కర్ణాటక ఎన్నికలకు నెలనాళ్ల ముందు మీడియాలో జేడీఎస్-ఎంఐఎం పొత్తు గురించి వచ్చిన కథనాల్లో.. ఇది కాంగ్రెస్ కు షాకే అనే హెడ్డింగులు వచ్చాయి. కన్నడ నాట జేడీఎస్-ఎంఐఎంల మధ్యన చాన్నాళ్ల నుంచినే దోస్తీ ఉంది.
ఒక సిద్ధాంతం అంటూ ఏమీ లేని జేడీఎస్ కావాలనుకుంటే ఎంఐఎంతో పొత్తూ పెట్టుకోగలదు, సందు దొరికితే బీజేపీతో కలిసి ప్రభుత్వాన్నీ ఏర్పాటు చేయగలదు. ఇక బీజేపీ బాగు కోసమే పని చేస్తున్న ఎంఐఎం కన్నడ ఎన్నికల్లో కూడా దూరింది. ఎన్నో కొన్ని ఓట్లను చీల్చి బీజేపీకి మేలు చేయడం ఎంఐఎం అజెండాగా కొన్నేళ్లుగా కొనసాగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో కన్నడనాట కూడా అదే జరుగుతుందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి.
అయితే కన్నడనాట మాత్రం ఎంఐఎంవైపే కాదు, ఎంఐఎం పొత్తు పెట్టుకున్న జేడీఎస్ కు కూడా గట్టి ఝలక్ తగిలింది. ముస్లింల జనాభా గట్టిగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఎక్కడా ఎంఐఎంకు డిపాజిట్ దక్కలేదు. ఒక్క సీటులో ఐదు వేల స్థాయి ఓట్లను పొందడం తప్ప కర్ణాటక ఎన్నికల్లో ఎంఐఎం చెప్పుకోదగిన ప్రదర్శన ఏదీ చేయలేకపోయింది. అది కూడా జేడీఎస్ తో పొత్తు వల్ల కూడా కాస్త లాభం పొందలేకపోయింది.
అలాగే జేడీఎస్ కు కూడా ఎంఐఎం పొత్తు వల్ల చిన్నపాటి లాభం కలగకపోవడం గమనార్హం. కుమారస్వామి తనయుడు నిఖిల్ పోటీ చేసిన రామనగర నియోజకవర్గంలో ముస్లింల జనాభా గట్టిగానే ఉంటుంది. ఆది నుంచి దేవేగౌడ కుటుంబానికి ఇది చాలా సానుకూల నియోజకవర్గం.
గతంలో కుమారస్వామి, ఆ తర్వాత ఆయన భార్య అనితా కుమారస్వామి ఇక్కడ నుంచి విజయాలను నమోదు చేశారు. ఈ సారి ఎంఐఎం మద్దతుతో ముస్లిం ఓట్లు కూడా కుమారస్వామి తనయుడికి గట్టిగా పడాల్సింది. అయితే ఇక్కడ నుంచి దేవేగౌడ మనవడు ఓడిపోయాడు. కాంగ్రెస్ ఈ సీటును సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది.
ఏదో ఒకటీ రెండు నియోజకవర్గాల్లో ఐదారు వేల ఓట్లు పొందడం తప్ప ఎంఐఎం కన్నడ నాట ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవడమే కాకుండా, ఎంఐఎం దోస్తీ అయిన జేడీఎస్ కూడా తన ఓట్ల శాతాన్ని భారీగా కోల్పోయింది. ఇదీ కర్ణాటకలో ఒవైసీ ప్రభావం.