పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ హిట్ అయింది. అయితే అభిమానులు ఆయన ఎమ్మెల్యేగా గెలిచినట్టు, సీఎం కుర్చీలో కూర్చున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. ప్రస్తుతం నిరాశలో ఉన్న పవన్ అభిమానులకు ఈ హిట్ టాక్ టానిక్ లా పనిచేస్తుంది కానీ, ఇదే రాజకీయానికి పరమావధి అనుకుంటే పొరపాటే. సినిమాల్లో పవన్ కి భీమ్లా నాయక్ వంటి సక్సెస్ లు కొత్తేం కాదు.. గతంలో కూడా ఇచ్చారు.
పవర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. కానీ కొసరు విషయాన్నిసెలబ్రేట్ చేసుకునే జనసైనికులు ఎప్పుడూ.. అసలు విషయంలో మాత్రం బోల్తా పడుతుంటారు. కనీసం బాక్సాఫీస్ దగ్గరకు పరుగులు పెట్టిన జనసైనికుల్లో సగం మంది పోలింగ్ బూత్ లకు పరిగెత్తితే అదే పవన్ కి కొండంత బలం అయ్యేది.
సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తే మాకేంటి.. ప్రతి ఒక్కరం 10సార్లు సినిమా చూసి మా నిర్మాతలకు ఆదాయం చేకూరుస్తామంటూ సవాళ్లు విసిరిన వాళ్లు.. కనీసం ఒక్కొకరు 10మంది ఓటర్లను ప్రభావితం చేసినా పవన్ కి చాలా ఉపయోగం. ఆ దిశగా జనసైనికులు ఆలోచించినప్పుటే.. భీమ్లా.. కచ్చితంగా నాయక్ అవుతారు.
జగన్ పై విజయం సాధించారా..?
151 మంది ఎమ్మెల్యేల బలమున్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్.. ఏపీ రాజకీయాల్లో మేరునగధీరుడు. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కల్యాణ్ వాస్తవం చెప్పుకోవాలంటే రాజకీయాల్లో జీరో. రాజకీయాల్లో జీరో కావచ్చేమో కానీ, సినిమాల్లో మాత్రం హీరో అనిపించుకున్నారు పవన్. ఇక సినిమాలకి జగన్ కి సంబంధం లేనే లేదు. మరి వీరిద్దరికీ పోలిక ఎక్కడ.
కానీ సినిమా హీరో పవన్ ని తీసుకొచ్చి.. పొలిటికల్ హీరో జగన్ తో పోల్చి చూస్తున్నారు అభిమానులు. మా సినిమా సక్సెస్ అయింది, ప్రభుత్వం తొక్కేయాలనుకున్నా హిట్టైంది, థియేటర్ల దగ్గర అధికారుల్ని, పోలీసుల్ని కాపలా పెట్టినా హిట్టైంది అంటూ సంబరపడిపోతున్నారు.
ఎవరు, ఎవర్ని తొక్కారు, ఎందుకు తొక్కారు, అసలా అవసరమేంటి అంటూ మంత్రి పేర్ని నాని ఫుల్ క్లారిటీ ఇచ్చినా అభిమానులు ఇంకా అల్ప సంతోషంతోనే ఉన్నారు. 2024 ఎన్నికల్లో పవన్ మరోసారి చిత్తు చిత్తుగా ఓడిపోయి, ఎన్నికల టైమ్ లోనే పవన్ సినిమా సూపర్ హిట్ అయితే.. అభిమానులు ఫుల్ ఖుషీలో ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే పవన్ అభిమానులకు సినిమా హిట్ మాత్రమే కావాలి, పొలిటికల్ హిట్ అవసరం లేనే లేదు.
మరి పవన్ కి ఏం కావాలి..?
సినిమాల ద్వారా మైలేజీ కావాలి, దాని ద్వారా ఓటు బ్యాంక్ పెరగాలి, రాజకీయాల్లో తాను రాణించాలి. కానీ ఇప్పుడున్న పరిస్తితుల్లో ఇవన్నీ అసాధ్యం. పవన్ సినిమా హిట్ అవుతుంది కానీ, ఆయన రాజకీయాల్లో మాత్రం ఇంకా ఓనమాలు నేర్చుకోలేదు.
భీమ్లా హిట్ తో ప్రభుత్వంపై రివేంజ్ తీర్చుకున్నామని సంబరపడుతున్న అభిమానులు మరో నాలుగు రోజుల్లో అన్నీ మర్చిపోతారు. ఆర్ఆర్ఆర్ వస్తే అందరూ ఆ సినిమాపై పడతారు. సినిమా హిట్లు చూసి పవన్ ఏదేదో ఊహించుకుంటే మాత్రం కష్టం.
సినిమా విషయంలో అభిమానులంతా ఎంత ఉత్సాహంగా, ఐకమత్యంగా ఉన్నారో.. ఎన్నికల సమయంలో కూడా అంతే హుషారుగా ఉండాలి. అప్పుడే రీల్ హీరో పవన్ కల్యాణ్ రియల్ లైఫ్ లో కూడా హీరో కాగలరు. సీఎం కాకపోయినా కనీసం ఎమ్మెల్యేగా అయినా గెలుస్తారు.