ది కేరళ స్టోరీ సినిమా డైరెక్టర్ సుధీప్తో సేన్, హీరోయిన్ ఆదా శర్మ యాక్సిడెంట్‌కు గురయ్యారు. ముంబయిలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తుండగా వీరు ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు సుదీప్తో సేన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
‘ఈరోజు నేను కరీంనగర్ వెళ్లి సభలో ది కేరళ స్టోరీ చిత్రం గురించి మాట్లాడాల్సి ఉందని.. కానీ అనారోగ్య కారణాల వల్ల.. అంతదూరం ప్రయాణం చేయలేకుండా ఉన్నాను.. కరీంనగర్ వాసులకు మా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేసుకుంటున్నాము’’ అంటూ సుదీప్తో సేన్ ట్వీట్ చేశారు. కాగా ఇవాళ కరీంనగర్ లో జరుగుతున్న హిందూ ఏక్తాయాత్రకు ఆదాశర్మ, సుదీప్తో సేన్ హాజరు కావాల్సి ఉంది.
కాగా దేశవ్యాప్తంగా వివాదాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది ది కేరళ స్టోరీ. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. కేరళలో కొన్నేళ్లుగా 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో ఈ సినిమాను రూపొందించారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఈ సినిమాను బ్యాన్ చేసినప్పటికీ మిగతా చోట్ల మంచి రెస్పాన్స్ వస్తుంది.