అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవడంలో.. సేవించుకోవడంలో.. ‘వీఐపీ’ అనే ముసుగులో కొందరు భక్తులు సాగించే అడ్డగోలు దందాలను నియంత్రించడంలో టీటీడీ యాజమాన్యం మరో ముందడుగు వేసింది.
సామాన్య భక్తులకు పెద్ద పీట వేయడానికి.. దేవదేవుని దర్శించుకోవడంలో వారికి అగ్రప్రాధాన్యం ఇవ్వడానికి తాజాగా ఇంకో నిర్ణయం తీసుకుంది. శని, ఆది వారాలలో సిఫారసు ఉత్తరాల మీద అనుమతించే వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది. తద్వారా లభించే అదనపు సమయాన్ని కూడా సామాన్య భక్తుల దర్శనాలకే కేటాయించాలని నిర్ణయించింది. పేద భక్తులకు, వీఐపీ బ్రేక్ దర్శనాల కారణంగా.. గంటలకొద్దీ నిరీక్షణలోనే గడిపే భక్తులకు ఇది వరంలాంటి నిర్ణయం అని చెప్పవచ్చు.
సాధారణంగా తిరుమలేశుని సేవల్లో ఆర్జితసేవలకు అదనంగా వీఐపీ బ్రేక్ దర్శనం కూడా ఉంటుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, బోర్డు సభ్యులు, ఇలాంటి ప్రోటోకాల్ పరిధిలోకి వారు ఇచ్చే సిఫారసు ఉత్తరాలను తెచ్చుకోగలిగిన ప్రముఖులు ఈ వీఐపీ బ్రేక్ దర్శనానికి వెళ్తారు. ఒక్కో సిఫారసు ఉత్తరంపై ఆరుగురు భక్తులు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. మంత్రులు ఎమ్మెల్యేలు బోర్డు సభ్యులు.. ఇలా సిఫారసు ఉత్తరాల మీద దర్శనానికి తయారయ్యే వారి సంఖ్య వేలల్లోనే ఉంటుంది. ప్రతిరోజూ వీరికి కూడా వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు అవుతూనే ఉంది.
అయితే శని, ఆది వారాల్లో తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వారంపొడవునా, ఉద్యోగాలు కూలినాలి చేసుకుంటూ ఉండే పేద భక్తులు కూడా.. అప్పుడైతే సెలవు ఉంటుంది గనుక.. దైవదర్శనానికి వస్తుంటారు. తాము వీఐపీలు అనుకునే వారు కూడా.. ఆ రోజుల్లేనే ఖాళీ చేసుకుని తిరుమలకు వస్తుంటారు. సిఫారసు ఉత్తరాలను తెచ్చుకుంటూ ఉంటారు. అందుకే శని ఆదివారాల్లో తిరుపతి చేరడానికి రైలు టికెట్లు మాత్రమే కాదు, విమానం టికెట్లు కూడా చాలా రద్దీగా ఉంటాయి.
అయితే ఆ రోజుల్లో అసలే విపరీతంగా ఉండే భక్తులరద్దీకి ఈ వీఐపీలు కూడా తోడయ్యేసరికి.. ఉచితదర్శనానికి వెళ్లే పేద భక్తులు అప్పటికే రెండు మూడురోజులు నిరీక్షించినా వారికి దర్శనం దొరకదు. అసలే కూలిచేసుకుని పేద భక్తులు కూడా అనుకున్న రోజుల్లో దర్శనం దొరక్కపోతే.. మరొకరోజు కూలి వదులుకుని తిరుమలలోనే ఆగిపోవాల్సి వస్తుంది. వీఐపీలకు వారు సహజంగా పెద్దవారు, సంపన్నులే గనుక.. అంత ఖర్మ ఉండదు. వారు ఎప్పుడైనా రాగలరు. ఇలాంటి అంశాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది.
శని ఆదివారాల్లో అసలు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని పూర్తిగా రద్దు చేసేసింది. సిఫారసు ఉత్తరాల మీద వచ్చే వారికి అసలు దర్శనం ఉండదు. ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రముఖులు స్వయంగా వస్తే మాత్రం వారికి దర్శనం ఎటూ కల్పిస్తారు. అంతే తప్ప.. పైరవీలు చేసి సిఫారసు ఉత్తరాలు పుట్టించుకుని వచ్చేవారిని ఆ రెండురోజుల్లో కట్టడిచేస్తున్నారు.
ప్రస్తుతం ప్రతినిత్యం 30వేల మంది భక్తులకు సర్వదర్శనం ద్వారా దేవదేవుడిని సేవించుకునే అవకాశం కల్పిస్తున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు ద్వారా లభించే అదనపు సమయానికి సరిపడా సర్వదర్శనం భక్తులకు టికెట్ల కోటా పెంచనున్నారు. దీని వల్ల పేదభక్తులు మరింతగా హర్షించే అవకాశం ఉంది.