మూవీ రివ్యూ: భీమ్లా నాయక్

చిత్రం: భీమ్లా నాయక్  రేటింగ్: 3/5 తారాగణం: పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, సముద్రఖని, మురళీశర్మ, రావు రమేష్, కాదంబరి, నర్రా తదితరులు ఛాయాగ్రహణం: రవి కె. చంద్రన్…

చిత్రం: భీమ్లా నాయక్ 
రేటింగ్: 3/5
తారాగణం: పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, సముద్రఖని, మురళీశర్మ, రావు రమేష్, కాదంబరి, నర్రా తదితరులు
ఛాయాగ్రహణం: రవి కె. చంద్రన్
నృత్యాలు: గణేష్ మాస్టర్ 
పోరాటాలు: విజయ్ 
కూర్పు: నవీన్ నూలి 
సంభాషణలు: త్రివిక్రమ్  
సంగీతం: తమన్ 
నిర్మాత: నాగ వంశీ సూర్యదేవర 
దర్శకత్వం: సాగర్ చంద్ర
విడుదల తేదీ: 25 ఫిబ్రవరి 2022

చాలా కాలం తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ సినిమా కావడం, ఎన్నో వాయిదాలు పడుతూ ఎట్టకేలకి విడుదల కావడం, మళయాళంలో మంచి పేరు తెచ్చుకున్న “అయ్యప్పన్ కోషియుం” కి రీమేక్ కావడం, త్రివిక్రమ్ సంభాషణలు రాయడం, పాటలు సూపర్ హిట్ కావడం, విడుదలకి ముందు వచ్చిన రెండవ ట్రైలర్ ఏకగ్రీవంగా చాలామందికి నచ్చడం వంటి కారణాల వల్ల ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయి.

సాధారణంగా అన్నేసి అంచనాలున్నప్పుడు ఏ మాత్రం గ్రిప్ తగ్గినా, కాస్త ల్యాగ్ అనిపించినా ప్రేక్షకుల్లో అసహనం మొదలైపోతుంది. కనుక అంచనాలు అమాంతం పెరగడం ఎంత గొప్ప సినిమాకైనా ఇబ్బందే. ఆ పరిస్థితిలో అంచనాలు అందుకున్నా సరిపోదు…అంతకు మించి పైకెగరాలి. అలా అంచనాలు దాటుకుని ప్రేక్షకుల్ని మెప్పించడమంటే నిజంగా పోల్ వాల్ట్ జంప్ లాంటిదే. 

“భీమ్లా నాయక్” ని కథ పరంగా దాచేదేం లేదు. ఒక ఎస్సై- మరొక పలుకుబడి ఉన్న వ్యక్తి మధ్యలో ఇగో క్లాష్ అని అందరికీ తెలుసు. చాలా కంపోజ్డ్ గా, సహజత్వానికి అతి దగ్గరగా ఉండే విధంగా మలయాళ వర్షన్ ఉంటే తెలుగులో పవన్ కళ్యాణ్ లాంటి మాస్ హీరోని పెట్టుకుని ఎలా మలచారా అన్నదే ఇక్కడ ఆసక్తికరమైన విషయం. 

పవన్ కళ్యాణ్ కోసం కథని మార్చేసి ఆది నుంచీ గబ్బర్ సింగ్ రేంజులో చూపించేస్తారని, పేరుకి రీమేకే తప్ప ఇది కొత్తగా దింపిన మేకవుతుందేమో అని పలువురు అభిప్రాయపడ్డారు. దానికి తోడు త్రివిక్రమ్ మార్కు పంచ్ ప్రాస డయలాగ్స్ ఈ సీరియస్ మూవీకి సెట్ కావనే మరొక అనుమానం కూడా ఉన్నమాట వాస్తవం. అయితే ఆ అనుమానాల్ని, భ్రమల్ని పటాపంచలు చేస్తూ ఆద్యంతం కట్టిపారేసిన చిత్రం ఈ “భీమ్లా నాయక్”. తెలిసిన కథే అయినా, చూసిన కథనమే అయినా ప్రేక్షకుడిని పట్టు సడలకుండా పట్టుక్కూర్చున్న సినిమా ఇది. 

