Advertisement

Advertisement


Home > Politics - Analysis

వారసులతో తయారు-బాబుకు తకరారు

వారసులతో తయారు-బాబుకు తకరారు

ఎన్నికలు వస్తే చాలు తమ్ముళ్లు అంతా పూర్తి ఉత్సాహంగా ముందుకు వస్తారు. విపక్షంలో నాలుగేళ్లుగా ఉన్నా ఎక్కడా కనిపించని ముఖాలు కూడా మీడియా ముందుకు వచ్చి హడావుడి చేస్తాయి. అంతా ఎన్నికల కోసం, టిక్కెట్‌ కోసమే. ఈ సంగతి వారికీ తెలుసు అధినాయకత్వానికి ఇంకా బాగా తెలుసు. అయినా సరే షరా మామూలుగాఎన్నో ఎన్నికల నుంచి సాగుతూ వస్తోంది ఈ వ్యవహారం. 

పార్టీ కష్టాలలో ఉన్నపుడు రోడ్డెక్కి పనిచేసిన వారికే టిక్కెట్లు అని చంద్రబాబు ఎప్పటికపుడు స్పష్టం చేసినా ఎన్నికల వేళకు అవేమీ అసలు కుదిరే పని కాదని అందరికీ తెలుసు. అందుకే విశాఖ జిల్లాలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వంటి వారు నాలుగవ ఏడాది నింపాదిగా బయటకు వచ్చి అంతా తానైనట్లుగా సందడి చేస్తున్నా ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి ఉంది. 

ఎన్నికలలో యువతకు టిక్కెట్లు, కొత్త ముఖాలు, పనిచేసే వారే కావాలి అన్నవి సూక్తి ముక్తావళి కబుర్లకే పరిమితం అవుతాయని పార్టీలో ఏళ్లకు ఏళ్లు ఉన్న వారి అనుభవం చెప్పిన మాటగా ఉందిట. అందుకే వారంతా కూడా తమకు మాత్రమే టిక్కెట్లు కావు. తమ వారసులకు కూడా అంటున్నారు. ఇది నిజంగా అతిగానే ఉన్నా అధినాయకత్వం ఇపుడు 2024 ఎన్నికలను చావో  రేవో అన్నట్లుగా తీసుకుంటోంది. దాంతో సీనియర్లను దూరం చేసుకోలేకపోతోంది. అలాగే అర్ధబలం అంగబలం ఉన్న వారిని సైతం పార్టీ వదులుకోలేకపోతోంది. వారి మాటను మన్నించేందుకు సిద్ధపడుతోంది. దీంతో సీనియర్‌ నాయకులు అంతా ఒకటి కాదు రెండు టిక్కెట్లు అని పట్టుబడుతున్నారు. 

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెడితే విశాఖ జిల్లా దాకా తెలుగుదేశం పార్టీలో  ఇదే రకమైన పరిస్థితి ఉంది అంటున్నారు. మంత్రులుగా పనిచేసిన వారు అనేక సార్లు ఎమ్మెల్యేలుగా ఉన్న వారు తమతో పాటు తమ ఇంటి వారికి మరో టిక్కెట్‌ అని అర్జీలు పెడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే తెలుగుదేశంలో కింజరాపు కుటుంబం కీలకంగా ఉంది. ఈ కుటుంబానికి 1996 నుంచి రెండు టిక్కెట్లు ఇస్తూ అధినాయకత్వం ప్రోత్సహిస్తోంది. దివంగత నేత ఎర్రంనాయుడు అంటే బాబుకు ప్రత్యేకమైన అభిమానం. దాంతో అది కాస్తా రెండు నుంచి మూడుగా 2019 ఎన్నికలలో  అయింది. 

బాబాయ్‌ అచ్చెన్నాయుడకు టెక్కలి, అబ్బాయి రామ్మోహన్‌కు శ్రీకాకుళం ఎంపీ, ఎర్రంనాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీకి రాజమండ్రి అసెంబ్లీ టిక్కెట్‌ ఇచ్చారు. వచ్చే ఎన్నికలలోనూ అదే తీరున ఇస్తారని తెలుస్తోంది. ఇక్కడ మరో సీనియర్‌ నేత 1983 నుంచి పార్టీని అట్టేపెట్టుకున్న కిమిడి కళా వెంకటరావు ఉన్నారు. ఆయన ఏపీ టీడీపీ అధ్యక్షునిగా కూడా చేశారు. ఆయనను ఈసారి విజయనగరం ఎంపీగా పోటీ చేయించాలని చంద్రబాబు చూస్తున్నారు. ఆయన తనతో పాటు తన కుమారుడు రామమల్లిక్‌ నాయుడుకు ఎచ్చెర్ల టిక్కెట్‌ కోరుతున్నారు. 

