పదవులు ఇవ్వడంలో కేసీఆర్ ఎందుకింత స్లో?

సీఎం కేసీఆర్ కొన్ని విషయాల్లో బాగా స్పీడుగా ఉంటారు. కొన్ని విషయాల్లో బాగా స్లోగా ఉంటారు. అలా ఉండటానికి, ఇలా ఉండటానికి కూడా ఆయనకు రాజకీయ వ్యూహాలు ఉంటాయి. టీఆర్ఎస్ నాయకులకు కూడా ఆయన…

సీఎం కేసీఆర్ కొన్ని విషయాల్లో బాగా స్పీడుగా ఉంటారు. కొన్ని విషయాల్లో బాగా స్లోగా ఉంటారు. అలా ఉండటానికి, ఇలా ఉండటానికి కూడా ఆయనకు రాజకీయ వ్యూహాలు ఉంటాయి. టీఆర్ఎస్ నాయకులకు కూడా ఆయన వ్యూహాలు అంతుచిక్కవు. అంత గుంభనంగా మెయింటైన్ చేస్తారు. రెండు విషయాల్లో కేసీఆర్ వ్యూహాలు ఏమిటో అర్ధం కావడంలేదు అంటున్నారు టీఆర్ఎస్ నాయకులు. మంత్రివర్గ ప్రక్షాళన చేస్తానని ఆయన ఎప్పటినుంచో అంటున్నారు. దాని మీద టీఆర్ఎస్ నాయకులు కూడా ఆశలు పెట్టుకున్నారు.

వాళ్లకు పదవి వస్తుందని, వీళ్లకు పదవి వస్తుందని మీడియాలో కథనాలు వచ్చాయి. చాలాకాలంగా ఆ కబుర్లు ఆగిపోయాయి. పోనీ మొత్తం మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయకపోయినా చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఒకే ఒక్క మంత్రి పదవిని కూడా ఆయన భర్తీ చేయడంలేదు. ఇది చాలా ముఖ్యమైన మంత్రి పదవి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తొలగించడం, ఆయన బీజేపీలో చేరి ఉప ఎన్నికలో గెలవడం జరిగిపోయింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక గత ఏడాది నవంబరు చివర్లో జరిగింది.

ఆ బాధ్యతలు ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావుకు అప్పగించారుగానీ ఆ పదవి భర్తీ చేయలేదు. ఆ పదవి మీద కొందరు ఆశలు పెట్టుకొని ఉన్నారు. తెలంగాణలో వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ బిజీగా ఉన్నారు. మరి ఆ పదవి ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియదు. కేసీఆర్ మొదట ఇద్దరు సభ్యులతో మంత్రివర్గం ఏర్పాటు చేశారు. వాళ్లలో ఒకరు కేసీఆర్, మరొకరు హోమ్ మంత్రి మహమూద్ అలీ. రెండు నెలలపాటు మంత్రివర్గాన్ని విస్తరించలేదు.

ఆ తరువాత మరో పదిమందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అప్పటికీ ఆరు పోస్టులు ఖాళీగా ఉంచారు. ఆరు నెలల తరువాత ఆ పదవులు భర్తీ చేశారు. అంటే పూర్తి మంత్రివర్గం ఏర్పడటానికి చాలా సమయం తీసుకున్నారు. ఇలా ఆలస్యం చేసి నాయకుల్లో ఉత్కంఠ కలిగిస్తారు కేసీఆర్. ఈ ఖాళీ సమయంలో రాజకీయ లెక్కలు వేసుకుంటారేమో. ఉత్కంఠగా ఉన్న మరో విషయం రాజ్యసభ ఎన్నికలు. ఎన్నికలనే పేరేగానీ పోటీ అంటూ ఏమీ ఉండదు. అన్ని స్థానాలు గులాబీ పార్టీయే గెలుచుకుంటుంది. కానీ అభర్ధులు ఎవరో తెలియక నాయకులు జుట్లు పీక్కుంటున్నారు.

ఈ పదవుల కోసం కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్ రాజీనామా కారణంగా ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఆయన్ను ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీని చేశారు. డిసెంబర్ లో ఈ స్థానం ఖాళీ అయింది. వాస్తవానికి బండ ప్రకాష్ పదవీ కాలం 2024 ఏప్రిల్ వరకు ఉంది. ఏ రాజకీయ వ్యూహంతో ఆయన్ని రాజీనామా చేయించారో తెలియదు. మరో ఇద్దరి రాజ్యసభ సభ్యులైన డీఎస్, లక్ష్మీకాంతా రావు పదవీకాలం ఈ ఏడాది జూన్ లో ముగుస్తుంది. అంటే మొత్తం మూడు స్థానాలకు అభర్ధులను నిర్ణయించాలి.

ఈ స్థానాలకు ఎవరిని నిర్ణయిస్తారనేది ఎవరి అంచనాలకూ అందడంలేదు. ఒక స్థానంలో సినిమా నటుడు ప్రకాష్ రాజ్ ను నిలబెడతారనే ఊహాగానాలు సాగుతున్నాయి. కేసీఆర్ ఈమధ్య ముంబయిలో మాహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో, శరద్ పవార్ తో జరిపిన చర్చల్లో ప్రకాష్ రాజ్ పాల్గొన్న సంగతి తెలిసిందే కదా. ప్రకాష్ రాజ్ ను జాతీయ రాజకీయాల్లో తన తరపున ఉపయోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారట. 

ఇది కూడా ఊహాగానమే. ప్రకాష్ రాజ్ మాత్రం అలాంటిది ఏమీ లేదని కొట్టేశారు. రాజ్యసభకు ఎవరిని పంపుతారో. కేబినెట్ లో ఎవరిని నియమిస్తారో చూడాలి.