లానాయక్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం వాడుకున్నారు త్రివిక్రమ్-సాగర్ చంద్ర. ఈ ఎత్తుగడ బాగుంది కానీ, ఒరిజినల్ మూవీలో ఉన్న మంచి సీన్, రీమేక్ లో మిస్సయిందనే బాధ మాత్రం కొందరిలో ఉండిపోయింది.

ఇలా అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాతో పోల్చి చూస్తే, భీమ్లానాయక్ లో చాలా మార్పుచేర్పులు జరిగాయి. కానీ ఈ రెండు కల్ట్ సీన్స్ మాత్రం మిస్సవ్వడం.. 'అయ్యప్పనుమ్..' అభిమానుల్ని నిరాశపరిచింది.