విజయనగరం జిల్లాకు వస్తే కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు ఉన్నారు. ఆయన ఈసారి విజయనగరం అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. ఆయన తన రాజకీయ వారసురాలు కుమార్తె అయిన అదితి గజపతిరాజును విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గానికి పోటీ చేయించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ విధంగా చంద్రబాబును ఆయన కోరుతున్నారని తెలుస్తోంది. 

బొబ్బలి రాజులు కూడా టీడీపీలో కీలకంగా ఉన్నారు. వారు మొదట కాంగ్రెస్‌లో ఉన్నారు. 2017 నాటికి టీడీపీ గూటికి చేరుకుని సుజయ కృష్ణ రంగారావు మంత్రి అయ్యారు. ఈసారి ఆయన విజయనగరం ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు. ఆయన తమ్ముడు బేబీ నాయన బొబ్బిలి నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉంటారని తెలుస్తోంది. 

విశాఖ జిల్లా విషయానికి వస్తే ఇక్కడ ఇద్దరు మాజీ మంత్రులు తమ కుమారుల కోసం టిక్కెట్లను  కోరుతున్నారు. సీనియర్‌ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్శీపట్నం నుంచి మరోమారు పోటీ చేయబోతున్నారు. ఆయన తన పెద్ద కుమారుడు చింతకాయల విజయ్‌ను అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అలా తాను అసెంబ్లీలోనూ తన కుమారుడు పార్లమెంట్‌లోనూ ఉండాలన్నది ఆయన కోరికగా ఉంది. ఇప్పటికే ఈ విషయాన్ని చంద్రబాబు చెవిలో వేశారని అంటున్నారు. 

విశాఖ అర్బన్‌ జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి పుత్రోత్సాహమే నిండుగా ఉంది.  ఆయన మరో దఫా పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా తాను పోటీ చేయాలనుకుంటున్నారు. తన కుమారుడు అప్పలనాయుడును మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని చూస్తున్నారు. అంటే ఒకేసారి తండ్రీ కొడుకులు అసెంబ్లీకి వెళ్లడానికి వీలుగా రెండు టిక్కెట్లను చంద్రబాబును కోరుతున్నారన్నమాట. 

ఇక ఇటీవలే పార్టీలో చురుకుగా  వ్యవహరిస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా వీలుంటే తన కుమారుడు గంటా జయదేవ్‌కు తనతో పాటుగా మరో ఎమ్మెల్యే టిక్కెట్‌ కోరబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇలా సీనియర్లు అంతా రెండేసి టిక్కెట్లు కోరుతూంటే అధినాయకత్వం కిందా మీద అవుతోంది అంటున్నారు. 

యువతకు టిక్కెట్లు ఇవ్వాలని పార్టీ భావిస్తూంటే ఆ యువత వారసుల రూపంలో ఇంట్లోనే ఉన్నారని సీనియర్లు ముందుకు తేవడంతో ఏమీ చేయాలో అర్ధం కావడంలేదు అని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో చూసుకుంటే చాలామంది సీనియర్లు మళ్లీ పోటీకి సిద్ధపడుతున్నారు. 

ఇందులో చంద్రబాబు కొందరినీ తానే పోటీ చేయమని కోరుతున్నారు, మరికొందరిని మొహమాటంతో ఒప్పుకుంటున్నారు. అయితే వారు తమతో పాటు తమ బిడ్డలు కూడా అని టిక్కెట్లను కోరుతూంటేనే చిక్కులూ చికాకులు వస్తున్నాయని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో ముప్పయి నాలుగు అసెంబ్లీ అయిదు ఎంపీ సీట్లు ఉన్నాయి. 

ఇందులోనే సగానికి పైగా ఇలా ఇచ్చేసుకుంటూ పోతే అసలైన కార్యకర్తలకు న్యాయం చేయడం ఎలా అన్నది పార్టీకి పెద్ద సమస్యగా ఉంది అంటున్నారు. చూడాలి మరి ఈ రెండు టిక్కెట్ల వ్యవహారం బాబు ఎలా పరిష్కరిస్తారో.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?