కర్ణాటకలో ‘మనోడు’..భజన మొదలు

కర్ణాటక ఎన్నికలు ముగిసాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది. తెలుగునాట తెలుగుదేశం మద్దతు దారులు సోషల్ మీడియాలో సంబరాలు చేసేసుకున్నారు. తమ నాయకుడిని ముప్పు తిప్పలు పెట్టిన పార్టీ, తమ అభిమాన నాయకుడు వెంకయ్యను పక్కన…

కర్ణాటక ఎన్నికలు ముగిసాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది. తెలుగునాట తెలుగుదేశం మద్దతు దారులు సోషల్ మీడియాలో సంబరాలు చేసేసుకున్నారు. తమ నాయకుడిని ముప్పు తిప్పలు పెట్టిన పార్టీ, తమ అభిమాన నాయకుడు వెంకయ్యను పక్కన పెట్టేసిన పార్టీకి తగిన శాస్త్రి జరిగిందని తృప్తి పడ్డారు. అంతలోనే వారందరికీ మరో విషయం అందుబాటులోకి వచ్చింది. మరోసారి సంబర పడడానికి. కాంగ్రెస్ విజయం అంతా తన ఖాతాలోనే వేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తి వైనం ఈ సంబరానికి మూలం.

కర్ణాటకలో కాంగ్రెస్ విజయం వెనుక అసలు సిసలు సూత్రధారి ఈయనే అంటూ మీడియా మొత్తం అర్జంట్ గా కనుగోలు సునీల్ అనే పేరును తెగ ప్రాచుర్యం లోకి తీసుకు వచ్చాయి. హడావుడి చేస్తున్నాయి. బెంగుళూరుకు చెందిన ఈ సునీల్ కనుగోలు మూలాలు తెలుగునాట వున్నాయని చాలా మందికి తెలుసు. పైగా తెలుగుదేశం మద్దతు సామాజిక వర్గంలో వున్నాయని కొంతమంది కి తెలుసు. 

కర్ణాటకలో కాంగ్రెస్ గెలవగానే ‘పెయిడ్ ఆర్టికల్స్’ జాతీయ మీడియాలో మొదలయ్యాయి. అదే తరహా ఆర్టికల్స్ తెలుగు మీడియాలో ప్రత్యక్షం కావడం మొదలైంది. గమ్మత్తేమిటంటే నిజంగా కర్ణాటకలో సునీల్ కనుగోలు కు అంత సీన్ వుందా? లేదా? అన్నది ఆలోచించకుండానే నేషనల్ మీడియా స్టోరీలను మక్కి మక్కీ దించేయడం మొదలైపోయింది.

ఇలా మొదలు కావడం వెనుక కర్ణాటక కాంగ్రెస్ విజయం వెనుక ‘మనోడు’ వున్నాడని చెప్పాలనే తాపత్రయం తప్ప మరేమీ కాదు. రాసిన మీడియాలను వదిలేస్తే, రాయని మీడియాలకు రాయబారాలు మొదలయ్యాయి. ఓ వార్త రాయాలనే సిఫార్సులు ఆరంభమయ్యాయి.

అసలు సునీల్ కనుగోలు కు అంత విషయం వుండి వుంటే ముందుగా చంద్రబాబు దూరం చేసుకోరు అన్నది ఒక పాయింట్. ఇదే కనుగోలు తెలంగాణలో కొంత కాలం వర్క్ చేసి, కేసిఆర్ ను తట్టుకోలేక కర్ణాటకు జంప్ అయ్యారని మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఏమైతేనేం మనవాడు అని రాయకుండానే మనవాడి గురించి మరింత మంచిగా రాసే అవకాశం దొరికింది.వాడేసుకున్నారు.

ఇప్పుడు ఇది చూసి కర్ణాటకలో మనవాడిదే చక్రం తిప్పే పొజిషన్, అందువల్ల కాస్త కాంట్రాక్టులు గట్రా తెచ్చుకోవచ్చు అంటే మళ్లీ భ్రమే. ఎందుకంటే కర్ణాటక కాంగ్రెస్ లో, కర్ణాటకలో అరివీర ముదుర్లు ఇప్పటికే వున్నారు. సునీల్ కనుగోలు ఆర్టికల్స్ వరకు హడావుడి తప్ప, అక్కడ అంత సీన్ లేదు అన్నది కర్ణాటక కాంగ్రెస్ వర్గాల సమాచారం. అయినా అది మనకు అనవసరం. అసలు నిజం డ్రెస్ చేసుకుని బయటకు వచ్చేలోగా పెయిడ్ స్టోరీస్ ప్రపంచం అంతా చుట్టేస్తాయి అన్నది కామన్ కదా?