వచ్చే ఏడాది జరగనున్న ఏపీ అసెంబ్లీ- లోక్ సభ సార్వత్రిక ఎన్నికల విషయంలో పార్టీల వ్యూహాలపై స్పష్టత రానే వస్తోంది. తెలుగుదేశం పార్టీతో తమ పొత్తు తప్పనిసరి అన్నట్టుగా పవన్ కల్యాణ్ కుండబద్ధలు కొడుతున్నాడు. తన పార్టీ సొంతంగా పోటీ చేసే అవకాశమే లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేస్తున్నాడు. ఇప్పటి వరకూ తనేదో సొంతంగా పోరాడినట్టుగా పవన్ చెప్పుకుంటూ ఉన్నాడు. అయితే ఈయన 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలతో కలిసి తిరిగాడు. 2019లో కమ్యూనిస్టులను, మాయవతి పార్టీని కలుపుకునే వెళ్లాడు.
ఇదంతా చంద్రబాబు వ్యూహం మేరకే జరిగిందనేది కూడా అందరికీ తెలిసిందే. ఇలా పూర్తిగా చంద్రబాబు కు చంచాగిరి చేస్తున్నట్టుగా పవన్ కల్యాణ్ రాజకీయ గమనం సాగుతూ ఉంది. మరి ఇలాంటి పవన్ కల్యాణ్ ఇప్పుడు చంద్రబాబుతో డైరెక్టు పొత్తుతో రావడం పెద్ద విచిత్రం కాదు. ఇన్నాళ్లూ చంద్రబాబు ఇబ్బందుల్లో ఉన్నప్పుడల్లా ఇన్ డైరెక్టు గా ఆయన రెస్క్యూ కోసం పవన్ కల్యాణ్ వచ్చాడు. ఇప్పుడు డైరెక్టుగా చంద్రబాబుతో వస్తున్నాడంతే తేడా!
మరి ఏపీలో తెలుగుదేశం- జనసేనలు కలిసి పోటీ చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందనేది ఒక ఆసక్తిదాయకమైన రాజకీయ విశ్లేషణ. ఈ రెండు పార్టీలూ వచ్చే ఎన్నికల్లో సీట్లను పంచుకుని బరిలోకి తొలి సారి దిగొచ్చు. అయితే 2014లోనే పవన్ కల్యాణ్ తెలుగుదేశానికి మద్దతు పలికాడు, 2019లో చంద్రబాబు వ్యతిరేక ఓటును చీల్చేందుకు పని చేశాడు. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చనివ్వను అంటున్నాడు. మరి ఎంత చీలనివ్వకపోయినా.. రాష్ట్రంలోని దాదాపు మూడో వంతు సీట్లలో టీడీపీ, జనసేనల పొత్తు ప్రభావం శూన్యం అని చెప్పక తప్పదు! ఇది స్వయంగా పవన్ కల్యాణ్ కూడా ఒప్పుకుంటున్నదే.
రాయలసీమలో తమకు బలం లేదని పవన్ కల్యాణ్ తనే ప్రకటించాడు. మరి రాయలసీమ అంటే ఒక జిల్లానో, పదో పన్నెండు సీట్లో కాదు. ఏకంగా 52 అసెంబ్లీ సీట్ల పరిధిలో తమకు బలం లేదని పవన్ కల్యాణ్ ప్రకటించుకున్నాడు. మరి జనసేన అధినేతే తమకు బలం లేదని ప్రకటించుకున్న చోట జనసేనతో పొత్తు టీడీపీకి కొత్తగా ఉపయోగపడేదేమీ లేదని వేరే చెప్పనక్కర్లేదు.
పూర్వ జిల్లాల లెక్కన చూసుకుంటే రాయలసీమ నాలుగు జిల్లాల్లో అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల పరిధిలో 52 అసెంబ్లీ సీట్లున్నాయి. అనంతపురం పరిధిలో 14, కడపలో పది, చిత్తూరులో 14, కర్నూలులో 14 సీట్లున్నాయి. వీటన్నింటిలో కలిపి గత ఎన్నికల్లో టీడీపీ మూడంటే మూడు సీట్లను నెగ్గింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే రాయలసీమ నుంచి ఆ పార్టీకి చాలా మద్దతే అవసరం ఉంటుంది. ప్రత్యేకించి పూర్వ అనంతపురం జిల్లా పరిధిలో అయినా, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో అయినా ఆ పార్టీ ఉనికిని చాటుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ ఉనికిని చాటుకోవడానికి ఇప్పుడు జనసేన మద్దతు ఏ రకంగానూ ఉపయోగపడకపోవడం గమనార్హం!
