త్వ‌ర‌లో ప‌వ‌న్ సినిమా తిరుప‌తిలో విడుద‌ల‌!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ వారాహి యాత్ర సినిమా స్టోరీని త‌ల‌పిస్తోంది. షూటింగ్ జ‌రుగుతోంది, సినిమా విడుద‌ల ఇదిగో ఇప్పుడు, అప్పుడంటూ వాయిదా వేస్తున్న వైనాన్ని ప‌వ‌న్ వారాహి యాత్ర త‌ల‌పిస్తోంది. ఈ నేప‌థ్యంలో త‌న వారాహి…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ వారాహి యాత్ర సినిమా స్టోరీని త‌ల‌పిస్తోంది. షూటింగ్ జ‌రుగుతోంది, సినిమా విడుద‌ల ఇదిగో ఇప్పుడు, అప్పుడంటూ వాయిదా వేస్తున్న వైనాన్ని ప‌వ‌న్ వారాహి యాత్ర త‌ల‌పిస్తోంది. ఈ నేప‌థ్యంలో త‌న వారాహి యాత్ర ఎప్పుడు వుంటుందో చెప్ప‌లేని స్థితిలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉంటే, జ‌న‌సేన నాయ‌కులు మాత్రం ఒక ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

తిరుప‌తి నుంచి త్వ‌ర‌లో వారాహి యాత్ర ప్రారంభం అవుతుంద‌ని అక్క‌డి జ‌న‌సేన నాయ‌కులు ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ ప్ర‌క‌టించ‌డం విశేషం. అయితే ఎప్పుడు ప్రారంభం అవుతుంద‌నేది మాత్రం సస్పెన్స్. మ‌రోవైపు వారాహి యాత్ర చేప‌ట్ట‌క‌పోవ‌డంపై ప్ర‌త్య‌ర్థులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. వారాహి వాహ‌న తాళాలు చంద్ర‌బాబు చేతిలో ఉన్నాయ‌ని, ఆయ‌న వాటిని ఇస్తే త‌ప్ప మొద‌లు పెట్ట‌లేని దుస్థితి నెల‌కుంద‌ని వైసీపీ నేత‌లు ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

వారాహి వాహ‌న డీజిల్ ఖ‌ర్చులు మాత్ర‌మే ఇస్తాన‌ని చంద్ర‌బాబు అన్నార‌ని, ప్యాకేజీ కుద‌ర‌క‌పోవ‌డంతో యాత్ర మొద‌లు పెట్ట‌లేద‌ని చుర‌క‌లు అంటిస్తున్నారు. వారాహిపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్స్ ప్ర‌త్యేకం. కాపు యువ‌కుడు క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బుతో వారాహి వ్యాన్‌ను కొనిచ్చిన‌ట్టు నాని చెప్పారు. 

గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో దుర్గ‌మ్మ గుడి వ‌ద్ద పూజ‌లు చేయించి ద‌స‌రా త‌ర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తాన‌ని ప‌వ‌న్ చెప్పాడ‌ని గుర్తు చేశారు. యాత్ర‌ను వాయిదాలు వేస్తూ పోతున్నాడ‌ని విమ‌ర్శించారు. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో ఎన్నిక‌లొస్తే జూన్ నుంచి తిరుగుతానంటూ ష‌ర‌తులు పెడుతున్నాడ‌ని దెప్పి పొడిచారు. రాజ‌కీయాల్లో ఇంత‌టి ప‌నోడు మ‌న‌కు ఎవ‌రూ దొర‌క‌రంటూ పేర్ని నాని మాట‌ల‌తో కుళ్ల పొడిచారు.

వారాహి యాత్ర‌పై ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌ల‌ను త‌ట్టుకోలేక క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కులు ఏవో తేదీలు చెబుతున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలోనే తిరుప‌తి జ‌న‌సేన నాయ‌కుల ప్ర‌క‌ట‌న‌ను చూడాలే త‌ప్ప‌, సీరియ‌స్‌గా తీసుకోకూడ‌ద‌ని అంటున్నారు. వారాహి సినిమా విడుద‌ల‌వుతుంద‌ని చెప్ప‌డ‌మే కానీ, ఎప్పుడ‌నేది మాత్రం జ‌న‌సేన నేత‌లు చ‌చ్చినా చెప్ప‌రు. ఇదిగో, అదిగో అని చెబుతుంటే, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు అమాయ‌కంగా వింటూ, ఆశ‌గా ఎదురు చూడ‌డం త‌ప్ప‌, మ‌రో మార్గం లేదు.