వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అనే విషయమై టీడీపీ ఎలాంటి నిర్ణయానికి రాలేక పోయింది. అసెంబ్లీ సమావేశాల సమాచారం వచ్చిన నేపథ్యంలో, చంద్రబాబు లేకుండా వెళ్లడంపై ఆసక్తికర చర్చ జరిగింది.
నిండు అసెంబ్లీ సభలో తన భార్య నారా భువనేశ్వరికి పరాభవం జరిగిందని, దాన్ని నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర అత్యున్నత చట్టసభ సమావేశాలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని ఆయన ప్రతిజ్ఞ చేయడం సంచలనం సృష్టించింది.
గతంలో ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినప్పుడు … ఇదే చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్ని రకాలుగా తిట్టారో అందరికీ తెలుసు. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ మాట్లాడేందుకు నిరాకరించడాన్ని నిరసిస్తూ వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి, ప్రజాక్షేత్రంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అదే మహాపాదయాత్రకు కారణమైంది.
ఇప్పుడు చంద్రబాబు మాత్రమే అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించారు. అందులోనూ వ్యక్తిగత కారణంతో. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు అభిప్రాయాల్ని సేకరించారు.
ప్రజాసమస్యలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సమావేశాలకు వెళ్లి నిలదీయాలని మెజార్టీ సభ్యుల అభిప్రాయం. కానీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వరని, అలాంటప్పుడు వెళ్లినా ప్రేక్షక పాత్ర పోషించాల్సి వుంటుందని మరికొందరు అభిప్రాయపడ్డట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో టీడీపీ శాసనసభా పక్ష సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. కానీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేందుకే టీడీపీ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. సమావేశాల్లో భాగంగా పరిస్థితులను బట్టి బహిష్కరించడమో, అక్కడే నిరసన తెలియజేయడమో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.