ఎన్నికల్లో ఒక్కో పార్టీ ఒక్కో నినాదంతో ముందుకు వెళుతుంటోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ బైబై బాబు అనే నినాదం పెద్ద ఎత్తున జనంలోకి వెళ్లింది. వైసీపీ నినాదం ప్రజల్ని అద్భుతంగా ఆకట్టుకుంది. అధికారాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. అధికారం శాశ్వతం కాదు. అలాగే ఎన్నికల నినాదాలు, విధానాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. సార్వత్రిక ఎన్నికలకు మరో పది నెలల గడువు మాత్రమే ఉంది.
ఈ నేపథ్యంలో ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు తమవైన సృజనాత్మక నినాదాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ విషయంలో ప్రతిపక్షాలకు కొంత అడ్వాంటేజ్ వుంటుంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ “సైకో పోవాలి -సైకిల్ రావాలి” అనే నినాదంతో జనంలోకి దూసుకెళుతోంది. కలిసొచ్చే పార్టీలుంటే ఓకే, లేదంటే తనకు తానుగా ప్రజాదరణను చూరగొనేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారం చేస్తోంది.
వైసీపీ మాత్రం మరోసారి సంక్షేమ పాలన సాగాలంటే తమనే గెలిపించాలని కోరుతోంది. బాబు వస్తే, సంక్షేమ పథకాలు పోతాయి అనే నినాదంతో వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది. ఇక మరో ప్రతిపక్ష పార్టీ జనసేన విషయానికి వస్తే… చాలా విచిత్రంగా వుంది. “వ్యూహం మీది – ఓటు మాది” అంటూ జనసేన కార్యకర్తలు తమ నాయకుడు పవన్‌తో అంటున్నట్టు తాజాగా ఓ నినాదాన్ని విస్తృతంగా ప్రచారంలో పెట్టడం గమనార్హం. టీడీపీతో పొత్తు వద్దే వద్దని జనసేన కార్యకర్తలు అంటున్నారనేది వాస్తవం. కానీ జనసేనాని పవన్‌కల్యాణ్ తన కేడర్ ఆకాంక్షలకు విరుద్ధంగా, తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలను వారిపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.
సీఎం జగన్‌పై తన అకారణ కక్షను కేడర్‌పై కూడా రుద్ధి రాజకీయాల్లో వాడుకోవాలనే ప్రయత్నాలకు పదును పెట్టారు. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశాలపై వ్యూహాన్ని తనకు వదిలేయాలని, ఓట్లు మాత్రం తాను చెప్పినట్టు వేయాలని ఆయన బ్రెయిన్ వాష్ చేసేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలో జనసేన కేడర్ తమ నాయకుడికి చెబుతున్నట్టుగా… వ్యూహం మీది -ఓటు మాది అనే నినాదాన్ని తెరపైకి తెచ్చారు.
ఈ నినాదంపై జనసేన కార్యకర్తలే విమర్శలు గుప్పిస్తున్నారు. “ఓటు మాది – వ్యాపారం మీది” అని సెటైర్స్ విసురుతున్నారు. జనసేనానికి వ్యూహం లేదని, ఉన్నదల్లా వ్యాపార దృష్టే అని ఆయన్ను అభిమానించే వాళ్లు సైతం అనుమానించే పరిస్థితి. చంద్రబాబును మళ్లీ సీఎం చేసి, ఆయనతో కలిసి వ్యాపారం చేసుకోవడమే పవన్ లక్ష్యమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే జనసేన కేడర్ సీఎం సీఎం అని నినదిస్తుంటే, పవన్ మాత్రం వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
టీడీపీ పల్లకీ మోయడానికి పవన్ సిద్ధమయ్యారని, ఈ మాత్రం దానికి వ్యూహం అని, ఎత్తుగడ అని సినిమాటిక్‌గా పేర్లు పెట్టడం అవసరమా? అంటూ దెప్పి పొడుస్తున్నారు. తాను సీఎం కావాలని కోరుకునే కొంత మంది సొంత సామాజిక వర్గ నాయకులు, కార్యకర్తలు, అలాగే సినిమా అభిమానుల ఆకాంక్షల్ని చంద్రబాబుకు బలిపెట్టడానికి సిద్ధమయ్యారని, ఇక వ్యూహమా? గాడిద గుడ్డా? అంటూ మండిపడుతున్నారు.