గోవిందా గోవిందా.. శ్రీవారి భక్తుల ఇక్కట్లు తొలిగేదెట్లా?

కరోనా లాక్ డౌన్ తర్వాత తిరుమలలో శ్రీవారి దర్శనాలు యథావిధిగా మొదలైనా.. ఇప్పటికీ పూర్తి స్థాయిలో దేవదేవుడు భక్తుల మొర ఆలకించినట్టు కనిపించడం లేదు. దర్శనానికి వెళ్లిన భక్తులు రెండు రోజుల పాటు తిరుపతిలోనే…

కరోనా లాక్ డౌన్ తర్వాత తిరుమలలో శ్రీవారి దర్శనాలు యథావిధిగా మొదలైనా.. ఇప్పటికీ పూర్తి స్థాయిలో దేవదేవుడు భక్తుల మొర ఆలకించినట్టు కనిపించడం లేదు. దర్శనానికి వెళ్లిన భక్తులు రెండు రోజుల పాటు తిరుపతిలోనే వేచి చూడాల్సిన పరిస్థితి. 

వారాంతాల్లో భక్తుల బాధ వర్ణనాతీతం. తెలిసీ తెలియక నేరుగా కుటుంబంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కొండ కిందే రెండు రోజులు మకాం పెట్టాలంటే ఎంత కష్టమో ఊహించలేం.

దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు టోకెన్ తీసుకుని తిరిగి ఇంటికి వెళ్లలేరు, అలాగని, రెండు రోజుల పాటు తిరుమల ప్రాంతంలో ఉండనూ లేరు. అటు తిరుమల క్షేత్రాల దర్శనాలకు కూడా పూర్తి స్థాయిలో అనుమతి ఇవ్వకపోవడంతో భక్తులకు ఏం చేయాలో, ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడంలేదు. దర్శనాల విషయంలో అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడంలో విఫలం అయ్యారనే విమర్శ ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా మిగతా అన్ని చోట్ల సాధారణ జన జీవనం మొదలైనా.. తిరుమల దర్శనాల విషయంలో అధికారులు నిబంధనలకు పెద్ద పీట వేయడం వల్లే ఇలాంటి చిక్కు వచ్చి పడింది. భౌతిక దూరంతో పాటు, కొవిడ్ నిబంధనలు అన్నీ సక్రమంగా పాటించడం వల్లే దర్శనాల విషయంలో ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది.

నిబంధనలు పాటిస్తున్నారు సరే, దానిపై ప్రచారం మాత్రం సరిగా లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఒక్కరోజులోనే 80వేల మంది శ్రీవారిని దర్శించుకున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రోజువారీ దర్శనాల సంఖ్య 30వేలకు మించట్లేదు.

మరోవైపు భక్తులు మాత్రం తిరుమలలో సాధారణ పరిస్థితులు ఉన్నాయనే అపోహతో పెట్టే-బేడా సర్దుకుని కొండకు తరలివస్తున్నారు. అక్కడ ఉన్న పరిస్థితులు చూసి అవాక్కవుతున్నారు. 

రెండు రోజుల తర్వాత దర్శనం టోకెన్ ఇస్తే.. అప్పటి వరకూ ఏం చేయాలో పాలుపోక అక్కడే ఉండిపోతున్నారు. ఇప్పటికైనా దర్శనాల విషయంలో టీటీడీ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తే బాగుంటుందని యాత్రికులు కోరుతున్నారు. 

కృష్ణ..కృష్ణ..అమరావతిపై సరైన ప్రశ్న