మ‌మ్మ‌ల్ని దొంగ‌ల్లా అవ‌మానిస్తారా?- నిర్మాత‌

త‌మ‌ను ప్ర‌భుత్వం దొంగ‌ల్లా అవ‌మానిస్తోంద‌ని ప్ర‌ముఖ నిర్మాత‌, ఫిల్మ్ చాంబ‌ర్ మాజీ అధ్య‌క్షుడు ఎన్వీ ప్ర‌సాద్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా న‌టించిన భీమ్లానాయ‌క్ సినిమా విడుద‌ల నేప‌థ్యంలో నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా…

త‌మ‌ను ప్ర‌భుత్వం దొంగ‌ల్లా అవ‌మానిస్తోంద‌ని ప్ర‌ముఖ నిర్మాత‌, ఫిల్మ్ చాంబ‌ర్ మాజీ అధ్య‌క్షుడు ఎన్వీ ప్ర‌సాద్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా న‌టించిన భీమ్లానాయ‌క్ సినిమా విడుద‌ల నేప‌థ్యంలో నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేసేందుకు ప్ర‌భుత్వం రెవెన్యూ యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేసింది. ఈ మేర‌కు రెవెన్యూ యంత్రాంగం సినిమా థియేట‌ర్ల వ‌ద్ద మ‌కాం వేసి, అన్నీ నిబంధ‌న‌ల మేర‌కే అమ‌లు అయ్యేలా ప‌ర్య‌వేక్షిస్తోంది.

ఈ నేప‌థ్యంలో నిర్మాత‌, ఫిల్మ్ చాంబ‌ర్ మాజీ అధ్య‌క్షుడు ఎన్వీ ప్ర‌సాద్ తాజా ప‌రిణామాల‌పై స్పందిస్తూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కోవిడ్‌తో ఎగ్జిబిట‌ర్లు కోలుకోలేని స్థితికి చేరుకున్నార‌న్నారు. అన్ని టాక్స్‌లు క‌ట్టించుకుని రెన్యూవ‌ల్ చేయ‌డం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఉదయం 10 గంట‌ల్లోపు ఎవ‌రూ సినిమా వేయ‌లేద‌ని, వేయ‌రు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. సినిమా వాళ్ల‌ను దొంగ‌ల్లా అవ‌మానిస్తూ థియేట‌ర్ల వ‌ద్ద 15 మందిని కాప‌లా పెట్టి, దాడులు చేయ‌డం త‌గ‌ద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోయిన విషాదంలో ఉన్న సమయంలో థియటర్ల వ్యవస్థపై ఈ దాడి అవసరమా అని ఆయ‌న ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. కరోనా కంటే ఇది తీవ్రమైన దాడిగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఇలాంటి చ‌ర్య‌ల వల్ల పవన్ కల్యాణ్‌కు నష్టం లేదన్నారు. సీఎంకు కూడా  విజయవాడలో థియటర్లు ఉన్నాయని… అక్కడ పరిస్థితిని తెప్పించుకుని జ‌గ‌న్ చూడవచ్చని ఆయ‌న సూచించారు.

ఎన్వీ ప్ర‌సాద్ వ్యాఖ్య‌ల‌తో సినిమా ఇండ‌స్ట్రీ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై ఏ విధంగా ఆవేద‌న చెందుతున్న‌దో తెలుసుకోవ‌చ్చు. థియేట‌ర్ల వ‌ద్ద రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం తిష్ట‌వేసి నిబంధ‌న‌లు ఖ‌చ్చితంగా అమ‌లు చేయ‌డాన్ని క‌క్ష‌తో వ్య‌వ‌హ‌రించ‌డంగా ఇండ‌స్ట్రీ భావిస్తోంది. మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి మృతికి సంతాప‌సూచికంగా భీమ్లానాయ‌క్ ప్రీరిలీజ్ వేడుక‌ను వాయిదా వేసుకున్న సంగ‌తి తెలిసిందే. కానీ మంత్రి మృతి చెందిన విషాద వాతావ‌ర‌ణంలో కూడా థియేట‌ర్ల‌పై దాడులు చేయ‌డాన్ని ఇండ‌స్ట్రీ జీర్ణించుకోలేకుంది.