కుబేరులను కూడా పేదల కోటాలో వేయాలా?

అమరావతి ప్రాంతంలో నిరుపేదలు కూడా నివాసం ఉండేలా.. ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని జగన్ సర్కారు నిర్ణయించింది. దీనికి రాజకీయ ప్రత్యర్థులు, పచ్చదళాలు ఎంతగా మోకాలడ్డుతూ వచ్చాయో అందరమూ గమనించాము. కోర్టు ద్వారా ఎన్ని…

అమరావతి ప్రాంతంలో నిరుపేదలు కూడా నివాసం ఉండేలా.. ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని జగన్ సర్కారు నిర్ణయించింది. దీనికి రాజకీయ ప్రత్యర్థులు, పచ్చదళాలు ఎంతగా మోకాలడ్డుతూ వచ్చాయో అందరమూ గమనించాము. కోర్టు ద్వారా ఎన్ని అడ్డంకులు సృష్టించవచ్చో అన్నీ చేశారు. తీరా హైకోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది. 

అమరావతి ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్లు ఉండకూడదంటే ఎలా? అంటూ హైకోర్టు వారికి మొట్టికాయలు వేసింది. అప్పటికీ సుప్రీం కు వెళ్లారు. మరోవైపు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతోంటే.. దానిని వ్యతిరేకించే ధర్నాలు చేయాలని ఇంకో కుట్ర చేస్తున్నారు. 

ఇన్నింటినడుమ పచ్చ మీడియా మరో రకమైన కుయుక్తులకు పాల్పడుతోంది. ఇక్కడ ఇళ్లస్థలాలు ఇవ్వడానికి ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితానుంచి.. తమ పార్టీ వారు కాదనే అనుమానంతో పలువురి పేర్లను తొలగిస్తున్నారంటూ కొత్త ప్రచారం ప్రారంభించింది. 

‘మన వాళ్లు కాదా.. అయితే అనర్హత వేటు వేయండి’ అని వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నట్టుగా, లబ్ధిదారుల జాబితాలను వడపోత పోస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. లబ్ధిదారుల్లో పేదలెవరో తేల్చకుండా, వడపోత పోయకుండా అసలు పట్టాలు ఎలా ఇస్తారు? ఈ సింపుల్ లాజిక్ పట్టించుకోకుండా పచ్చ మీడియా కుట్రపూరిత కథనాలను వండివారుస్తోంది. వాళ్ల ఏడుపు చూస్తే నవ్వొస్తుంది. 

300 యూనిట్ల కరెంటు వాడకం మించి బిల్లు చెల్లిస్తున్న వారిని పేదల కోటాలోంచి తొలగించి.. వారికి అనేక పథకాలను ప్రభుత్వం తప్పిస్తోంది. అలాగా అమరావతి ప్రాంతంలో ఒక సెంటు భూమి నివాసస్థలం పొందే లబ్ధిదారుల్లో కూడా ఇలాంటి వారిని ఏరేస్తున్నారు. దీని మీద పచ్చమీడియా ఏడుస్తోంది. 

300 యూనిట్ల నెలసరి విద్యుత్తు వాడకం అంటే.. వారికి ఇంట్లో ఏసీ ఉంటే తప్ప అంత వాడకం రాదు. ఏసీలు కలిగిఉండే వారిని కూడా పేదలుగా పరిగణించి.. ఒక్క సెంటు జాగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలా అనే సందేహం కలుగుతోంది. అలాగే సొంత ఇళ్లు ఉన్న వారి పేర్లను కూడా తొలగిస్తున్నారని పచ్చ మీడియా విలపిస్తోంది. స్థలాలు ఇవ్వడం గతిలేని పేదలకోసమే కానీ, సొంత ఇళ్లు కలిగి ఉండి.. మరో పట్టా తీసుకుని వ్యాపారం చేసుకునే వారికి కాదు కదా. 

ప్రభుత్వం చాలా పద్ధతి ప్రకారం అర్హులకు మాత్రమే, పేదలకు మాత్రమే ఇళ్లస్థలాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ జాబితాలను వడపోస్తోంటే బాధ్యతగల మీడియాగా అభినందించాల్సిందిపోయి.. పచ్చమీడియా ఇలాంటి చెత్త కథనాలు ప్రచురించడం సమాజానికి ద్రోహం చేయడమే అని ప్రజలు అనుకుంటున్నారు.