పవన్ కళ్యాణ్ మొదటి సీన్స్ లో ఎక్కడా స్టార్లా కనిపించడు. సీనియర్స్ చెప్పిన పని చేసే సగటు ఎస్సైగా ఒదిగిపోయాడు. ఫ్యాన్స్ కి ఈ విధానం నచ్చకపోవచ్చు. కానీ ఒరిజినల్ కి కట్టుబడి పవన్ కళ్యాణ్ తనలోని స్టార్ ని కాసేపైనా పక్కనబెట్టి ఒక నటుడిగా పనిచేసిన తీరు మెచ్యూర్ ఆడియన్స్ ని మెప్పిస్తుంది. అలాగని సినిమా మొత్తం ఇదే పద్ధతిలో ఉండడు. రెండవ సగంలో విజృంభించిన స్టారే కనిపిస్తాడు. అది ఫ్యాన్స్ కి మాత్రమే నచ్చే విషయం. చివర్లో మాత్రం త్రివిక్రమ్ మార్కు క్లోజింగ్ డయలాగుతో కాంప్రమైజ్ సీన్ పెట్టారు. మలయాళంలో కాస్త భిన్నంగా ఉంటుంది. 

ఎక్కడా కామెడీ ట్రాక్ లేకపోయినా, ఓటీటీలో చూస్తే నచ్చిన సినిమా కదా, హాల్లో ఎక్కుతుందో లేదో అనే అనుమానాలున్నా..ఎక్కడా బోర్ కొట్టలేదు. 

అయితే కొన్ని లోటుపాట్లు కూడా లేకపోలేదు. రావు రమేష్ పాత్రని మరీ చిన్నది చేసేసారు. ట్రాక్ మీదే ఉంది కనుక దానిని ఇంకాస్త పొడిగించినా బానే ఉండేది. 

అలాగే రానా క్యారక్టర్ స్థాయిని సెకండాఫులో బాగా తగ్గించేసారు. అది పవన్ ని లేపడానికి చేసిన పని అని అర్థమవుతూనే ఉంది. నిజానికి ఇలా చేయకపోయినా సినిమా ఫలితానికి అడ్డమేమయ్యేది కాదు. 

ఇక అతి పెద్ద బ్లండరేంటంటే ఆంధ్రప్రదేశ్ ఎస్సై చివర్లో తెలంగాణా ఎస్సైగా దర్శనమివ్వడం. ఐపీయస్ లకి ఇది సాధ్యపడుతుంది కానీ ఎస్సై స్థాయివాళ్లకి ఇలా రాష్ట్రాలు మారిపోయే వెసులుబాటు త్రివిక్రమ్ గారే కల్పించారు సినిమాటిక్ లిబర్టీతో. 

అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇక్కడ కాస్త బలవంతంగానూ, అతిగానూ ఉంది. మలయాళం వర్షన్ లో నమ్మశక్యంగా ఉంటుంది. 

“లాలా భీమ్లా” పాట చిత్రీకరించిన తీరు బాగుంది. ఎమోషనల్ పీక్స్ ని సస్టైన్ చేయగలిగింది. 

మొదటి పాట మాత్రం జైల్లో ఖైదీలు, పోలీసులు కలిసి పాడడం పాత మూస పద్ధతిలో ఉంది. అందులో సునీల్ ఎందుకు కనిపించాడో అర్థం కాదు. ఎంత త్రివిక్రమ్ ఫ్రెండయినా సునీల్ లాంటి నటుడు మరీ ఇలా జూనియర్ ఆర్టిస్టు లాంటి పాత్రలు చేయడం బాధాకరం. 

