చంద్రబాబుని డైలామాలో పడేసిన జగన్… ?

చంద్రబాబు అంటేనే రాజకీయ వ్యూహానికి మారు పేరు. ఆయన అపర చాణక్య రాజకీయం తట్టుకోవడం ఎవరికైనా కష్టం. బాబు మధ్యాహ్న మార్తాండుడి మాదిరిగా ఉమ్మడి ఏపీలో ఒక వెలుగు వెలిగారు. ఆయన అటు ఏపీనే…

చంద్రబాబు అంటేనే రాజకీయ వ్యూహానికి మారు పేరు. ఆయన అపర చాణక్య రాజకీయం తట్టుకోవడం ఎవరికైనా కష్టం. బాబు మధ్యాహ్న మార్తాండుడి మాదిరిగా ఉమ్మడి ఏపీలో ఒక వెలుగు వెలిగారు. ఆయన అటు ఏపీనే కాదు, ఢిల్లీని కూడా తనదైన పాలిటిక్స్ తో ఒకే సమయాన ఆకట్టుకున్నారు. వాజ్ పేయ్ లాంటి దిగ్గజ నేతల ప్రేమాభిమానాలను చూరగొన్నారు.

అలాంటి చంద్రబాబు విభజన ఏపీలో మాత్రం ఎందుకో తడబడుతున్నారు. ఒక వైపు వయో భారం, మరో వైపు కుమారుడు లోకేష్ రాజకీయాల్లో వేలూ కాలూ పెట్టడంతో టీడీపీలో ఏకమాట లేదన్న మాట అంతటా ఉంది. ఈ నేపధ్యంలో బాబు గత కొన్నేళ్ళుగా తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ కూడా చూస్తే తొందరపాటుగానే ఉన్నాయని అంటున్నారు.

ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితం అసెంబ్లీని అన్న ఎన్టీఆర్ బాయ్ కాట్ చేసి బయటకు వెళ్ళారు. నాడు చంద్రబాబు ఇతర ఎమ్మెల్యేలే సభలో ప్రధాన పక్షంగా కీలకమైన పాత్ర పోషించి మెప్పించారు. ఒక విధంగా 1994లో టీడీపీ అధికారంలోకి రావడానికి సభలో బాబు అండ్ టీమ్ చేసిన యుద్ధం చాలా ముఖ్యమైనది.

ఆ విధంగా సభలో ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం ఎంతటితో బాబు ఆచరణలో అమలు చేసి చూపించారు. ఒక విధంగా ఎన్టీఆర్ తీసుకున్న బాయ్ కాట్ నిర్ణయం తప్పు అని  బాబు ఇండైరెక్ట్ గా చెప్పారు. ఇక జగన్ 2017 తరువాత సభకు నమస్కారం అంటే చంద్రబాబు సహా టీడీపీ నేతలు దెప్పి పొడిచారు. అసెంబ్లీని వదిలేసి రోడ్లను పట్టుకుని తిరగడానికా ప్రజలు ఎన్నుకున్నది అని కూడా ఆడిపోసుకున్నారు. సభ అంటే వైసీపీకి గౌరవం లేదని కూడా కామెంట్స్ చేశారు

మరి అన్నీ చూసిన బాబు తాను కూడా ఆవేశంలోనో, ఆవేదనతోనో ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. గత అసెంబ్లీ సమావేశాల వేళ ఇక సభకు రాను, మళ్ళీ వచ్చేది సీఎం గానే అంటూ బాబు పెద్ద నమస్కారం పెట్టేశారు. దాంతో మిగిలిన రోజులన్నీ వైసీపీయే సభకు నడిపించుకుంది.

సరే అవి వర్షాకాల సమావేశాలు కాబట్టి సరిపోయింది. ఈసారి అలా కాదు, బడ్జెట్ సమావేశాలు. దాదాపుగా పాతిక రోజుల పాటు జరుగుతాయి. ఇంకా చెప్పాలీ అంటే చాలా ముఖ్యమైన అంశాలు అన్నీ సభ ముందుకు వస్తాయి. కొత్త జిల్లాలతో పాటు, మూడు రాజధానుల బిల్లు కూడా సభలోకి వస్తుంది అంటున్నారు. మరో వైపు చూస్తే గత అయిదారు నెలలలో ఎన్నో  కీలకమైన పరిణామాలు జరిగాయి.

ఎన్నో ప్రజా సమస్యలు కూడా ముందుకు వస్తున్నాయి. సభలో ఇవన్నీ ప్రస్తావించడం ద్వారా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే చాన్స్ కచ్చితంగా విపక్ష తెలుగుదేశానికి ఉంది. అసెంబ్లీ ఎవరి సొత్తూ కాదు, అక్కడ జరిగే చర్చల మీద జనాలు ఆసక్తిగా చూస్తారు అందునా విపక్షం వైపు ఆశగా చూస్తారు.

అలాంటి సభకు టీడీపీ డుమ్మా కొట్టడం అంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా పడుతుంది అంటున్నారు. మరీ ముఖ్యంగా మూడు రాజధానుల బిల్లుని సభలోకి వైసీపీ తెస్తే అమరావతి రాజధాని సృష్టి కర్త చంద్రబాబు సభలో ఉండి నిలువరించాల్సిన పని చేయాల్సిందే. అలా కాకుంటే ఆయన మీద అమరావతి రైతులే గుస్సా అవుతారు.

ఇక ఏపీలో కొత్త జిల్లాలు అన్నది చారిత్రాత్మకమైన నిర్ణయం. ఇలాంటి డెసిషన్ తీసుకునే వేళలో టీడీపీ తన వంతు పాత్ర పోషించాలి. సలహాలు సూచనలు ఇవ్వాలి. రేపటి ఏపీకి కొత్త రూపూ షేపూ తెచ్చే పనిలో తన వాటా ఉందని జనాలకు చెప్పుకోగలగాలి. మరి అలాంటి బ్రహ్మాండమైన అవకాశాన్ని టీడీపీ వదులుకుంటే జనాలకు జవాబు చెప్పుకోనిదే అవుతుంది. మొత్తానికి బడ్జెట్ సమావేశాలలో టీడీపీ పాల్గొంటుందా లేదా అన్నది ఒక చర్చగా ఉంది.

పార్టీలో అయితే పాలుపంచుకోవాలనే అంటున్నారని టాక్. చంద్రబాబు సభకు రావాలనే మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గట్టిగా కోరుతున్నారుట. మరి తన శపధం సంగతేంటని బాబు కలవరపడినా ముందు సభకు వస్తేనే బెటర్ అని సూచిస్తున్నారుట. మొత్తానికి చంద్రబాబు ఇపుడు అతి పెద్ద డైలామాలో పడిపోయినట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి బాబు అటెండ్ అవుతారా లేదా అన్నది.