అడుసు తొక్కనేల.. కాలు కడగనేల.. టీటీడీ పాట్లు

టీటీడీకి ఇది కరెక్ట్ గా సరిపోతుందేమో.. “500 కాకపోతే రెండు వేల రూపాయలు చేయండి, ఏం పెంచితే ఏమవుతుంది. డబుల్, ట్రిపుల్, చాలకపోతే నాలుగు రెట్లు పెంచండి.” ఇదీ టీటీడీ మీటింగ్ లో మనం…

టీటీడీకి ఇది కరెక్ట్ గా సరిపోతుందేమో.. “500 కాకపోతే రెండు వేల రూపాయలు చేయండి, ఏం పెంచితే ఏమవుతుంది. డబుల్, ట్రిపుల్, చాలకపోతే నాలుగు రెట్లు పెంచండి.” ఇదీ టీటీడీ మీటింగ్ లో మనం విన్న భాష. ఇలాంటి మాటలు విన్న సామాన్యులకెవరికైనా రేట్లు పెంచుతున్నారనే విషయం ఈజీగా అర్థమవుతుంది. ఆ రేట్లు సామాన్యులవా, వీఐపీలవా అనే విషయం వారికి అవసరం లేదు. టీటీడీ టికెట్ రేట్లు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. అది కూడా గతంలో ఎప్పుడూ లేనంతగా భారీగా రేట్లు పెంచుతున్నారనే భావం జనాల్లోకి వెళ్లిపోయింది.

అందులోనూ టీటీడీ మీటింగ్ లో సభ్యులు అంత సరదాగా మాట్లాడుకుంటారని ఎవరూ అనుకోలేదు. మీరు అన్ని టికెట్లు బుక్ చేశారంటే, మీరు ఇన్ని చేశారంటూ ఒకరి బండారం ఇంకొకరు బయటపెట్టుకున్నారు. పోనీ అవి కోటి రూపాయల టికెట్లే, అలాంటివాటితో సామాన్యులకు పనిలేదనే అనుకుందాం. వాటిల్లో కూడా టీటీడీ వాటాలు వేసుకోవడం ఏం బాగుంటుంది. పేద భక్తుల గురించి మాట్లాడుకోని టీటీడీ మీటింగ్ కి అర్థమేముంటుంది.

పోనీ పెంచాలనుకున్నప్పుడు అదేదో ప్రకటన రూపంలో విడుదల చేయాలి కానీ, మరీ ఇంత ఓపెన్ గా మీడియా ముందు పెంచండి, పెంచుకుంటూ పోండి అని చెప్పుకోవాలా. ఇప్పుడు కేసులు వేస్తాం, తప్పుడు ప్రచారం.. అంటూ తొక్కిన అడుసుని కడుక్కోవాలా..? ఈ అనుభవాలన్నీ భవిష్యత్తులో ఎలా పనిచేయాలనే విషయాలను నొక్కి చెబుతున్నాయి. 

అసలే మీడియా, సోషల్ మీడియా బాగా యాక్టివ్ గా ఉంటున్న రోజులివి. ఏం చేసినా, ఏం మాట్లాడుకున్నా అంతా బహిరంగమే. అందులోనూ కెమెరాల ముందు మాట్లాడుకుంటున్నప్పుడు కాస్త సంయమనంతో ఉండాల్సింది. అలాంటిది పెంచండి, భారీగా పెంచేయండి అనే మాటలు సామాన్యులకి కాస్త వినడానికి కష్టంగానే ఉంటున్నాయి.

తీరా ఇప్పుడు కవరింగ్ కోసం టీటీడీ అష్టకష్టాలు పడుతోంది. సామాన్యుల కోసం ప్రతి ఊరిలో టీటీడీ సొమ్ముతో గుడి కడుతున్నాం. గో సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. పేదలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాలతో పాటు దర్శన భాగ్యం కల్పిస్తున్నాం, చిన్నపిల్లల వైద్యం కోసం భారీగా ఖర్చు పెడుతున్నాం అంటూ తాము చేసిన మంచి పనుల్ని చెప్పుకోవాల్సి వస్తోంది. కానీ తప్పు చేశారు కాబట్టే ఇలా కవర్ చేసుకుంటున్నారనే ప్రచారం జనాల్లోకి వెళ్లిపోతోంది.

వాస్తవానికి టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి వచ్చిన తర్వాతే సామాన్య భక్తులకు కాస్త ప్రయారిటీ పెరిగింది. వైకుంఠ ఏకాదశి దర్శనాల్లో కూడా సామాన్యులకు పెద్దపీట వేశారు. అదే సమయంలో ఆర్జిత సేవల రేట్లు కూడా అనివార్యంగా పెంచాల్సి వచ్చింది. కానీ బ్లాక్ లో టికెట్ రేట్లు భారీగా ఉంటున్నాయి కదా అంటూ ఆ బ్లాక్ రేట్లనే తాము కూడా అమలు చేయాలనుకోవడం మూర్ఖత్వం. దేవుడికి రేటు కట్టారనే నింద టీటీడీపై వేసుకోవడం ఎందుకు..?

గతంలో కూడా ఉచిత అన్నప్రసాదం ఇస్తూనే, నాణ్యమైన భోజనానికి రేటు కట్టబోయి తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది టీటీడీ. మరోసారి ఇప్పుడు ఆర్జిత సేవల రేట్ల విషయంలో నాలుక కరుచుకుంది. అసలే ప్రతిపక్షాలు గోతికాడ నక్కల్లా ఉన్నాయి. కెమెరాల ముందు ఆవేశపడి వాటికి అవకాశమివ్వడం ఎందుకు..? ఇప్పుడిలా కవర్ చేసుకోడానికి ప్రెస్ మీట్లు ఎందుకు..?