వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన కేసు.. విచారణలో ఉంది. ఈ విషయంలో దర్యాప్తు సంస్థ సీబీఐ అనేక మందితో మాట్లాడుతూ.. వివరాలను వాంగ్మూలాల రూపంలో సేకరిస్తూ ఉంది. కొందరు నిందితులను అరెస్టు చేసి విచారిస్తోంది. కోర్టులో దీనికి సంబంధించిన కేసు నడుస్తోంది.
కోర్టు కేసు విచారణ పూర్తయిన తర్వాత.. దోషులెవరో తేలుతారు.. శిక్ష పడుతుంది. అయితే ‘శూలశోధన’ (ఇన్వెస్టిగేషన్ అనే పదానికి పత్రికలు పెట్టుకున్న తెలుగుపేరు) చేస్తున్న పచ్చ పత్రికలు మాత్రం ‘సీబీఐ వాంగ్మూలంలో పేర్కొన్న వివరాలు లీకయ్యాయి’ అనే మాట ద్వారా ప్రతిరోజూ పుంఖాను పుంఖాలుగా కథనాలు వండి వార్చేస్తున్నారు.
సీబీఐ విచారణ డాక్యుమెంట్లు లీక్ కావడం ద్వారానే తెలుస్తున్న వివరాలు అవి అనిపించేట్లుగా కథనాలు ఉంటున్నాయి. ఈ కథనాలు అన్నీ కూడా.. ‘కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్వయంగా హత్య చేయించాడు’ అనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించే దిశగానే సాగుతున్నాయి. ఆయనే హత్యకు మూలకారకుడా కాదా అనే సంగతి న్యాయస్థానం తేల్చేవరకు ఆగే ఉద్దేశం, ఓపిక ఈ పచ్చ పత్రికలకు ఉన్నట్టుగా లేదు.
ఈ పరిణామాలపై ఎంపీ అవినాష్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదు. తన అనుచరులు విచారణకు కోర్టుకు వచ్చినప్పుడు అక్కడికెళ్లి యాగీ చేయడం, సీబీఐ అధికార్ల మీద రంకెలు వేయడం లాంటి పనులతో వార్తల్లోకి వచ్చిన అవినాష్ రెడ్డి. తన మీద కేసు సంగతి తేలకముందునుంచీ జరుగుతున్న ఈ ప్రచారాన్ని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? అనేది పెద్ద ప్రశ్న. అవినాష్ రెడ్డిని కోర్టు తీర్పు కంటె ముందే బద్నాం చేసేయడానికి పచ్చపత్రికలు కంకణం కట్టుకున్నాయనేది స్పష్టం. వీరి ప్రచారంపై అవినాష్ రెడ్డి కోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉంది.
‘‘సీబీఐ వాంగ్మూలంలో సమాచారం బయటకు వచ్చింది’’ అనే ట్యాగ్ లైన్ తో పచ్చ పత్రికలు ఇస్తున్న వివరాలు నిజమో కాదో ఎవ్వరికీ తెలియదు. నిజానిజాలను కోర్టు నిర్ణయించాల్సి ఉంది. అయితే కోర్టు తేల్చేలోగా.. అలాంటి కథనాలు ప్రచురించడం ద్వారా.. ప్రజల్లో నాకున్న ఆదరణను, ప్రతిష్ఠను భంగపరచడానికి ఈ పత్రికలు ప్రయత్నిస్తున్నాయి.
సీబీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే.. బయటకు వచ్చిన సమాచారం పేరుతో వీరు ఇస్తున్న కథనాల సత్యసంధత ఎవ్వరికీ తెలియదు. కాబట్టి, వివేకానందరెడ్డి మరణానికి సంబంధించి.. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా.. ‘సమాచారం తెలిసింది, వివరాలు బయటకు వచ్చాయి’ అంటూ ఏ కథనాలూ ప్రచురించకుండా పత్రికలకు ఆదేశాలివ్వండి. ఇలాంటి కథనాల ద్వారా.. నా ప్రతిష్ఠకు భంగం కలిగించడమే లక్ష్యంగా కనిపిస్తోంది.
కోర్టు విచారణ తర్వాత.. ఈ కథనాలు నిజం కాదని తేలినా.. ఆలోగా నా ప్రజాదరణ మసకబారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి.. విచారణ పూర్తయ్యే దాకా సీబీఐ వాంగ్మూలాలను అధికారికంగా ప్రకటించకుండాను, పత్రికలు ఇతరమీడియా ఈ హత్య గురించి ఊహలను, కల్పిత కథనాలను ప్రచురించకుండా ఆదేశాలు ఇవ్వండి. సోషల్ మీడియాలో అయినా సరే.. ఎవ్వరైనా కల్పిత ఊహలను ప్రచారంలో పెట్టేట్లయితే వారు ప్రాసిక్యూషన్ ఎదుర్కోవలసిందేనని హెచ్చరిస్తూ ఆదేశాలు ఇవ్వండి’’ అని కోరుతూ వైఎస్ అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించవచ్చు.
ఇలాంటి కల్పిత కథనాలు ఒక్కరోజు కొనసాగినా కూడా.. తన ప్రతిష్ఠ ఎంత దారుణంగా అయినా దెబ్బతినే ప్రమాదం ఉన్నది గనుక.. సత్వర ఆదేశాలను కూడా కోర్టునుంచి కోరవచ్చు.
ఆ రకంగా వైఎస్ వివేకా మరణానికి సంబంధించిన లీకుల కథనాలపై ఎంబార్గో విధించాల్సిందిగా కోర్టును కోరవచ్చు. ఈ పిటిషన్ ను కోర్టు ఆమోదించడానికి, సత్వర ఆదేశాలకు కూడా అవకాశం ఉంటుంది. అదే జరిగితే.. ‘అవినాష్ రెడ్డి హత్య చేయించాడు’ అని అర్థం వచ్చేలా పచ్చమీడియాలో వెల్లువెత్తుతున్న కథనాలకు బ్రేక్ పడుతుంది.
వైఎస్ అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం ద్వారా.. కేసు సంగతి తేలేవరకు తన ప్రతిష్ఠను కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ఆయన ఈ దిశగా ఎందుకు ఆలోచన చేయడంలేదో.. ఆయనకు ఎవరైనా ఇలాంటి సలహాలు ఎందుకు ఇవ్వడం లేదో మరి!!