జనవరి గండాన్ని జగన్ దాటేస్తే…!

మార్చిలో ఆంధ్ర ఎన్నికలు వుంటాయని ఓ అంచనా. ఫిబ్రవరి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. జగన్ ఏం చేయాలనుకున్నా, చేసినా అంతా జనవరిలోనే. ఇప్పటికే జనవరి 1 నుంచి పింఛన్లు పెంచుతున్నా అని…

మార్చిలో ఆంధ్ర ఎన్నికలు వుంటాయని ఓ అంచనా. ఫిబ్రవరి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. జగన్ ఏం చేయాలనుకున్నా, చేసినా అంతా జనవరిలోనే. ఇప్పటికే జనవరి 1 నుంచి పింఛన్లు పెంచుతున్నా అని ప్రకటించారు. అలాగే ఉద్యోగులకు హామీ ఇచ్చిన డిఎ బకాయిలు లాంటివి వుండనే వున్నాయి. ఇంకా అమ్మ ఒడి లాంటి మరి కొన్ని వార్షిక పథకాలు వున్నాయి. ఇలా చాలా వ్యవహారాలు జనవరికి ఫినిష్ చేయాల్సి వుంది.

వీటన్నింటి కోసం జనవరి వేళకు ఆరు నుంచి పది వేల కోట్లు అదనపు నిధులు అవసరం పడతాయి అని ఓ అంచనా. ఈ మేరకు నిధులు ఏదో విధంగా జగన్ ప్రభుత్వం సంపాదించాల్సి వుంది. అప్పు చేస్తారా, కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకుని వాడుకుంటారా? మరే విధంగా సమకూర్చుకుంటారు అన్నది పక్కన పెడితే ఈ నిధులు కనుక అందుబాటులోకి వస్తే సరిగ్గా ఎన్నికల ముందు, జగన్ ఓ సారి మాట ఇస్తే ఏదో విధంగా నిలబెట్టుకుంటాడనే భావన జనాల్లోకి మరోసారి బలంగా వెళ్తుంది.

జగన్ పవర్ లోకి వచ్చిన రెండో ఏట నుంచి ఎల్లో మీడియా కావచ్చు, పార్టీ కావచ్చు, జగన్ తన హామీలు నిలబెట్టుకోలేడు అంటూ ప్రచారం సాగించాయి. కానీ అనుకున్నట్లుగా పథకాలు అమలు చేస్తూ వస్తూ వుంటే..

జగన్ చేస్తున్న అప్పుల వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది. సోమాలియా అయిపోతుంది అని ప్రచారం సాగించాయి. అయినా జనం పట్టించుకోలేదు.

దీంతో సంక్షేమం కాదు, అభివృద్ది కావాలి అంటూ కొత్త రూట్లోకి మారాయి. అయినా జనం పట్టించుకోలేదు.

దీంతో జగన్ పథకాలు ఏవీ కొత్తవి కాదు, పాతవి తీసేసి, కొత్తవి ఇస్తున్నారు తప్ప మరేం లేదని మరో ప్రచారం సాగించారు.

అప్పుడూ జనంలో రియాక్షన్ లేదు. దాంతో తాము అధికారంలోకి వస్తే అంతకు మించి పథకాలు ఇస్తామంటూ ప్రచారం మొదలుపెట్టారు. మరి అప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోదా అని ఎవరైనా అంటారేమో అని, తాము అభివృద్ది సాధించి, నిధుల పెంచి, సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారు. అవన్నీ జరిగే పనినా కాదా అన్నది జనాలకు అనుమానం వుండనే వుంది.

ఇంక అందుకే పాత పాట అయిన అవినీతి మీదకు మళ్లారు. కానీ అదే అవినీతి మరక చంద్రబాబుకు అంటుకుంది. ఇలా అన్ని విధాలా ఎల్లో వ్యూహాలు కౌంటర్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో జనాలకు మరోసారి జగన్ పట్ల మమకారం రావాలి అంటే సరిగ్గా ఎన్నికల ముందు మరోసారి తను మాట ఇచ్చిన పథకాలు అన్నీ టైమ్ ప్రకారం అమలు చేయాలి. 

అలా చేయాలంటే జనవరి వేళకు నిధులు అందాలి. ఈ గండాన్ని జగన్ దాటేస్తే బాబు గారి అను ‘కుల’ మీడియా చేసే ప్రచారాన్ని దాటుకుని జనాలకు చేరువకావచ్చు. నేరాన్ని సింపతీగా మార్చే ఎల్లో ప్రచారాన్ని కూడా పనిలో పనిగా దాటేయవచ్చు. వైకాపా జనం నేరుగా జనాల దగ్గరకు వెళ్లడానికి మరింత సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.