ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించడంలో తగ్గేదే లేదని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అంటున్నారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, వైసీపీ నేతల ఫిర్యాదు, పోలీసుల కేసులు, అనంతరం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం అయ్యన్నకు అలవాటయ్యాయి. న్యాయస్థానంలో పదేపదే ఊరట లభిస్తుండడంతో అయ్యన్న చెలరేగిపోతున్నారు.
సీఎంపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కోర్టులో ఉపశమనం లభించి… కనీసం 24 గంటలు కూడా గడవకనే అయ్యన్న మళ్లీ రెచ్చిపోయారు. ఈ దఫా ఆయన ట్విటర్ వేదికగా సీఎంపై ఘాటు విమర్శలు చేశారు.
‘అ.. ఆలు దిద్దించే అయ్యవార్లని బ్రాందీ షాపులకు కాపలా పెట్టిన ముఖ్యమంత్రి సారు… మండల పరిపాలన చూసే రెవెన్యూ సిబ్బందిని సినిమా హాళ్లకి గేటుమేన్లను చేశారు. ఒక్క చాన్స్‌తో తెచ్చుకుని దరిద్రాన్ని నెత్తికెత్తుకున్న పాపానికి ఈ ఖర్మ పట్టింది’ అంటూ అయ్యన్న ట్వీట్ చేశారు.
దరిద్రాన్ని నెత్తికెత్తుకున్న పాపానికి ఈ ఖర్మ పట్టిందంటూ అయ్యన్న తీవ్ర విమర్శలు చేయడాన్ని గమనించొచ్చు. అయ్యన్నకు సరైన రీతిలో కౌంటర్ ఇచ్చే మొనగాళ్లు వైసీపీలో కనిపించడం లేదు.