జనసేనతో పొత్తు సీమలో మైనస్సే!
తెలుగుదేశం పార్టీకి రాయలసీమ వరకూ చూసినా.. ఇంకా రాయలసీమ తరహా సామాజిక పరిస్థితులున్న ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సగ భాగాల వరకూ అయినా.. జనసేనతో పొత్తు వల్ల కొత్తగా దక్కేదేమీ లేదు. సగం నెల్లూరు, సగం ప్రకాశం జిల్లాల్లో రాయలసీమ తరహా సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఉంటాయి. ఇలా చూస్తే దాదాపు 65 సీట్లలో తెలుగుదేశం, జనసేన ల పొత్తు ప్రభావం శూన్యం. ఇందుకు చాలా కారణాలున్నాయి!
బలిజలు టీడీపీతోనే!
రాయలసీమ జిల్లాల వరకూ చూసినా, నెల్లూరు- ప్రకాశం జిల్లాలను కలుపుకున్నా.. ఇక్కడ బలిజలు మొదటి నుంచి టీడీపీ పట్ల సానుకూలంగా ఉన్నారు. బీసీలతో పాటు బలిజలు అనే రాజకీయ పరిస్థితే ఇక్కడ దశాబ్దాలుగా ఉంది. బీసీలు-బలిజల ఓట్లను గంపగుత్తగా టీడీపీ పొందుతూ వచ్చింది. అయితే 2009 నుంచి బీసీల ఓటు బ్యాంకు రూటు మారింది. తెలుగుదేశం పార్టీకి గంపగుత్తగా పడే పరిస్థితి అప్పటి నుంచి క్రమంగా తగ్గుతూనే వస్తోంది. 2014 ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టీడీపీ 12 అసెంబ్లీ సీట్లు సాధించింది. అది బీసీల ఓట్ల ద్వారా కాదు. కేవలం రైతు రుణమాఫీ అనే హామీ ప్రభావం అది. అయితే ఆ రుణమాపీ మామీకి కూడా చంద్రబాబు తూట్లు పొడిచారు. దీంతో టీడీపీని మళ్లీ రైతులు కూడా నమ్మే పరిస్థితి లేకపోకుండా పోయింది. దానికి తోడు.. బీసీ ఓటు బ్యాంకు టీడీపీకి చాలా వరకూ తగ్గిపోయింది. ఫలితంగానే.. కంచుకోటలన్నీ బద్ధలయ్యాయి.
రాప్తాడు, పెనుకొండ వంటి బీసీల జనాభా 80 శాతం ఉన్న నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఓడిపోవడమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై- నలభై వేల స్థాయి మెజారిటీని ఇచ్చుకుంది. బీసీల ఓటు బ్యాంకును జగన్ గతంలో కన్నా ఇప్పుడు మరింతగా ఆకర్షించుకుంటున్నాడు. రాయలసీమలో రెడ్ల ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడే శాతం కన్నా.. ఈ సారి బీసీల ఓట్లు ఆ పార్టీకి ఎక్కువ శాతం పడతాయేమో అనే లా ఉంది పరిస్థితి. అదే జరిగితే.. గత ఎన్నికల నాటికి మించి మెజారిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతాయి.
బీసీలు 2009 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి వైపు, ఆ తర్వాత వైఎస్ జగన్ వైపు సాగుతున్నా.. బలిజలు మాత్రం తెలుగుదేశం పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా కొనసాగుతూ ఉన్నారు. ఇందులో ఇంకో వాదనేమీ లేదు. అయితే.. బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు వెళ్లిపోయితన తరుణంలో కేవలం బలిజల ఓట్లతో టీడీపీ నెగ్గుకు రాలేకపోతోంది. బలిజల ఓట్లను టీడీపీ పొందడానికి పవన్ కల్యాణ్ సపోర్ట్ అవసరం లేదు. హిందూపురం నుంచి తిరుపతి వరకూ కూడా బలిజలు సాలిడ్ గా తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు. ఇప్పుడు పవన్ కల్యాణ్ వెళ్లి జై టీడీపీ అని నినదించినా కొత్తగా పడే ఓట్లు ఏమీ లేవు. ఇదే సమయంలో బలిజల ఓట్లు ఉన్నాయంటూ రాయలసీమలో జనసేనకు టీడీపీ రెండు మూడు సీట్లను ఇచ్చినా.. అది అవనసరమైన నష్టమే తప్ప లాభం లేని వ్యూహమే!
