ఎవరు చేసారు? ఎందుకు చేసారు? ఏం సాధిద్దామని చేసారు? అన్న ప్రశ్నలకు సమాధానం అంత సులువు కాదు కానీ భీమ్లా నాయక్ సినిమా విషయంలో ఆంధ్రలో అత్యుత్సాహం ప్రదర్శించిన వైనం పూర్తిగా అభాసుపాలయింది. వకీల్ సాబ్ సినిమాతో ప్రారంభమైన టికెట్ ల సమస్య భీమ్లా నాయక్ సినిమాతో పీక్స్ కు చేరుకుంది. నిజానికి శ్యామ్ సింగ రాయ్ సినిమా టైమ్ లో అలజడి రేగింది. అయితే అక్కడ సమర్ధించుకోవడానికి ప్రభుత్వానికి పాయింట్ ఉంది. లైసెన్స్ లు లేని, రెన్యూవల్ చేసుకోని థియేటర్ల మీద తనిఖీలు అని చెప్పుకున్నారు. అది నిజం కూడా.
అయితే ఆ తరువాత సినిమా వర్గాలు మంత్రి పేర్ని నానిని కలవడం, థియేటర్లకు కొన్నాళ్లు వెసులుబాటు ఇవ్వడం జరిగిపోయింది. ఆ తరువాత వచ్చిన సినిమాలకు ఏ సమస్యా లేకపోయింది. అలా అని ప్రభుత్వం నిర్ణయించిన రేట్లే అమ్మలేదు. ఎవరి చిత్తానికి వారు డిమాండ్ ను బట్టి యూనిఫారమ్ రేటు అమ్ముకున్నారు. ఈ లోగా కొత్త రేట్లు వస్తాయి అని అంతా ఎదురు చూస్తున్న వేళ భీమ్లా నాయక్ వచ్చింది. ఫ్రభుత్వం ఎప్పటి మాదిరిగా చూసీ చూడనట్లు వదిలేసి వుంటే నూరు, నూట యాభై, ఇలా ఎవరికి తోచిన రేట్ల వారు అమ్మేసుకునేవారు.
ఇష్టం అయిన వారు కొనుక్కునేవారు. కష్టం అయిన వారు సణుక్కునేవారు. కానీ ప్రభుత్వం అలా చేయలేదు. దాదాపుగా యుద్దం ప్రకటించినట్లుగా చేసింది. యావత్ అధికార బలగాలను థియేటర్ల దగ్గర మోహరించింది. దాంతో ఏమయింది, సినిమా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ది కావడంతో విపక్షం అయిన తెలుగుదేశం రంగంలోకి దిగిపోయింది. భీమ్లా నాయక్ సినిమాకు అన్యాయం జరిగిపోతోంది అంటూ యాగీ ప్రారంభించింది. దాని మీడియా దీనికి వత్తాసు పలికింది.
నిజానికి ప్రభుత్వం రెండు విషయాలు చెబుతోంది. తాము నిర్ణయించిన రేట్లకు అమ్మమని, రెండవది అనుమతి లేకుండా అదనపు ఆటలు వద్దు అని. ఇది పెద్ద విషయం కాదు. కానీ భీమ్లా నాయక్ విషయంలోనే ఇంతలా పట్టుపట్టడం సమస్య అయింది. దాంతో పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రభుత్వం భయపడుతోంది అనే కలరింగ్ వచ్చింది. ఓట్లు ఎన్ని వేస్తారు..ఎన్ని పడతాయి అన్నది పక్కన పెడితే సినిమా చూడాలనుకునే కుర్రాళ్ల గొడవ ఎక్కువయింది. చంద్రబాబు అండ్ కో దీని దగ్గర చలి కాచుకునే ప్రయత్నం ప్రారంభించారు. ఆయన, ఆయన తనయుడు చినబాబు ట్వీట్ లు మీద ట్వీట్ లు వేసారు.
సరే ఈ యుద్దం అక్రమమో, సక్రమమో అన్న సంగతి పక్కన పెడితే ప్రభుత్వ పంతం ఏమైనా నెరవేరిందా? అంటే అదీ లేదు. సీడెడ్ లో 200 నుంచి 500 రూపాయలకు భీమ్లా నాయక్ టికెట్ లు విక్రయించారు. ముఖ్యమంత్రి స్వంత ప్రాంతమైన కడపలో కూడా ఇదే జరిగింది. ఎవరు ఆపగలిగారు? అధికారులు బలంగా వున్నచోట ఒకలా, థియేటర్ యజమానులు బలంగా వున్న చోట మరోలా అన్నట్లుంది పరిస్థితి.
ఇంత జరిగాక మంత్రి పేర్ని నాని రంగంలోకి దిగి ప్రెస్ మీట్ పెట్టి ఆయన స్టయిల్ లో ఆయన మాట్లాడారు. కానీ దీని వల్ల ఒనగూడిందేమిటి? ప్రభుత్వ పాలసీ ఇదీ అంటూ జనంలోకి బలంగా ఓ ఒపీనియన్ పంపించగలిగారా? ప్రజల్లో కొంత మందైనా ప్రభుత్వ వైఖరి సరైనదే అని అనిపించగలిగారా? లేదు.
ఇప్పుడే టికెట్ ల విషయంలో ఏమీ చేయలేని ప్రభుత్వం, చేసే ప్రయత్నం చేసి అభాసు అవుతున్న ప్రభుత్వం, రేపు కొత్త జీవో తెచ్చి, కొత్త రేట్లు తెచ్చి ఏం సాధిస్తుంది? వాటిని మాత్రం అమలు చేయగలదా? సినిమా థియేటర్లను నియంత్రించడం ఫ్రభుత్వానికి చాతనయ్యే వ్యవహారం కాదు. అంతకన్నా మంచి పని ఏమిటంటే, తెలంగాణలో మాదిరిగా భయంకరంగా రేట్లు పెంచేయడం. అప్పుడు జనాలు, థియేటర్లకు మధ్యకు మారుతుంది సమస్య. ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చోవచ్చు.