“సీఎం జగన్ నాకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. అయినా నేను వెళ్లలేదు.” సరిగ్గా 10 రోజుల కిందట బాలకృష్ణ తనకుతాను ఇచ్చుకున్న స్టేట్ మెంట్ ఇది. ఆయన ఇచ్చిన ప్రకటన వెనక ఎంత నిజం ఉందనే విషయాన్ని కూడా చెక్ చేసుకోకుండా.. ఎల్లో మీడియా దాన్ని హైలెట్ చేసింది. జగన్ ఆహ్వానాన్నే తిరస్కరించిన సింహా అంటూ హెడ్డింగులు పెట్టింది. ఇప్పుడీ మొత్తం వ్యవహారంపై మంత్రి పేర్ని నాని స్పందించారు.
బాలయ్య చెప్పిన మాట పూర్తిగా అవాస్తవం అన్నారు మంత్రి. సీఎంతో అపాయింట్ మెంట్ కావాలని స్వయంగా బాలకృష్ణ తనను రిక్వెస్ట్ చేశారని జరిగిన కథ మొత్తం చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో బాలయ్యకు ఎంత ముహూర్తాల పిచ్చి ఉందనే విషయాన్ని కూడా మంత్రి పరోక్షంగా బయటపెట్టారు.
“అఖండ సినిమా విడుదలకు ముందు ఆ సినిమా నిర్మాతలు నన్ను కలవడానికి ప్రయత్నించారు. అది కూడా వెంటనే కలవరంట. వాళ్లకు 2-3 తేదీలు, టైమింగ్స్ ఇవ్వాలంట. వాటిలోంచి ఆ హీరోగారు ఒకటి నిర్ణయిస్తారట. ఇదేదో విచిత్రంగా అనిపించింది నాకు. అయినప్పటికీ వాళ్ల కోసం నేను 2-3 డేట్స్ ఇచ్చాను. అందులో ఒక డేట్, టైమ్ ముహూర్తం చూసుకొని, నిర్మాతలు విజయవాడలోని ప్రభుత్వ అతిథి గృహంలో నన్ను కలిశారు.
బాలయ్య మీతో మాట్లాడతారంటూ ఆయనకు మిస్డ్ కాల్ ఇచ్చారు. అదేంటి మాట్లాడొచ్చు కదా అని అడిగాను. బాలయ్య ముహూర్తం చూసి అప్పుడు ఫోన్ చేస్తారంట. నాతో మాట్లాడ్డానికి కూడా ఆయన ముహూర్తం పెట్టుకున్నారు. మొత్తానికి ఓ ముహూర్తం చూసుకొని, బాలయ్య నాతో మాట్లాడారు. నేను సీఎంను కలుస్తాను, అపాయింట్ మెంట్ కావాలని స్వయంగా నన్ను అడిగారు.
నేను సీఎం జగన్ గారికి అదే విషయం చెప్పాను. బాలయ్య వచ్చి కలుస్తానంటున్నారని అన్నాను. తన దగ్గరకు బాలయ్య వస్తే బాగోదని స్వయంగా జగన్ గారు వారించారు. ఆయనకు ఏం కావాలో అది చేసి పెట్టమని నన్ను ఆదేశించారు. పెద్దమనిషి ఎవ్వరో ఇప్పుడు చెప్పండి. ఎవరిది పెద్దరికం. బాలయ్య అబద్ధాలు ఆడతారని నేను ఎప్పుడూ అనుకోలేదు.”
ఇలా బాలయ్య బాగోతం మొత్తం బయటపెట్టారు మంత్రి. దీంతో 10 రోజుల కిందట బాలయ్య ఇచ్చిన స్టేట్ మెంట్లు అన్నీ బిల్డప్ కోసమే తప్ప, నిజం లేదని తేలిపోయింది. మరోవైపు అఖండ రిలీజ్ టైమ్ లో ప్రభుత్వం అడ్డుకుందనే ప్రచారాన్ని కూడా తిప్పికొట్టారు మంత్రి. అఖండ సినిమా టైమ్ లో ప్రభుత్వం వేధించిందని బాలయ్య చెబితే, తను బహిరంగంగా క్షమాపణలు చెబుతానన్నారు పేర్ని నాని.