మాజీ మంత్రి వివేకా హత్యకు కడప టికెట్టే ప్రధాన కారణమనే చర్చ జరుగుతోంది. కడప టికెట్‌ను తనకు కాదని, షర్మిల లేదా విజయమ్మకు ఇచ్చేలా వివేకా ప్లాన్ చేస్తున్నారని, ఇదే అవినాశ్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల కోపానికి కారణమైందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇదే సందర్భంలో సీబీఐ కూడా అదే కోణంలో అనుమానాల్ని వ్యక్తి చేస్తూ, అవినాశ్‌రెడ్డి పేరును ప్రస్తావించింది.
సీబీఐ చార్జిషీట్‌లో అవినాశ్‌రెడ్డి పేరు చేర్చడాన్ని వైసీపీ పెద్దలు జీర్ణించుకోలేకున్నారు. సీబీఐ విచారణ తీరును, ఎల్లో మీడియాకు లీకులు ఇవ్వడాన్ని అధికార పార్టీ పెద్దలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. అయితే అవినాశ్‌రెడ్డికి 2019 ఎన్నికల్లో టికెట్ కేటాయింపుపై మాజీ మంత్రి వివేకా మనసులో మాటను వైఎస్ కుటుంబ సభ్యుడు సీబీఐతో పంచుకున్నారు. వైఎస్ వివేకా హత్యపై విచారణ జరుపుతున్న సీబీఐ పలువురిని విచారించింది.
ఇందులో భాగంగా కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి సొంత పెదనాన్న వైఎస్ ప్రతాప్‌రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం నేడు వెలుగులోకి వచ్చింది. 2021 ఆగస్టు 16న వైఎస్ ప్రతాప్‌రెడ్డి సీబీఐకి వాంగ్మూలం ఇవ్వగా, ఆరు నెలలకు ఆయనేం చెప్పారో సమాజానికి తెలిసొచ్చింది. కడప ఎంపీ టికెట్‌పై వివేకా మనసులో ఏమనుకున్నారో ప్రతాప్‌రెడ్డి మాటల్లో తెలుసుకుందాం.
‘ ఆ సమయంలో కడప ఎంపీ టికెట్ షర్మిలకు లేదా ఆమె తల్లి విజయమ్మకు ఇవ్వాలని అనుకున్నట్లు వైఎస్ వివేకా మాటలను బట్టి అర్థమైంది. వైఎస్ అవినాశ్‌రెడ్డి జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గానికి మంచి అభ్యర్థి అవుతారని ఆ రోజు వివేకా అభిప్రాయపడ్డారు. వైఎస్ భాస్కర్ రెడ్డి(అవినాశ్‌రెడ్డి తండ్రి) ఎప్పుడూ వివేకానంద రెడ్డికి వ్యతిరేకంగానే ఉండేవారు. భాస్కర్ రెడ్డి, అవినాశ్‌రెడ్డిల కంటే వివేకానందరెడ్డికే ప్రజల్లో మంచి పేరు ఉండేది’ అని ప్రతాప్ రెడ్డి వివరించారు.
వైఎస్ అవినాశ్‌రెడ్డికి టికెట్ లేకుండా, అతని రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని వివేకా మనసులో లేదని ప్రతాప్‌రెడ్డి వాంగ్మూలంతో స్పష్టమైంది. జమ్మలమడుగు నుంచి వైసీపీ తరపున గెలుపొందిన ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి ఫిరాయించడంతో పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. దీంతో అక్కడ డాక్టర్ సుధీర్‌రెడ్డిని నియమించారు. అయితే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిలను ఢీకొట్టాలంటే డాక్టర్ సుధీర్‌రెడ్డి తూగలేరనేది వైసీపీ భావనగా ఉండేది.
అందుకే అప్పట్లో జమ్మలమడుగు నుంచి అవినాశ్‌రెడ్డిని పోటీ చేయించాలని వివేకా ఆలోచించి వుండొచ్చు. ఇదే సందర్భంలో అన్న కోసం 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి , కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన షర్మిలకు కడప ఎంపీ టికెట్ ఇవ్వాలని వివేకా కోరి వుండొచ్చు. అంతే తప్ప, అవినాశ్‌రెడ్డిని పక్కన పెట్టాలనే చెడు ఆలోచన వివేకా మనసులో లేదని ప్రతాప్‌రెడ్డి వాంగ్మూలంతో స్పష్టమైంది.