తిరుపతి, అనంతపురం అర్బన్, రాజంపేట వంటి అసెంబ్లీ సీట్లను టీడీపీ నుంచి జనసేన ఆశించవచ్చు. ఒకవేళ జనసేన మద్దతు లేకపోయినా.. తిరుపతి, అనంతపురం అర్బన్ లలో టీడీపీ గట్టిగా పోరాడనూగలదు. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి పోటాపోటీ సీట్లను జనసేనకు ఇస్తే టీడీపీ తమ అవకాశాలను తామే దెబ్బతీసుకున్నట్టుగా అవుతుంది. ఇలా సీమ వరకూ జనసేన అనేది టీడీపీకి ఎక్స్ ట్రా బ్యాగేజే తప్ప కొత్తగా కలిసి వచ్చే ఓట్లు ఏమీ ఉండవు.
గత ఎన్నికల్లో జనసేనకు పడిన ఓట్లను చూపి.. ఈ సారి ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి బదిలీ అవుతాయని కొందరు వాధించవచ్చు. అయితే అప్పుడు జనసేన పొందిన ఓట్లలో టీడీపీకి పడాల్సినవి చాలా తక్కువ! టీడీపీ కి ఓటేసే బలిజలు కూడా అప్పుడు జనసేనను ఖాతరు చేయలేదు. బలిజలే పవన్ కల్యాణ్ ను అప్పుడు పరిహాసం ఆడారు. ఇప్పుడు కూడా పవన్ కల్యాణ్ చెప్పాడని కాదు, వారు స్వయంగా టీడీపీకి ఓటేయాలనుకునే టైపు.
జనసేన సీమలో అప్పుడు పొందిన ఓట్లు యాంటీ టీడీపీ. ఇప్పుడు పవన్ కల్యాణ్ వెళ్లి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ ఓట్లు రెండు పార్టీలకూ దూరం అవుతాయి. అభిమానుల రూపంలో అప్పుడు పవన్ కల్యాణ్ కు ఓటేసిన వారు కూడా చంద్రబాబు తో పవన్ పొత్తు వల్ల దూరం అయ్యే పరిస్థితి ఉంది. రాయలసీమ వరకూ అయితే ఇదే జరగనుంది. అయినా అప్పుడు జనసేన పొందిన ఓట్లన్నీ ఇప్పుడు టీడీపీకి వంద శాతం బదిలీ అయినా.. సీమలోని ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా టీడీపీకి ఎక్కువ ఓట్లు రావు.
టీడీపీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజారిటీ నుంచి జనసేన పొందిన ఓట్లను మైనస్ చేసినా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీలు ప్రతి చోటా ఇరవై ముప్పై వేల పైనే ఉంటాయి! అదీ సీమలో జనసేన ప్రభావానికి తార్కాణం.
కేవలం టీడీపీ, జనసేనలే కాదు.. ఈ కూటమిలోకి బీజేపీ కూడా చేరినా.. ఆ పార్టీ కూడా ఐదారు నియోజకవర్గాల్లో తన పోటీకి సీట్లు డిమాండ్ చేయడమే తప్ప, కూడి వచ్చే బలం మాత్రం శూన్యం. ఏతావాతా.. సీమలోని 52 నియోజకవర్గాలు, నెల్లూరు- ప్రకాశం జిల్లాల్లో సగం నియోజకవర్గాలు.. అంటే సుమారు 65 సీట్లలో ఈ పొత్తు పొడుచుకున్నా ఓట్ల బదిలీలు, పొత్తు ప్రభావాల గురించి తలలు బద్ధలు కొట్టుకునేదేమీ ఉండదు!