ప్ర‌చారానికి వెళ్లకుండా సేఫ్ అయిన ప‌వ‌న్!

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారానికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆహ్వానిస్తున్న‌ట్టుగా దాదాపు నెల కింద‌ట వార్త‌లు వ‌చ్చాయి. ఉన్న‌ట్టుండి అప్పుడు ప‌వ‌న్ ఢిల్లీలో అగుపించారు. బీజేపీ ఏపీ వ్య‌వహారాల…

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారానికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆహ్వానిస్తున్న‌ట్టుగా దాదాపు నెల కింద‌ట వార్త‌లు వ‌చ్చాయి. ఉన్న‌ట్టుండి అప్పుడు ప‌వ‌న్ ఢిల్లీలో అగుపించారు. బీజేపీ ఏపీ వ్య‌వహారాల ఇన్ చార్జి ఇంటికి ప‌వ‌న్ వెళ్లారు. వారి ఇంట్లో కుటుంబ స‌భ్యులు ప‌వ‌న్ తో ఫొటోలు దిగి పంపించారు. 

ఆ సంద‌ర్భంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ బీజేపీ నేత‌కు ఒక విన్న‌పం చేశార‌ని, అది చంద్ర‌బాబుతో పొత్తు గురించి సిఫార్సు అని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ అంశంలో స‌మాధానాన్ని దాటేసిన బీజేపీ ఇన్ చార్జి.. క‌ర్ణాట‌క‌లో బీజేపీ త‌ర‌ఫున ప్ర‌చారానికి వెళ్లాల్సిందిగా కోరినట్టుగా మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.

స‌రిగ్గా క‌ర్ణాటక ఎన్నిక‌ల వేడి ప‌తాక స్థాయికి చేరుతున్న వేళ ప‌వ‌న్ క‌ల్యాణ్ వెళ్లి బీజేపీ వాళ్ల‌తో స‌మావేశం కావ‌డంతో.. ఆయ‌న‌ను బీజేపీ క‌న్న‌డ ఎన్నిక‌ల ప్ర‌చారానికి వాడుకోవ‌చ్చ‌నేది మీడియా ఊహాగానం కూడా కావొచ్చు. మరి పవ‌న్ ను బీజేపీ ప్ర‌చారానికి అడిగి ఉన్నా లేక‌పోయినా.. ప‌వ‌న్ అత్యుత్సాహంతో అయినా క‌న్న‌డ ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్ల‌కుండా సేఫ్ అయ్యాడు!

ప్ర‌త్యేకించి తెలుగు బెల్ట్ లో బీజేపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. చిక్ బళాపూర్, దొడ్ బ‌ళాపూర్, బాగేప‌ల్లి, హోసకొటే, కోలారు, బ‌ళ్లారి, దేవ‌న‌హ‌ళ్లి… ఇలా ఈ ప్రాంత‌మంతా బీజేపీ అభ్య‌ర్థులు చిత్త‌య్యారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్లి ఉండినా.. ఈ ప్రాంతంలోనే ప్ర‌చారం జ‌రిగి ఉండేది. 

అయితే ప‌వ‌న్ ప్ర‌చారం ర‌క్షినంత స్థాయిలో ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ అభ్య‌ర్థులు వెనుక‌బ‌డ్డారు. క‌నీసం జేడీఎస్ అయినా ఈ ప్రాంతంలో గ‌ట్టి పోటీ ఇచ్చింది కానీ, బీజేపీ మాత్రం ప‌రువు ద‌క్కించుకోలేక‌పోయింది. 

మ‌రి ప‌వ‌న్ ప్ర‌చారానికి వెళ్లి ఉంటే ప‌రిస్థితి అణుమాత్ర‌మైనా మారి ఉండేదేమీ కాదు. ప్ర‌చారం చేసినా, చేయ‌క‌పోయినా ప‌వ‌న్ క‌ల్యాణ్ బీజేపీకి స్నేహితుడే క‌దా! ఒక‌వేళ ప్ర‌చారానికి వెళ్లి ఉంటే మాత్రం.. ఫ‌లితాల వేళ ప‌వ‌న్ మరింత అభాసుపాల‌య్యేవాడు!