జనసేనాని పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ సినిమా ఎట్టకేలకు విడుదలకు నోచుకుంది. రాజకీయ కారణాలతో భీమ్లానాయక్ వివాదానికి కేంద్ర బిందువైంది. తనకు రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్‌పై కక్షతోనే ఏపీ ప్రభుత్వం సినిమా నిబంధనలను ముందుకు తీసుకొచ్చిందనే విమర్శలు లేకపోలేదు.
ఇందులో భాగంగా అధిక ధరలకు టికెట్లు విక్రయించకూడదని, అలాగే బెనిఫిట్ షోను ప్రదర్శించకూడదని ఏపీ ప్రభుత్వం కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. అదేంటోగానీ, ఈ నిబంధనలు అధికార పార్టీ నేతకు సంబంధించి థియేటర్‌కు మాత్రం నిబంధనలు వర్తించలేదు.
యథేచ్ఛగా ఒక్కో టికెట్‌ను రూ.300కు విక్రయిస్తున్నారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో చోటు చేసుకుంది. ఆళ్లగడ్డలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి థియేటర్‌లో సినిమా విడుదలకు ఒక రోజు ముందుగానే అధిక ధరలతో టికెట్లను విక్రయించడం స్టార్ట్ చేశారు. అధికార పార్టీ నేత థియేటర్‌లో మాత్రం ప్రేక్షకుల్ని దోపిడీ చేసుకోవచ్చా అంటూ పవన్ అభిమానులు ప్రశ్నిస్తుండడం గమనార్హం.
ఇదిలా వుండగా భీమ్లానాయక్ సినిమా విడుదలను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని థియేటర్ల యజమానులకు రెవెన్యూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డలో అధికార పార్టీ నేత థియేటర్ దోపిడీపై రెవెన్యూ అధికారులకు కొందరు ఫిర్యాదు చేయగా, వస్తాం, చూస్తాం, చేద్దాం అని కాలయాపన చేస్తున్నట్టు సమాచారం.