టెక్నికల్ గా సినిమా పైస్థాయిలో ఉంది. అన్నిటికంటే మించి తమన్ మ్యూజిక్ సినిమాని పూర్తిగా నిలబెట్టేసింది. వాస్తవానికి ఫ్లో డౌనవడానికి, ల్యాగ్ ఉందని అనిపించడానికి చాన్సున్న సన్నివేశాలు కొన్నున్నాయి. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆ ఫీలింగ్ రాకుండా దాటేసిన పనితనానికి తమన్ ని మెచ్చుకుని తీరాలి. పవన్ కళ్యాణ్, రానాతో పాటు ఈ సినిమాలో కనిపించకుండా వినిపించే మూడో పెద్ద హీరో తమన్. 

కెమెరా, ఎడిటింగ్ విభాగాలు ఒరిజినల్ ని బెంచ్ మార్క్ గా తీసుకుని ఫాలో అయిపోయాయి.  

నటనపరంగా పవన్ కళ్యాణ్ అటు ఫ్యాన్స్ ని, ఇటు మెచ్యూర్ ఆడియన్స్ ని మెప్పించేలా చేసాడు. ఎక్కడా గ్రిప్ డౌనవ్వడం కానీ, అతి పోకడలు కానీ లేవు. తన మార్క్ చూపిస్తూనే ఒరిజినల్ కథకి లాయల్ గా కట్టుబడిన విధానం బాగుంది. 

రానా దగ్గుబాటి డేనియల్ శేఖర్ పాత్రలో కరెక్ట్ గా ఒదిగిపోయాడు. డబ్బు, పలుకుబడి ఉన్న పొగరు తన బాడీ లాంగ్వేజ్ లో చాలా నేచురల్ గా కనిపించింది. ఎంత డౌన్ సైజ్ చేసినా తన పాత్రతో ఉనికి చాటుకోగలిగాడు రానా. 

నిత్యా మీనన్ కూడా నటన పరంగా పర్ఫెక్టే అయినా అటవీ ప్రాంతంలో ఉన్న మహిళలా లేదు. ఆమె హెయిర్ స్టైల్ చూస్తే అటవీ ప్రాంతాల్లో కూడా బ్యూటీపార్లర్లు ఉంటాయేమో అనిపిస్తుంది. 

సంయుక్తా మీనన్ కి క్లైమాక్స్ లో పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ దక్కింది. 

సముద్రఖని మదమెక్కిన పొలిటీషియన్ పాత్రలో చక్కగా ఒదిగాడు. మురళీశర్మ కూడా పర్ఫెక్ట్ క్యాస్టింగ్. మొత్తంగా ఈ సినిమాలో నటీనటులందరూ పర్ఫెక్ట్ గా సెట్టయ్యారు. కానిస్టేబుల్ పాత్రలో కనిపించిన నటి కూడా గుర్తుండేలా ఉంది. 

సాగర్ చంద్ర తన ట్యాలెంట్ ని గతంలోనే ప్రూవ్ చేసుకున్న దర్శకుడు. అప్పట్లో ఒకడుండేవాడు, అయ్యారే లాంటి సినిమాలతో తన ఒరిజినాలిటీ, క్లారిటీ, కథనం మీద పట్టు నిరూపించుకున్నాడు. వచ్చిన ఈ పెద్ద అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. 

మొత్తంగా ఈ సినిమా పవన్ కళ్యాణ్ సినిమాల లిస్టులో మంచి సినిమాగా నిలబడుతుంది. 

ఓటీటీలో ప్రైవేట్ వ్యూవింగ్ లో అందరికీ నచ్చిన సినిమాని.. సరైన మార్పులతో వెండితెర మీద కూడా మాస్ ఆడియన్స్ మధ్యలో కూర్చుని ఎంజాయ్ చేయగలిగే చిత్రంగా మలచి మెప్పు పొందొచ్చనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ.  

బాటం లైన్: బాక్సాఫీస్ నాయక్